రీమేక్ లతో బండి లాక్కొచ్చే కన్నడ హీరోలకు సబ్జెక్టుల కరువు వచ్చినట్టుగా ఉంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వచ్చే సినిమాను క్రమం తప్పకుండా చూసి, వాటిని తమ భాషలో రీమేక్ చేస్తూ ఉంటారు కన్నడ హీరోలు. ఇన్నాళ్లూ కన్నడలోకి సినిమాల అనువాదంపై అప్రకటిత నిషేధం లాంటిది ఒకటి ఉండేది. అధికారికంగా అలాంటి నిషేధాలు వేయడానికి చట్టం అంగీకరించదు. అయితే కన్నడ చిత్రసీమ ఒక మాట మీద నిలబడి అలాంటి నిషేధాన్ని దశాబ్దాల పాటు కొనసాగించగలిగింది.
అయితే ఈ మధ్య అది కూడా వాళ్లు పాటించడం లేదు. అనేక సినిమాలు ఇప్పుడు కన్నడలోకి డబ్ అయి విడుదల అవుతున్నాయి. సైరా నరసింహారెడ్డితో పాటు.. ఇటీవలి ఓటీటీ సినిమా వీ కూడా కన్నడలోకి డబ్ అయ్యింది. తమిళ సినిమాలు కూడా ఇప్పుడు కన్నడలోకి డబ్ అయ్యి విడుదల అవుతున్నాయి. ఒకరకంగా కన్నడ హీరోలకు రీమేక్ తలుపులు మూసుకుపోతున్నాయి.
ఇలాంటి క్రమంలో వాళ్లు బాగా పాపులర్ మూవీలను రీమేక్ చేసే సాహసం చేస్తుండటం గమనార్హం. త్రీ ఇడియట్స్ సినిమాను ఇప్పుడు కన్నడలో రీమేక్ చేస్తున్నారట. ముంగారు మలై హీరో గణేష్, రాజేష్ కృష్ణ, పునీత్ రాజ్ కుమార్ లు ఆ సినిమాలో నటిస్తారట!
ఎప్పటి త్రీ ఇడియట్స్? ఇప్పుడు రీమేక్ చేయడం ఏమిటి! హిందీ వెర్షన్ వచ్చి 10 యేళ్లు దాటాయి. తర్వాత తమిళులు రీమేక్ చేశారు. తెలుగులోకీ అనువదించారు. అయినా దక్షిణాదిన ఆ సినిమా హిట్ కాలేదు. సినీ ప్రియులు అప్పటికే ఒరిజినల్ ను చూసేయడంతో రీమేక్ పెద్దగా హిట్ కాలేదు. దానికి తోడు.. ఏదో లోపించినట్టుగా అనిపించింది.
కన్నడీగులు కూడా త్రీ ఇడియట్స్ ను చూసే ఉంటారు. అలాగే తమిళ, తెలుగు వెర్షన్ల ప్రభావం వారి మీద ఉండనే ఉంటుంది. బాగా పాపులర్ అయిపోయి, విడుదలై దశాబ్దం గడిచిన సినిమాను ఇప్పుడు రీమక్ చేస్తూ.. కన్నడ హీరోలు తమ కథల కరువును చాటుకుంటున్నారు. ఈ రీమేక్ ప్రకటనపై కన్నడ సినీ ప్రియులే పెదవి విరుస్తున్నారు.