వ్యక్తిత్వ హననం..ఈనాటిదా?

ఈరోజు శాసనసభలో నందమూరి ఆడపడుచు వ్యక్తిత్వ హననం చేసే ప్రయత్నం జరిగింది. చాలా మంది ఈ విషయమై గొంతు చించుకుంటున్నారు. నిజమే. ఎవరి వ్యక్తిత్వ హననం చేసే ప్రయత్నం అయినా అది ముమ్మాటికీ తప్పే.…

ఈరోజు శాసనసభలో నందమూరి ఆడపడుచు వ్యక్తిత్వ హననం చేసే ప్రయత్నం జరిగింది. చాలా మంది ఈ విషయమై గొంతు చించుకుంటున్నారు. నిజమే. ఎవరి వ్యక్తిత్వ హననం చేసే ప్రయత్నం అయినా అది ముమ్మాటికీ తప్పే. ఈ రోజు కన్నా కొద్ది రోజుల క్రితం తెలుగుదేశం ఎమ్మెల్యే వంశీ మీడియా ముందు లోకేష్ మీద ఆయన పోలికల మీద చేసిన వ్యాఖ్యలు మరీ తప్పు. దారుణం. కచ్చితంగా ఖండించాల్సినవే. 

నిజానికి ఆరోజే తెలుగుదేశం కేడర్ స్పందించి ఆందోళన చేసి వుండాల్సింది. ఆ రోజే భువనేశ్వరి తన మీద ఓ వ్యక్తి చేసిన దారుణ కామెంట్ల మీద పోలీస్ కేసు పెట్టి వుండాల్సింది. ఆ రోజు వదిలేసారు. ఈ రోజు అసెంబ్లీలో వాటి ప్రస్తావనకు బాధపడుతున్నారు. సరే, ఏదయినా ఇదంతా ముమ్మాటికీ తప్పే. ఇలాంటి పరిస్థితి రాకుండా వుండాల్సింది.

కానీ రాజకీయాల్లో వ్యక్తిత్వ హననం గురించి ఇప్పుడు ఇంతలా మాట్లాడే పెద్దలు గత దశాబ్దంన్నర కాలంగా మీడియాలో జగన్ మీద జరుగుతున్న వార్తల గురించి ఆలోచించండి. తెలుగుదేశం అనుకూల మీడియాలో వైఎస్ వున్నప్పటి నుంచి జగన్ మీద కేసులు పడిన దగ్గర నుంచి, విచారణ జరుగుతున్నపుడు కూడా ఎన్ని రకాల గ్యాసిప్ లు వండి వార్చారు. ఎంత వ్యక్తిత్వ హననానికి పూనుకున్నారు. 

అన్న చెల్లెళ్ల మధ్య గొడవలు సృష్టించే ప్రయత్నం చేసారు. జగన్ తన కేసుల టైమ్ లో కుర్చీ కాలుతో తన్నాడని, కీ హోల్ లోంచి చూసినట్లు రాసుకువచ్చారు. జైల్లో వున్న జగన్ మీద వార్తలు అల్లారు. ఆఖరికి జగన్ రాత్రి పూట ఆత్మలతో, దేవుడితో మాట్లాడతాడని కథలు అల్లారు. 

ఇక షర్మిల మీద జరిగినంత వ్యక్తిత్వ హనన ప్రయత్నం ఇంతా అంతా కాదు. జగన్ తాత రాజారెడ్డి గురించి తెలియనివారు కూడా ఆయనో కరుడు కట్టిన ఫ్యాక్షనిస్టు అని ముద్ర వేస్తూ ఇప్పటికీ వార్తలు వండి వారుస్తున్నారు. ఆంధ్రను పులివెందుల చేసేస్తున్నాడు అంటూ జగన్ మీద వార్తలు రాస్తూనే, పులివెందుల పరువు తీసే ప్రయత్నం సదా జరుగుతోంది.

ఎన్టీఆర్ భార్య లక్ష్మీ పార్వతి మీద ఎలాంటి కథలు అల్లి ప్రచారం చేసారో గుర్తు లేదా?

ఇదంతా క్యారెక్టర్ అసాసినేషన్ కాదా? ఆ రోజు ఒక్కరు కూడా దాని గురించి మాట్లాడలేదు. ఏ సినిమా జనాలు, ఏ రాజకీయ జనాలు కూడా. కానీ ఇప్పుడు తమ దాకా వచ్చేసరికి అందరి నోళ్లు లేస్తున్నాయి.