3 చట్టాలు సరే.. 3 వేల కేసుల సంగతేంటి?

ప్రధాని నరేంద్రమోడీ వ్యవసాయ చట్టాల విషయంలో వెనక్కి తగ్గారు. ఏడాదికి పైగా రైతులు సాగించిన సుదీర్ఘమైన పోరాటం.. ఢిల్లీ సరిహద్దులను ముట్టడించి.. లాఠీచార్జీలకు పోలీసు దౌర్జన్యాలకు కాల్పులకు కూడా వెరవకు చూపించిన పోరాట పటిమ…

ప్రధాని నరేంద్రమోడీ వ్యవసాయ చట్టాల విషయంలో వెనక్కి తగ్గారు. ఏడాదికి పైగా రైతులు సాగించిన సుదీర్ఘమైన పోరాటం.. ఢిల్లీ సరిహద్దులను ముట్టడించి.. లాఠీచార్జీలకు పోలీసు దౌర్జన్యాలకు కాల్పులకు కూడా వెరవకు చూపించిన పోరాట పటిమ విజయం సాధించింది. సామదానభేద దండోపాయాలన్నీ ప్రయోగించిన మోడీ సర్కారు చివరికి ఓటమి పాలైంది. రైతులకు క్షమాపణ చెప్పి మరీ నరేంద్రమోడీ చట్టాలను వెనక్కు తీసుకున్నారు. 

ఇంతవరకు బాగానే ఉంది. నరేంద్రమోడీ చాలా ఉదాత్తమైన, వెనక్కు తగ్గడానికి కూడా ఈగో లేని అద్భుతమైన నాయకుడిగా ఇప్పుడు ఆయనకు ప్రశంసలు దక్కుతున్నాయి. మోడీ వంటి రైతుబాంధవుడు చరిత్రలో ఉండడని కూడా అంటున్నారు. ఆయనేమో రైతుల కోసమో తాను చాలా గొప్ప చట్టాలు తయారు చేసినప్పటికీ.. రైతులకు అవి అర్థం కాలేదు గనుక.. ఉపసంహరిస్తున్నట్టు సెలవిచ్చారు. అక్కడితో అయిపోయిందా? మోడీని దేశంలోని రైతులంతా నెత్తిన పెట్టుకోవాల్సిందేనా?

అలా అని ఏకపక్షంగా అనుకోవడానికి వీల్లేదు. అప్పుడే రైతు బాంధవ నాయకుడని మోడీని కీర్తించడానికి వీల్లేదు. ఎందుకంటే బిడ్డ చచ్చినా పురిటి వాసన పోలేదన్న సామెత చందంగా.. మోడీ.. మూడు వ్యవసాయ చట్టాలనురద్దు చేసినప్పటికీ.. దాదాపు మూడువేలకు పైగా కేసులు రైతులపై ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. వాటి సంగతి తేల్చే వరకు, సదరు కేసులు అన్నింటినీ బేషరతుగా రద్దు చేసేవరకు మోడీని రైతుబాంధవుడని అనలేం.

ఈ చట్టాల రద్దు కోసం పోరాడిన రైతులపై పంజాబ్, హర్యానా, యూపీ తదితర ప్రాంతాల్లో చాలా పెద్ద ఎత్తున కేసులు నమోదు చేశారు. మామూలు క్రిమినల్ కేసులతో పాటు చట్టవ్యతిరేక పనులు  చేస్తే నమోదు చేసే ఉపా కేసులు కూడా రైతులపై నమోదు అయ్యాయి. ఢిల్లీలో 39 కేసులు, హర్యానాలో మరో 136 కేసులు, యూపీలో వేర్వేరు ప్రాంతాల్లో మరో వంద కేసులు ఇలా లెక్కకు మిక్కిలిగా కేసులున్నట్టు ప్రభుత్వం వెల్లడించిన వివరాలే చెబుతున్నాయి. రైతు సంఘాలు చెప్పే ప్రకారం దాదాపు మూడువేల మందికి పైగా రైతులపై కేసులున్నాయి.

వీటన్నింటికీ విముక్తి కల్పించాలి. మూడు చట్టాల రద్దుకు సంబంధించి.. రాజకీయ ప్రక్రియ పూర్తి చేయడానికి పార్లమెంటు సమావేశాలు అవసరం గానీ.. ఈ మూడువేల మందిపై కేసులు ఎత్తివేయడానికి, బేషరతుగా.. వ్యవసాయ చట్టాలపై పోరాడిన రైతులపై దేశవ్యాప్తంగా నమోదు అయిన అన్ని కేసులను ఎత్తివేయాలి. అలా చేసినప్పుడు ప్రధాని నరేంద్రమోడీకి రైతులపట్ల గౌరవం, ఈ నిర్ణయం పట్ల చిత్తశుద్ధి ఉందని అర్థమవుతుంది.