సాగు చ‌ట్టాలు.. వాట్సాప్ యూనివ‌ర్సిటీ ఇప్పుడేమంటుందో!

మోడీ ప్ర‌భుత్వం తాము తెచ్చిన సాగు చ‌ట్టాల విష‌యంలో ఆఖ‌రికి వెన‌క్కు త‌గ్గింది. సుదీర్ఘ‌కాలంగా చ‌ర్చ‌లో, ర‌చ్చ‌లో ఉన్న ఈ అంశాలు ఒక‌వైపు సుప్రీం కోర్టులో విచార‌ణ‌లో ఉన్నాయి,  రైతులేమో దీర్ఘ‌కాలంగా నిర‌స‌న‌ల్లోనే ఉన్నారు.…

మోడీ ప్ర‌భుత్వం తాము తెచ్చిన సాగు చ‌ట్టాల విష‌యంలో ఆఖ‌రికి వెన‌క్కు త‌గ్గింది. సుదీర్ఘ‌కాలంగా చ‌ర్చ‌లో, ర‌చ్చ‌లో ఉన్న ఈ అంశాలు ఒక‌వైపు సుప్రీం కోర్టులో విచార‌ణ‌లో ఉన్నాయి,  రైతులేమో దీర్ఘ‌కాలంగా నిర‌స‌న‌ల్లోనే ఉన్నారు. ఇంత‌లో ఈ చ‌ట్టాల‌ను వెన‌క్కు తీసుకుంటున్న‌ట్టుగా స్వ‌యంగా మోడీ ప్ర‌క‌టించేశారు. అలాగే.. క్ష‌మాప‌ణ‌లు కూడా చెప్పారు. ఇంత‌టితో ఈ క‌థ‌కు సుఖాంతం అవుతుంద‌నే అనుకుందాం.

అయితే.. ఇప్పుడు ప్ర‌ధాన సందేహం ఏమిటంటే, ఈ చ‌ట్టాల‌ను ఇన్నాళ్లూ విప‌రీత స్థాయిలో స‌మ‌ర్థించిన వారు ఇప్పుడెలా ప్లేటు ఫిరాయిస్తార‌నేది! సాగుచ‌ట్టాల స‌మ‌ర్థ‌న‌కు మోడీ భ‌క్త‌గ‌ణం, వాట్సాప్ యూనివ‌ర్సిటీ అవిశ్రాంతంగా ప‌ని చేసింది! సాగుచ‌ట్టాల విష‌యంలో ఆందోళ‌న‌లు తెలుపుతున్న రైతుల‌ను ఉగ్ర‌వాదులు అంటూ దూషించింది వాట్సాప్ యూనివ‌ర్సిటీ. ఈ విష‌యంలో మ‌రో ఊసే లేద‌ని, ఇదంతా ఉగ్ర‌వాద కుట్ర అని వాట్సాప్ యూనివ‌ర్సిటీ కొన్ని వంద‌ల‌, వేల‌, ల‌క్ష‌ల తీర్మానాలు పెట్టి పాస్ చేసి ఉంటుంది.

అలాగే సాగుచ‌ట్టాల వ‌ల్ల రైతుల‌కు క‌లిగే ల‌బ్ధి గురించి కూడా వాట్సాప్ యూనివ‌ర్సిటీ అవిశ్రాంతంగా తెలియ‌జేసింది. మోడీ ప్ర‌భుత్వం సాగు చ‌ట్టాల ద్వారా రైతుల‌ను ఒక రేంజ్ లో ఉద్ధ‌రిస్తుంద‌ని, అయితే వారికి ఆ విష‌యం తెలియ‌డం లేద‌ని కూడా చాన్నాళ్ల పాటు వాదించారు. వారు మిస్ లీడ్ అయ్యార‌ని, మిస్ గైడెన్స్ అని.. ర‌క‌ర‌కాల వాదాలు వినిపించారు. 

ఇక సాగుచ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా ఉద్య‌మిస్తున్న రైతుల‌పై దాడుల‌కు బీజేపీ నేత‌లు పిలుపును ఇచ్చారు. స్వ‌యంగా ముఖ్య‌మంత్రి హోదాలోని ఒకాయ‌న మాట్లాడుతూ.. బీజేపీ కార్య‌క‌ర్త‌లు రైతుల ప‌ని ప‌ట్టాల‌ని, కేసులు ఉండ‌వ‌ని, ఒక‌వేళ అరెస్టైతే బెయిల్ అని, బెయిల్ రాక‌పోతే మీరే నేత‌లు అవుతార‌ని.. వారిపై దాడుల‌కు రెచ్చ‌గొట్టారు. ఈ పూన‌కంలో రైతుల‌పై వాహ‌నాల‌ను ఎక్కించి చంప‌డానికి కూడా బీజేపీ నేత‌లు వెనుకాడ‌లేదు. ఆ కేసులు ఇప్పుడు కోర్టులో న‌డుస్తున్నాయి. 

మ‌రి ఇంత జ‌రిగాకా.. సాగు చ‌ట్టాల‌ను వ్య‌తిరేకించిన రైతుల‌ను ఉగ్ర‌వాదుల‌ని, వారిని తుక్కు రేగ్గొట్టాల‌ని చెప్పి.. ఇప్పుడు సాగు చ‌ట్టాల విష‌యంలో ఎందుకు వెన‌క్కు త‌గ్గిన‌ట్టు? దీన్ని వాట్సాప్ యూనివ‌ర్సిటీ ఎలా స‌మ‌ర్థిస్తుందో! ఇప్ప‌టికే ఆ ప‌ని షురూ అయిన‌ట్టుగా ఉంది. 

మోడీ క్ష‌మాప‌ణ‌లు చెప్పార‌ని, అదే గొప్ప‌ద‌నం అంటూ.. మొద‌లుపెట్టారు. ఇన్నాళ్లూ తాము వాదించిన లాజిక్కుల‌న్నీ ప‌క్క‌న పెట్టి.. మ‌రో ర‌కంగా భ‌జ‌న అందుకోవ‌డానికి వాట్సాప్ యూనివ‌ర్సిటీ స‌మాయ‌త్తం అయిన‌ట్టుగా ఉంది!