మూడేళ్ల కిందట.. టాలీవుడ్ లో డ్రగ్స్ బాంబు పేలింది. అనేక మంది ప్రముఖులు డ్రగ్స్ వినియోగదారులు అంటూ వార్తలు వచ్చాయి. డ్రగ్స్ డీలర్లు దొరకగా వారి ద్వారా చిట్టా మొత్తం బయటపడిందని పోలీసులు ప్రకటించారు. ఈ విషయంలో పరిశోధనకు ప్రత్యేకంగా సిట్ ఏర్పాటు అయ్యింది. ఆ సిట్ విచారణకు అనేక మంది సినీ ప్రముఖులు హాజరయ్యారు. వారందరినీ విచారించిన సిట్.. కూపీ లాగుతున్నట్టుగా ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఏమైందో ఏమో.. అంతా కామ్!
ఆ వ్యవహారంలో విచారణకు హాజరైన వారి గురించి రకరకాల కథనాలు వచ్చాయి కానీ, వారెవరినీ పోలీసులు అరెస్టు చేయలేదు. వారిలో డ్రగ్స్ తీసుకున్న వారు ఉన్నారని, వేరే వాళ్లకు డ్రగ్స్ ఇచ్చిన వారు ఉన్నారని.. కూడా వార్తలు వచ్చాయి. ఒకవేళ అలాంటిది ఏమీ జరగకపోతే సిట్ విచారణే ప్రహసనం అవుతుంది. రకరకాల ఆధారాలు దొరికాయని, కొందరు ఒప్పుకున్నారని కూడా కథనాలు వచ్చాయి. అంతా కథనాలకే పరిమితం అయ్యింది.
ఎవ్వరినీ అరెస్టు చేయలేదు, ఎవరి దారిన వారిని వదిలేశారు. మూడేళ్లు గడిచిపోయాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో డ్రగ్స్ వినియోగం ఉన్నట్టో లేనట్టో సినిమా వాళ్లకే తెలియాలి! అప్పుడు ఏర్పాటు అయిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కు తెలియాలి!
ఇక తాజాగా కర్ణాటకలో ఒక హీరోయిన్ ని అరెస్టు చేశారు. డ్రగ్స్ వినియోగం కేసులో ఆమెను అరెస్టు చేశారు. అలాగే బాలీవుడ్ కు సంబంధించి రియా చక్రబర్తి, ఆమె సోదరుడిని అరెస్టు చేశారు. వీరు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కు డ్రగ్స్ ఇచ్చారనేది మీడియా మోపుతున్న అభియోగం.
అయినా ఎవరో ఇస్తే తీసుకోవడానికి సుశాంత్ ఏమీ చిన్నపిల్లాడు కాదు కదా.. అనేది కామన్ సెన్స్ వాదన. టాలీవుడ్ డ్రగ్స్ వినియోగదారులను ఎందుకు వదిలేసినట్టు, వేరే చోట్ల ఎందుకు అరెస్టులు జరుగుతున్నాయి.. అంటే.. అంతా రాజకీయం అనే మాట వినిపిస్తూ ఉంది. రాజకీయ పార్టీల అవసరాలను బట్టి.. అరెస్టులు జరగడం, జరగకపోవడం ఉంటోందనే వాదన వినిపిస్తోంది.