తొంద‌ర ప‌డి ఓ కోయిల ముందే ఏడ్చిందా….!

తొంద‌ర ప‌డి ఓ కోయిల ముందే కూసింద‌న్న చందంగా… టీడీపీ అధినేత చంద్ర‌బాబు తొంద‌ర ప‌డి ముందే ఏడ్చాడ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. క‌నీసం సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ఆరు నెల‌ల ముందు ఇలాంటి ప‌ని చేసి…

తొంద‌ర ప‌డి ఓ కోయిల ముందే కూసింద‌న్న చందంగా… టీడీపీ అధినేత చంద్ర‌బాబు తొంద‌ర ప‌డి ముందే ఏడ్చాడ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. క‌నీసం సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ఆరు నెల‌ల ముందు ఇలాంటి ప‌ని చేసి వుంటే ఆయ‌న‌కు రాజ‌కీయంగా లాభించి వుండేది. 

ఇంకా రెండున్న‌రేళ్ల స‌మ‌యం వుండ‌గానే ఏకైక అస్త్రాన్ని బాబు ప్ర‌యోగించ‌డం వ‌ల్ల నిష్ప్ర‌యోజ‌న‌మైంది. రాజ‌కీయాల్లోకి కుటుంబ స‌భ్యుల్ని లాగ‌డం ఎంత మాత్రం క్ష‌మార్హం కాదు. అయితే ఈ విష‌యంలో బాధిత కుటుంబం ఏదైనా ఉందంటే అది వైఎస్సార్‌దే అని చెప్పొచ్చు. 

బ‌హుశా వైఎస్సార్ కుటుంబం వ్య‌క్తిత్వ హ‌న‌నానికి గురైన‌ట్టు దేశంలో మ‌రే రాజ‌కీయ కుటుంబం బ‌లి అయి ఉండ‌ద‌నే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు ఉదాహ‌ర‌ణ నిన్న‌మొన్న‌టి బోస్‌డీకే తిట్టే నిలువెత్తు నిద‌ర్శ‌నం. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ విష‌యానికి వ‌స్తే ఆయ‌న త‌ల్లి, చెల్లి, భార్య‌ను నిత్యం ఏదో రకంగా టీడీపీ నేత‌లు దూషిస్తూనే ఉన్నారు. అప్పుడు మాత్రం ఎంజాయ్ చేసి, త‌మ‌ను మాత్రం ఏమీ అన‌కూడ‌ద‌ని కోరుకోవ‌డం వ‌ల్లే ఈ స‌మ‌స్యంతా.  

ఎదుటి వాళ్ల నుంచి మ‌నం ఏ విధ‌మైన మ‌ర్యాద‌ను కోరుకుంటామో, అదే మ‌ర్యాద‌ను వారికి ఇస్తే ఎలాంటి స‌మ‌స్య‌లుండ‌వు. కానీ ఎల్లో బ్యాచ్ అలా వుండ‌డం లేద‌ని వైసీపీ విమ‌ర్శు. ప్ర‌స్తుతానికి వ‌స్తే 72 ఏళ్ల చంద్ర‌బాబు చిన్న పిల్ల‌ల్లా వెక్కివెక్కి ఏడ్వ‌డం చూస్తే ఎవ‌రికైనా మ‌న‌సు చివుక్కుమంటుంది. 

కానీ ఇది తాత్కాలిక‌మే. 2003లో త‌న‌పై అలిపిరిలో న‌క్స‌లైట్లు మందు పాత‌ర పేలిస్తే…దాన్ని రాజ‌కీయంగా సొమ్ము చేసుకునేందుకు చంద్ర‌బాబు అద్భుత‌మైన వ్యూహం ర‌చించారు. ఏడాది ముందుగానే అసెంబ్లీని ర‌ద్దు చేశారు. త‌న‌పై హ‌త్యాయ‌త్నాన్ని సొమ్ము చేసుకోవాల‌నే ప్ర‌య‌త్నాల‌కు 2004లో ఉమ్మ‌డి ఏపీ ప్ర‌జ‌లు ఏ విధంగా బుద్ధి చెప్పారో అంద‌రికీ తెలిసిందే.

అలాంటిదే ఇప్పుడు ఏడిస్తే జ‌నం మ‌న‌సు క‌రిగి ఏదో జ‌రిగిపోతుంద‌నే భ్ర‌మ‌ల నుంచి టీడీపీ శ్రేణులు, నాయ‌కులు ఎంత త్వ‌ర‌గా బ‌య‌టికొస్తే అంత మంచిది.  ఏ ర‌కంగా చూసినా చంద్ర‌బాబు నిన్న తొంద‌ర‌ప‌డ్డాడ‌నే అభిప్రాయాలు సొంత పార్టీ నుంచి కూడా వ్య‌క్త‌మ‌వుతున్నాయి. నిజానికి నిన్న అసెంబ్లీలో టీడీపీ చ‌ర్య‌కు అంబ‌టి మాట‌లు ప్ర‌తిచ‌ర్య మాత్ర‌మే. అంబ‌టి రాంబాబు గ‌డుసుత‌నం తెలిసి కూడా ఆయ‌న వ్య‌క్తిగ‌త అంశాల‌ను స‌భ‌లో ప్ర‌స్తావించ‌డాన్ని ఎవ‌రు మాత్రం స‌మ‌ర్థిస్తారు?

టీడీపీ ప్ర‌జాప్ర‌తినిధులు అంబ‌టి గురించి న‌ర్మ‌గ‌ర్భ వ్యంగ్య వ్యాఖ్య‌లు చేసిన‌ట్టే, అత‌ను కూడా అదే స్థాయిలో మాజీ మంత్రి ఎలిమినేటి మాధ‌వ‌రెడ్డి పేరు ప్ర‌స్తావించి ఏడ్పించారు. ఇందులో ప్ర‌జానీకం బాధ‌ప‌డాల్సిందేముంది? ఇక్క‌డ చంద్ర‌బాబు కాస్త సంయ‌మ‌నం పాటించి, మ‌రో బ‌ల‌మైన కార‌ణంతో అసెంబ్లీని బ‌హిష్క‌రించి వుంటే ప్ర‌జ‌ల నుంచి మ‌ద్ద‌తు ల‌భించి వుండేదేమో! చిల్ల‌ర విష‌యాల‌కు అసెంబ్లీని బ‌హిష్క‌రిస్తే జ‌నం ఎందుకు మ‌ద్ద‌తు ఇస్తారు? ఈ మాత్రం లాజిక్ తెలుసుకోకుండా చంద్ర‌బాబు ఆవేశ‌ప‌డ్డార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై మాట్లాడ్డానికి అవ‌కాశం ఇవ్వ‌లేద‌నే కార‌ణంతోనో, లేక స‌మాజాన్ని ప్ర‌భావితం చేసే అంశాల‌ను సాకుగా చూపి అసెంబ్లీని బ‌హిష్క‌రించి వుంటే కొద్దోగొప్పో ఆద‌ర‌ణ ల‌భించి వుండేది. కానీ చంద్ర‌బాబు అలా చేయ‌లేదు. త‌న కుటుంబ స‌మ‌స్య‌ను కార‌ణంగా చూపి బ‌య‌టికొచ్చారు. వెక్కివెక్కి ఏడ్చారు. 

వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు ఎప్పుడూ కూడా స‌మాజాన్ని ప్ర‌భావితం చేయ లేవ‌నే సంగ‌తి చంద్ర‌బాబుకు తెలియంది కాదు. కానీ ఆయ‌న లోతుగా ఆలోచించే త‌త్వాన్ని, నిగ్ర‌హ శ‌క్తిని కోల్పోతు న్న‌ట్టుగా ఆయ‌న ఏడ్వ‌డాన్ని బ‌ట్టి అర్థం చేసుకోవ‌చ్చు. అయినా మంత్రాల‌కు చింత‌కాయ‌లు, బాబు క‌న్నీళ్ల‌కు ఓట్లు రాలుతాయా?  టీడీపీ అధినేత ప‌రిస్థితే ఇలా వుంటే… ఇక ద్వితీయ‌, తృతీయ శ్రేణుల మాటేంటి?