మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తర్వాత అఖిల్ ఏ సినిమా చేస్తాడనే సస్పెన్స్ కంటే.. సైరా తర్వాత సురేందర్ రెడ్డి ఏ హీరోతో సినిమా చేయబోతున్నాడనే ఉత్కంఠ ఎక్కువగా నడిచింది. ఎట్టకేలకు ఆ సస్పెన్స్ కు తెరపడింది. సైరా తర్వాత సురేందర్ రెడ్డి చేయబోయే సినిమా అఫీషియల్ గా లాక్ అయింది. అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కొత్త సినిమా ప్రకటన వచ్చేసింది.
నిజానికి వీళ్లిద్దరి కాంబినేషన్ ఫిక్స్ అయిందనే విషయం కొన్ని రోజుల నుంచి మార్కెట్లో నలుగుతూనే ఉంది. అటు నిర్మాత అనీల్ సుంకర కూడా ఈ ప్రాజెక్టును అప్పుడే ప్రకటించాలనుకున్నాడు. కాకపోతే సరిలేరు నీకెవ్వరు సినిమాతో ఆయనకు 9 సెంటిమెంట్ పట్టుకుంది. అందుకే 9వ నెల 9వ తేదీన (అంటే ఈరోజు) ఉదయం 9 గంటల 9 నిమిషాలకు ఈ సినిమాను ప్రకటించాడు.
మొత్తానికి అఖిల్-సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో సినిమా ప్రకటన వచ్చేసింది. అయితే ఈ కాంబినేషన్ వెనక పైకి కనిపించని మరో హిట్ కాంబినేషన్ ఉంది. అదే సురేందర్-వక్కంతం వంశీ జోడీ. వీళ్లిద్దరూ కలిసి గతంలో కిక్, రేసుగుర్రం లాంటి సెన్సేషనల్ హిట్స్ ఇచ్చారు. మళ్లీ ఇన్నాళ్లకు కలిసి ఈ జంట.. అఖిల్ కు హిట్ ఇస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.
అఖిల్ కెరీర్ లో పుల్ లెంగ్త్ కమర్షియల్ ఎంటర్ టైనర్ ఇదే. ఈ హీరో మార్కెట్ తో సంబంధం లేకుండా భారీ బడ్జెట్ తో సినిమాను నిర్మించాలని ఫిక్స్ అయ్యాడు అనీల్ సుంకర.