సినిమా ప్రకటించిన రోజే టీజర్ ఇచ్చేశారుగా!

ఏదైనా క్రేజీ ప్రాజెక్టును ప్రకటించేటప్పుడు పోస్టర్ రిలీజ్ చేస్తుంటారు, మరికొందరు టైటిల్ పోస్టర్ కూడా రిలీజ్ చేస్తారు. ఈమధ్య గ్లింప్స్ కల్చర్ కూడా వచ్చింది. చిన్న వీడియో రిలీజ్ చేసి సినిమా ఎనౌన్స్ చేస్తున్నారు.…

ఏదైనా క్రేజీ ప్రాజెక్టును ప్రకటించేటప్పుడు పోస్టర్ రిలీజ్ చేస్తుంటారు, మరికొందరు టైటిల్ పోస్టర్ కూడా రిలీజ్ చేస్తారు. ఈమధ్య గ్లింప్స్ కల్చర్ కూడా వచ్చింది. చిన్న వీడియో రిలీజ్ చేసి సినిమా ఎనౌన్స్ చేస్తున్నారు. అయితే వెంకీ సినిమా ప్రకటన అంతకుమించి అన్నట్టు జరిగింది.

తన కెరీర్ లో ప్రతిష్టాత్మక 75వ సినిమాను ప్రకటించాడు వెంకీ. శైలేష్ కొలను దర్శకత్వంలో ఈ సినిమా రాబోతోంది. సినిమా ఎనౌన్స్ మెంట్ లో భాగంగా గ్లింప్స్ రిలీజ్ చేశారు. అయితే పేరుకే ఇది గ్లింప్స్. టీజర్ కు ఏమాత్రం తీసిపోని విధంగా ఉంది ఈ వీడియో. పనిలోపనిగా సినిమా టైటిల్ కూడా ఎనౌన్స్ చేశారు. వెంకీ కొత్త సినిమా పేరు సైంధవ్.

గ్లింప్స్ అంటూ ఏకంగా 2 నిమిషాల టీజర్ నే విడుదల చేయడం అందర్నీ ఆకట్టుకుంది. ఈ వీడియోలో వెంకటేష్ క్యారెక్టర్, సినిమా జానర్, లైట్ గా స్టోరీలైన్ అన్నీ చెప్పకనే చెప్పేశారు. “నేనిక్కడే ఉంటాన్రా, ఎక్కడికీ వెళ్లను, రమ్మను” అంటూ వెంకటేష్ తో ఓ డైలాగ్ కూడా చెప్పించి ఫ్యాన్స్ కు డబుల్ కిక్కిచ్చారు.

చంద్రప్రస్థ అనే ఫిక్షన్ ప్రాంతంలో జరిగిన కథతో రాబోతోంది సైంధవ్ సినిమా. సంతోష్ నారాయణ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ వీడియోకు మరింత వన్నె తీసుకొచ్చింది. నిహారిక ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమాను సౌత్ భాషలతో పాటు హిందీలో ఒకేసారి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. రెగ్యులర్ షూటింగ్ తో పాటు, హీరోయిన్ ఎవరనే విషయాన్ని త్వరలోనే వెల్లడిస్తారు.