ఐయాం వెరీ సారీ.. అన్నాడు తొలిసారి..!

ప్రధాని మోదీ తొలిసారిగా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పారు. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. సాగు చట్టాల ఆందోళనలకు ఏడాది పూర్తవుతున్న సందర్భంలో మోదీ వెనక్కు తగ్గారు. ఉరుములేని పిడుగులా సాగు…

ప్రధాని మోదీ తొలిసారిగా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పారు. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. సాగు చట్టాల ఆందోళనలకు ఏడాది పూర్తవుతున్న సందర్భంలో మోదీ వెనక్కు తగ్గారు. ఉరుములేని పిడుగులా సాగు చట్టాల రద్దు గురించి ప్రకటించేశారు మోదీ. 

చట్టాల రద్దు కోసం రైతులు చేస్తున్న ఉద్యమానికి ఏడాది పూర్తి కావస్తోంది. ఈనెల 22న లక్నోలో మహా పంచాయత్ పేరుతో భారీ ఆందోళన చేపట్టడానికి వారంతా సిద్ధమయ్యారు. దీంతో ప్రధాని ఈ ప్రకటన చేసినట్టు తెలుస్తోంది.

అసెంబ్లీ ఎన్నికల భయం..

మరోవైపు పంజాబ్, ఉత్తర ప్రదేశ్ వంటి కీలక రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు వచ్చే ఏడాది జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో సాగు చట్టాల రద్దు కోసం ఉద్యమిస్తున్న రైతులు బీజేపీకి గట్టి గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇటీవల జరిగిన పలు ఉప ఎన్నికల్లో కూడా బీజేపీకి వరుస ఎదురు దెబ్బలు తగిలాయి. దీంతో ఎట్టకేలకు మోదీ మెట్టు దిగారు. చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించి పనిలో పనిగా దేశ ప్రజలకు, రైతాంగానికి క్షమాపణలు చెప్పారు.

గతేడాది మూడు ఆర్డినెన్స్ లు తీసుకొచ్చి, వాటికి ఆ తర్వాత సెప్టెంబర్ లో చట్టరూపం కల్పించారు. కొత్త చట్టాల ప్రకారం వ్యవసాయంలో కార్పొరేట్ వ్యవస్థల ప్రాధాన్యం పెరిగి రైతులకు మేలు జరుగుతుందని, పెట్టుబడికి గ్యారెంటీ ఉంటుందని, నిల్వ, రవాణా భారం వారిపై తగ్గిపోతుందనేది కేంద్రం వాదన. అయితే చిన్న, సన్నకారు రైతులకు ఈ చట్టాలు ఉరితాళ్లలా మారతాయని రైతు సంఘాలు ఆందోళన మొదలు పెట్టాయి. శిరోమణి అకాలీదళ్ ఎన్డీఏ నుంచి బయటకి వెళ్లిపోయింది.

మరోవైపు రైతు సంఘాల నాయకులతో జరిగిన చర్చలు విఫలమయ్యాయి. చివరకు నవంబర్ 26 నుంచి రైతు సంఘాల నాయకుడు రాకేష్ టికాయత్ నేతృత్వంలో ఢిల్లీ సరిహద్దుల్లో గుడారాలు వేసుకుని రైతులు ఉద్యమం మొదలు పెట్టారు. చట్టాల్లో అవసరమైతే సవరణలు చేస్తామంటుంది ప్రభుత్వం, కాదు రద్దు చేయాలంటారు రైతులు. వివాదం కోర్టుల్లో కూడా పరిష్కారం కాలేదు. 

రిపబ్లిక్ డే సందర్భంగా జరిగిన అల్లర్లు మరింత కాకరేపాయి. దీంతో రైతులు వెనక్కి తగ్గేదే లేదని తేల్చి చెప్పారు. అప్పటినుంచి ఇప్పటి వరకు ఢిల్లీ సరిహద్దుల్లోనే మకాం పెట్టి పోరాటం సాగిస్తున్నారు. రైతు చట్టాలపై ముందుకెళ్తే నష్టం తప్ప లాభం లేదని భావించిన ప్రధాని మోదీ దిగొచ్చి చట్టాలను రద్దు చేశారు.

పెద్దనోట్ల రద్దుపై కూడా..

అదే విధంగా పెద్ద నోట్ల రద్దు విషయంలో కూడా దేశ ప్రజలకు మోదీ క్షమాపణలు చెప్పాలని ఇప్పుడు సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. మోదీ వెనకడుగుపై అప్పుడే ట్రోలింగ్ మొదలైంది. 

ఎక్కడ నెగ్గాలో తెలిసిన మోదీకి.. సరిగ్గా వివిధ రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికల ముందు తగ్గారని, రాజకీయ చాణక్యుడని కూడా కొన్ని వర్గాలు ఆయన్ని ఆకాశానికెత్తేస్తున్నాయి.