భారతీయ జనతా పార్టీలోకి నలుగురు రాజ్యసభ సభ్యులను పంపినా…ఊహించినట్టు, ఆశించినట్టు ఆ పార్టీ నుంచి సానుకూల సంకేతాలు రాకపోవడంతో తెలుగుదేశం పార్టీ ఆగ్రహంతో ఊగిపోతోంది. అలాగని టీడీపీ అధినేత చంద్రబాబు నోరు తెరిచి బీజేపీపై ఒక్క మాట కూడా మాట్లాడలేని దుస్థితి. బీజేపీ నేతలు మాత్రం సమయం, సందర్భం వచ్చినప్పుడల్లా చంద్రబాబుపై విరుచుకుపడుతున్నారు.
ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే చినరాజప్ప టీడీపీ అక్కసునంతా తన ప్రకటనలో వెళ్లగక్కారు. తమ పార్టీతో పాటు అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పిస్తున్న బీజేపీ నేతలను వైసీపీ అద్దె మైకులుగా తన ప్రకటనలో చినరాజప్ప అభివర్ణించారు. చినరాజప్ప చెబుతున్న ఆ ముగ్గురు బీజేపీ నేతల్లో సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహారావు, విష్ణువర్ధన్‌రెడ్డి ఉన్నారు. అధికారంలో ఉన్న వైసీపీని వదిలి ప్రతిపక్షమైన తమపై విమర్శలు చేయడం దేనికి సంకేతమని చినరాజప్ప ప్రశ్నించడం గమనార్హం.
చినరాజప్ప లేదా టీడీపీ ఆవేదనకు అర్థం లేకపోలేదు. విశాఖలో నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మీడియా సమా వేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై ఆయన నిప్పులు చెరిగారు. కృష్ణా పుష్కరాల సమయంలో 17 ఆలయా లను కూల్చేసిన టీడీపీకి హిందుత్వ వ్యవహారాలపై మాట్లాడే అర్హత లేదని తేల్చి చెప్పారు. అలాగే 14 ఏళ్ల చంద్రబాబు పాలనలో చంద్రబాబు ఆలయాలను కూల్చడమే కానీ, రాష్ట్రంలో ఒక్క ఆలయాన్నైనా నిర్మించారా అని ఆయన ప్రశ్నించారు.
అధికారంలో ఉన్నన్నాళ్లు చంద్రబాబుకు , ఆయన పార్టీ నేతలకు హిందుత్వం గుర్తుకు రాలేదా అని సోము ప్రశ్నించడం టీడీపీకి పుండు మీద కారెం చల్లినట్టైంది. అలాగే అనేక సందర్భాల్లో బీజేపీని ఇరికించాలనే టీడీపీ ప్రయత్నాలను బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహా రావు తనదైన స్టైల్‌లో తిప్పికొట్టారు.
ఇటీవల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ప్రధాని మోడీకి చంద్రబాబు లేఖ రాసిన విషయం తెలిసిందే. దీనిపై ఢిల్లీ వేధికగా జీవీఎల్ చీల్చి చెండాడారు. అలాగే బీజేపీ రాష్ట్ర నేత విష్ణువర్ధన్‌రెడ్డి కూడా ట్విటర్‌తో పాటు వివిధ చానళ్ల వేదికగా చంద్రబాబు గతంలో ప్రధానితో పాటు తమ పార్టీ పట్ల వ్యవహరించిన తీరును పేపర్ కటింగ్‌లను పెట్టి మరీ దుయ్యబట్టారు.
ఈ ముగ్గురు నేతలు టీడీపీ పాలిట కొరకరాని కొయ్యలుగా మారారు. దీంతో ఆ నేతలంటే టీడీపీ నేతలు మండిపడుతున్నారు. టీడీపీ ఆక్రోశం అంతా చినరాజప్ప ప్రకటనలో ప్రతిబింబించింది. మొత్తానికి బీజేపీకి చెందిన ఆ ముగ్గురు నేతల్ని వైసీపీ అద్దె మైకులుగా టీడీపీ భావిస్తున్నదన్న మాట.
మరి ఏపీ బీజేపీలో నాయకత్వం మారిన నేపథ్యంలో సుజనాచౌదరి, కన్నా లక్ష్మినారాయణ, కామినేని శ్రీనివాస్, రమేశ్‌నాయుడు తదితరులంతా తమ పార్టీ అద్దె మైకులుగా చినరాజప్ప పరోక్షంగా చెప్పదలిచారా?