అమరావతి రైతుల పాదయాత్రకు మద్దతు అంటూనే, వారికి బీజేపీ ఝలక్ ఇచ్చింది. అమరావతిపైనే కాదు ఆంధ్రప్రదేశ్‌పై బీజేపీ మొదటి నుంచి సవతి తల్లి ప్రేమ చూపుతోంది. ద్వంద్వ వైఖరితో వ్యవహరిస్తోంది. ఇదే పంథాను మరోసారి అనుసరిస్తోంది. ఇందుకు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాటలు ప్రతిబింబిస్తున్నాయి.
అమరావతి రైతు ఉద్యమంలో ఎందుకు పాల్గొనలేదని ఏపీ బీజేపీ నేతల్ని కేంద్రహోంమంత్రి అమిత్‌షా క్లాస్ పీకినట్టు వార్తలొచ్చాయి. దీంతో అమరావతి రైతులు చేపట్టిన న్యాయస్థానం నుంచి దేవస్థానం పాదయాత్రలో బీజేపీ కూడా పాల్గొంటుందని ఆ పార్టీ నుంచి ఒక ప్రకటన వచ్చింది. ఆ తర్వాత ఎప్పుడు, ఎవరు పాల్గొంటారో సోము వీర్రాజు వివరాలు వెల్లడించారు. ఇంత వరకూ బాగానే ఉంది.
రైతుల పాదయాత్రలో పాల్గొనడంపై ఆయన ట్విస్ట్ ఇచ్చారు. అదేంటో తెలుసుకుందాం. ఈ నెల 21న అమరావతి రైతుల పాదయాత్రలో బీజేపీ సీనియర్ నేతలు పురందేశ్వరి, కన్నా లక్ష్మినారాయణ, సత్యకుమార్, రాజ్యసభ సభ్యులు సీఎం రమేశ్, సుజనాచౌదరి పాల్గొంటారని సోము వీర్రాజు తెలిపారు. పాదయాత్ర ముగింపు కార్యక్రమానికి పార్టీ నేతలు హాజరవుతారన్నారు. విశాఖ వైపు పాదయాత్ర జరిగినా రైతుల వెంటే బీజేపీ ఉంటుందని ఆయన ట్విస్ట్ ఇచ్చారు.
అంటే విశాఖకు పరిపాలన రాజధాని కావాలని ఎవరైనా పాదయాత్ర చేపడితే మద్దతు ఇస్తామనేది సోము వీర్రాజు గారి ఉవాచ. అందరితో మంచిగా ఉంటామని, తమకు అందరూ, అన్ని ప్రాంతాల వాళ్లు సమానమని బీజేపీ చెప్పకనే చెబుతోంది.
బీజేపీ మాటలకు అర్థాలే వేరని ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? చిత్తశుద్ధి లేని, వంచనా స్వభావంతో మద్దతు పలికే రాజకీయ పార్టీల పట్ల ఏ వైఖరితో ఉండాలో తేల్చుకోవాల్సింది ప్రజానికమే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.