కేసీఆర్ కు ఛాన్స్ మిస్ ….!

తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎందుకో జాతీయ స్థాయి అవకాశాలు మిస్ అవుతున్నాయి. గతంలో దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తెస్తానని, ఎన్డీయేకు, ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా కాంగ్రెసేతర, బీజేపీయేతర ప్రతిపక్షాలను ఏకం…

తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎందుకో జాతీయ స్థాయి అవకాశాలు మిస్ అవుతున్నాయి. గతంలో దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తెస్తానని, ఎన్డీయేకు, ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా కాంగ్రెసేతర, బీజేపీయేతర ప్రతిపక్షాలను ఏకం చేస్తానని, ఇందుకోసం దేశమంతా పర్యటిస్తానని భీకర ప్రతిజ్ఞ చేశారు. 

దాని ప్రకారమే బెంగాల్ కు వెళ్లి మమతా బెనర్జీని, ఒడిశా వెళ్లి నవీన్ పట్నాయక్ ను … ఇలా కొంతమందిని కలిసి మాట్లాడారు. కారణాలు ఏమైనాగానీ కేసీఆర్ అనుకున్నది కాలేదు. ఇక ఇప్పుడు రాష్ట్రంలో ధాన్యం కొనుగోలుపై సాగిస్తున్న రాజకీయంలో కేసీఆర్ కేంద్రంపై పోరాటం ప్రారంభించారు.

ధర్నా చౌక్ లో నిప్పులు చెరిగారు. తనదైన శైలిలో కేంద్రంపై విమర్శలు చేశారు. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాలనే డిమాండ్ తో మొదలుపెట్టిన ఈ పోరాటాన్ని దేశవ్యాప్తం చేస్తామన్నారు. కేంద్రం తీసుకువచ్చిన మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు సాగిస్తున్న పోరాటానికి టీఆర్ఎస్ నాయకత్వం వహిస్తుందని చెప్పారు. 

టీఆర్ఎస్ నాయకత్వం వహించడమంటే కేసీఆర్ ప్రత్యక్షంగా రంగంలోకి దిగి రైతుల తరపున పోరాడతారన్న మాట. కానీ కేసీఆర్ కు ఈ అవకాశం మిస్ అయింది. ఈ రోజు పొద్దున్నే ప్రధాని మోడీ మూడు సాగు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నామని, వాటిని రద్దు చేస్తామని ప్రకటించారు.

ఇలా ప్రకటించడం వెనుక ఆయనకు రాజకీయ ప్రయోజనాలున్నాయి. వచ్చే ఏడాది పంజాబ్ ఎన్నికలు ఉన్నాయి కదా. ఈ చట్టాల మీద మొండి పట్టుబడితే ఎన్నికల్లో దెబ్బ తగులుతుంది. మొత్తం మీద మోడీ నిర్ణయం కేసీఆర్ జాతీయ స్థాయిలో చేయాలనుకున్న పోరాటాన్ని నీరుగార్చింది. 

రాష్ట్రంలో ఇప్పుడు బీజేపీ ఎదుగుతోంది. ఆ పార్టీని దెబ్బ కొట్టాలంటే  కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలి..అందుకే ఇప్పుడు కేసీఆర్ దూకుడు పెంచారు. ధాన్యం అంశంపై ఇప్పటికే పలు రకాల వాదోపవాదాలు నడిచాయి. పైగా కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు ఒకసారి మద్ధతు ఇస్తూ మాట్లాడి…మరొకసారి అవి వేస్ట్ చట్టాలని కేసీఆర్ మాట్లాడారు. వరి వేస్తే ఉరే అని ఇక్కడ అంటారు…కేంద్రం ధాన్యం కొనాల్సిందే అనే బీజేపీపై ఫైర్ అవుతారు.

ఇక ధర్నా చౌక్‌ని బంద్ చేయించిన కేసీఆర్ ఇప్పుడు అక్కడే ధర్నాకు దిగారు. కేంద్రం రైతుల పట్ల వ్యతిరేకతతో ఉందని, కేంద్రానికి వ్యతిరేకంగా యుద్ధానికి దిగామని, ఇది ఈ రోజుతో ఆగేది లేదని దిగివచ్చి రైతులకు న్యాయం చేసే వరకు పోరాటం ఆగదని కేసీఆర్ మాట్లాడారు. అయితే ధాన్యం అంశంపై మొదట క్లారిటీ ఇవ్వాల్సిందే కేసీఆర్..కానీ రాజకీయంగా దెబ్బకొట్టడానికి బీజేపీని టార్గెట్ చేశారు. 

నల్లచట్టాలుగా పేరుబడిన సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లుగా మోడీ ప్రకటించారు కాబట్టి కేసీఆర్ పోరాటం రాష్ట్రానికే పరిమితం అవుతుందా? ఢిల్లీలో కూడా ధర్నా చేస్తారా?