సిక్కోలు జిల్లాను తీపి చేస్తున్న జగన్…?

అధికారంలో ఉన్న వారు దయార్ద్ర హృదయులు అయితే జనాలకు ఎంతో మేలు జరుగుతుంది. మాటలతో బూరెలు వండేసి అదే తీపి అనుకోమని చెప్పే వారికి జనాలు కూడా సరైన సమయం చూసి కర్రు కాల్చి…

అధికారంలో ఉన్న వారు దయార్ద్ర హృదయులు అయితే జనాలకు ఎంతో మేలు జరుగుతుంది. మాటలతో బూరెలు వండేసి అదే తీపి అనుకోమని చెప్పే వారికి జనాలు కూడా సరైన సమయం చూసి కర్రు కాల్చి వాత పెడతారు. ఇక మాటలతో కాదు, చేతలతో తీపి చేసే నేతలను మాత్రం చరిత్రలో గుర్తుంచుకుంటారు.

ఇపుడు అలాంటి ఒక చారిత్రాత్మక నిర్ణయానికే జగన్ ఆమోద ముద్ర వేస్తున్నారు. అత్యంత వెనకబడిన శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాలవలస చక్కెరె కర్మాగారాన్ని చంద్రబాబు 2003లో మూసేశారు. లాభాల బాటలో అప్పటిదాకా నడిచిన ఈ కర్మాగారం మూత పడిపోవడంతో వేలాదిగా రైతులు, కర్మాగారం ఉద్యోగులు అంతా రోడ్డున పడ్డారు.

ఇక జిల్లాలో చెరకు పండించే వారంతా చేదు బతుకులే ఈడుస్తున్నారు. చంద్రబాబు తానే మూసేసిన చక్కెర కర్మాగారం తిరిగి తెరుస్తామని 2014 ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఆయన తన మాట నిలబెట్టుకోలేదు సరికదా 2018లో అదే ఆముదాలవలస ఏరువాక సభకు వచ్చి ఇక ఫ్యాక్టరీ తెరచే చాన్సే లేదని చల్లగా చావు కబురు చెప్పేశారు.

ఇక అదే ఏడాది డిసెంబర్ లో పాదయాత్ర ద్వారా జిల్లాకు వచ్చిన జగన్ తాను అధికారంలోకి వస్తే చక్కెర కర్మాగారానికి ఊపిరి పోస్తానని రైతులకు భారీ హామీ ఇచ్చారు. ఇపుడు ఆయన తన మాటను నిలబెట్టుకునే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. చక్కెర ఫ్యాక్టరీ ఫీజుబిలిటీకి సంబంధించి రిపోర్ట్ ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ను జగన్ ప్రభుత్వం తాజాగా ఆదేశించింది.

దీంతో జిల్లాలోని చెరకు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చక్కెర ఫ్యాక్టరీ దాదాపు ఎనభై ఎకరాలలో ఏర్పాటు చేసిన అతి పెద్ద సహకార కర్మాగారంగా ఇప్పటికి ఆరున్నర‌ పదుల క్రితం దీనిని  ఏర్పాటు చేశారు. దీనిని తెరిపించడం ద్వారా ప్రభుత్వానికి లాభాలే తప్ప నష్టాల ఊసే ఉండదు, ఫ్యాక్టరీకి లక్ష ఎకరాల సాగు పంటగా చెరకు సమీపంలోనే ఉంది. 

మొత్తానికి జగన్ కర్మాగారం తలుపులు తెరచేందుకు తీసుకుంటున్న చర్యలతో అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది జిల్లాకు అతి పెద్ద తీపి కబురుగా చూస్తున్నారు.