మూడు రాజధానుల విషయంలో వైసీపీ ప్రభుత్వం పోరాటం చేయాల్సింది ప్రతిపక్షాలతో కాదు, న్యాయస్థానాలతో కాదు. ప్రభుత్వం నచ్చజెప్పాల్సింది, బుజ్జగించాల్సింది కేవలం రాజధాని ప్రాంత రైతుల్ని. ఇన్నాళ్లూ ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తూ, కోర్టు కేసులతో నలిగిపోతున్న జగన్ సర్కారు.. ఇప్పుడు రైట్ ట్రాక్ లోకి వచ్చింది. అమరావతి ఉద్యమంపై ఫోకస్ పెట్టింది.
ప్రతిపక్షాల ట్రాప్ లో పడిపోయి ఉద్యమం ఇప్పటికే పక్కదారి పట్టిందని అంటున్న మంత్రులు, ఇప్పటికైనా రైతులు ప్రభుత్వంతో చర్చలు జరపాలని కోరుతున్నారు. పచ్చపాత మీడియా మైక్ పెట్టి రెచ్చగొట్టగానే సీఎంపై విమర్శలు చేయడం మాని, సమస్య పరిష్కారానికి ఏం చేయాలో ఆలోచించాలని హితవు పలికారు. ఉద్యమం పేరుతో నష్టపోవద్దని, భావితరాలకు నష్టం చేకూర్చొద్దని రైతులకు సూచించారు మంత్రి కొడాలి నాని.
పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు అవకాశం లేని రాజధానిలో అసెంబ్లీ సమావేశాలు పెట్టుకోవాలా? అసలక్కడ అసెంబ్లీ ఉండాలా? అంటూ కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సందర్భంలో.. ఒకరోజంతా రాజకీయాలన్నీ కొడాలి చుట్టూనే తిరిగాయి. టీవీ డిబేట్లన్నీ నాని వ్యాఖ్యలపైనే నడిచాయి. అయితే తన వ్యాఖ్యలపై వివరణ ఇస్తూనే.. అమరావతి విషయంలో మరికొన్ని ప్రశ్నల్ని లేవనెత్తారు నాని. ఉద్యమాలు చేస్తున్న రైతుల్ని కూడా ఆలోచనలో పడేశారు.
అమరావతిలో నిరుపేదలకు ఇళ్లు ఇచ్చేందుకు రైతులు అంగీకరించి, కోర్టులో వేసిన కేసులు ఉపసంహరించుకుంటే తన మంత్రి పదవికి సైతం రాజీనామా చేస్తానన్నారు కొడాలి. అదే సందర్భంలో రైతులు సమస్యను సాగదీయకుండా ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమవ్వాలని కోరారు. ప్రతిపక్షాల మాయలో పడి, ప్రజాబలం ఉన్న ప్రభుత్వాన్ని శత్రువులా చూడొద్దని, భావితరాలకు అన్యాయం చేయొద్దని సూచించారు.
అమరావతి కోసం రాజకీయ ఉద్యమాలు చేస్తున్న పార్టీలకు పెట్టుబడిదారుల నుంచి భారీమొత్తం ముడుతోందని, రైతుల్ని పావులుగా చేసుకుని వారు డ్రామాలాడుతున్నారని విమర్శించారు.
మొత్తమ్మీద మరోసారి అమరావతి రైతుల్ని ప్రభుత్వంతో చర్చలకు ఆహ్వానించారు మంత్రి కొడాలి నాని. కనీసం అసెంబ్లీ అయినా అమరావతిలో ఉండాలా, వద్దా? అనే ప్రశ్నతో తీవ్ర కలకలం రేపిన నాని, రైతులు సహకరిస్తే సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.