ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు భలే సరదా మనిషి. చాలా గంభీరంగా సరదా విషయాలు మాట్లాడ్డం ఆయనకు మాత్రమే ప్రత్యేకం.
ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్షా తిరుపతి పర్యటనకు వచ్చారు. ఏపీ బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేశారు. దీంతో పార్టీలో చేరికలపై దృష్టి పెట్టినట్టు సోము వీర్రాజు తెలిపారు.
సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ పార్టీలో చేరికలకు సంబంధంచి ఆసక్తికర విషయాలు చెప్పారు. అమిత్షా సూచనల మేరకు పార్టీలపై చేరికల కోసం ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేయనున్నామన్నారు. ఈ కమిటీ ద్వారా రాష్ట్రంలోని పెద్దలను పార్టీలో చేర్చుకుంటామని తెలిపారు.
వైసీపీ ఎంపీ ఒకర్ని బీజేపీలో చేర్చుకుంటారనే ప్రచారంపై ఆయన స్పందిస్తూ… పార్టీలో ఎవరి నైనా చేర్చుకుంటామని తేల్చి చెప్పారు. ఎవరినైనా చేర్చుకోవాలనే ఆలోచన ఉన్నప్పుడు… ఒక కమిటీలు ఎందుకనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
అసలు కమిటీ ఏర్పాటు ఉద్దేశం ఏంటో సోము వీర్రాజుకైనా తెలుసా? అని నెటిజన్లు నిలదీస్తున్నారు. కేసులు, ఇతరత్రా ఇబ్బందుల్లో ఉన్న వాళ్లు తప్ప, బీజేపీలో చేరడానికి ఎవరూ మొగ్గు చూపరనేందుకు అనేక ఉదాహరణలు తెరపైకి వస్తున్నాయి. సుజనాచౌదరి, సీఎం రమేశ్ లాంటి నేతల అర్హతులున్న వాళ్లనే కమిటీ తీసుకుంటుందా? అని నెటిజన్లు సెటైర్లు విసురుతున్నారు.