విమాన ప్రయాణాల్లో మద్యం సరఫరా చేస్తుంటారు. బిజినెస్ క్లాస్ ప్రయాణికులకు ఎంత కావాలంటే అంత మోతాదులో వారికి మద్యం ఇవ్వాల్సిందే. లేదంటే తమని అవమానించినట్టు ఫీల్ అవుతుంటారు పాసింజర్లు. ఎందుకంటే విమానయాన సంస్థల నియమాలు అలాగే ఉంటాయి.
అయితే ఎయిరిండియా ఈ మద్యం విధానాన్ని కాస్త సవరించింది. ప్రయాణికులకు ఇచ్చే మద్యంపై పరిమితి విధించింది. అయితే ఆ పరిమితి మనిషి మనిషికీ మారిపోతుందనమాట. కాస్త ఎక్కువగా మందు తాగి ఊగిపోతుంటే ఇక వారికి మద్యం ఇవ్వొద్దంటూ సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలిచ్చింది ఎయిరిండియా.
ఎందుకీ పరిమితి..?
ఇటీవల కాలంలో ఎయిరిండియా విమానాల్లో తోటి ప్రయాణికులతో అసభ్యంగా ప్రవర్తించేవారి సంఖ్య ఎక్కువైంది. సహచర ప్రయాణికురాలిపై మూత్రం పోసిన ఓ వ్యక్తి ఇప్పుడు కటకటాల పాలయ్యాడు. అతని ప్రవర్తన కారణంగా ఎయిరిండియా 30లక్షల జరిమానా చెల్లించాల్సి వచ్చింది. ఆ తర్వాత మరో సంఘటనలో 10 లక్షల రూపాయలు డీజీసీఏ జరిమానా విధించింది.
దీంతో ఎయిరిండియాకు షాకుల మీద షాకులు తగిలినట్టయింది. ప్రయాణికుల అనుచిత ప్రవర్తనకు కారణం మందు మోతాదు మించిపోవడమేనని తేలింది. అందుకే అతిగా మద్యం సర్వ్ చేయకూడదని సిబ్బందికి హుకుం జారీచేసింది.
నొప్పించక తానొవ్వక..
మందు కిక్కు బాగా తలకెక్కినవారికి ఆ తర్వాత అడిగినా కూడా మద్యం ఇవ్వకూడదని సిబ్బందికి ఎయిరిండియా సంకేతాలు పంపించింది. మద్యం ఇవ్వబోము అని చెప్పే సమయంలో వారి గౌరవానికి భంగం కలిగించకూడదని కూడా నియమం పెట్టింది. వారితో గొడవ పడకూడదని, ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని తాగుబోతులు, మందుబాబులు అని ఎగతాళి చేయొద్దని స్పష్టం చేసింది.
అంటే మర్యాదగానే వారి అభ్యర్థన తిరస్కరించాలన్నమాట. ఇంకా ఎక్కువ తాగితే మీరు మీ కంట్రోల్ లోనే కాదు, మా కంట్రోల్ లో కూడా ఉండరు అని చెప్పి తప్పించుకోవాలని సూచించింది ఎయిరిండియా. మరి ఈ నిబంధన తర్వాత ఇంకెన్ని గొడవలు జరుగుతాయో వేచి చూడాలి.