బీజేపీ తప్పు చేసిందా? ఒప్పు చేసిందా?

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా ద్వయం రాజకీయాల్లో సంచలనాలు సృష్టించడంలో దిట్టలు. చదరంగంలో ఆటగాళ్లు ప్రత్యర్థి ఊహించనివిధంగా ఎలాగైతే ఎత్తు వేస్తారో రాజకీయ చదరంగంలో వీరిద్దరూ అలాగే ఎత్తులు…

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా ద్వయం రాజకీయాల్లో సంచలనాలు సృష్టించడంలో దిట్టలు. చదరంగంలో ఆటగాళ్లు ప్రత్యర్థి ఊహించనివిధంగా ఎలాగైతే ఎత్తు వేస్తారో రాజకీయ చదరంగంలో వీరిద్దరూ అలాగే ఎత్తులు పైఎత్తులు వేస్తారు. మహారాష్ట్రలో వీరి రాజకీయ చాణక్యం పీక్‌ స్టేజికి వెళ్లింది. 

మహారాష్ట్ర సీఎంగా శివసేన నేత ఉద్ధవ్‌ థాకరే పీఠం ఎక్కబోతున్నాడని, శివసేన, కాంగ్రెస్‌, ఎన్‌సీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నదని తెల్లవారేవరకు ఉన్న సమాచారం. వార్తాపత్రికల్లో పతాక శీర్షిక ఇదే. 

కాని తెల్లారి లేచాక రాజకీయవర్గాలు, దిగ్గజాల్లాంటి నాయకులు, సామాన్య జనం…అందరూ షాక్‌. బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ ముఖ్యమంత్రిగా, ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అసలు ఎన్‌సీపీ, కాంగ్రెసు పార్టీలకే ఏమీ అర్థం కాలేదు.

'ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్‌ బ్లాంక్‌ అవుతుందో ఆడే పండుగాడు' అనే టైపులో మోడీ, అమిత్‌ షా  కొట్టిన దెబ్బకు దిమ్మతిరిగిపోయింది. అయితే కొందరు ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌ మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తెర వెనక నుంచి ఆయనే ఈ డ్రామా అడించారనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

కర్నాటకలో  కాంగ్రెసుతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు మాజీ ప్రధాని దేవెగౌడ, ఆయన కుమారుడు కుమారస్వామి ఆడిన నాటకాన్ని 'మహా' నాటకం గుర్తుకు తెస్తోందంటున్నారు. అజిత్‌ పవార్‌ తన వెంట 22 మంది ఎమ్మెల్యేలను తీసుకొని బీజేపీతో కలిసి సంకీర్ణం ఏర్పాటు చేయడంలో సహకరించాడని అంటున్నారు.

ఇక గవర్నర్‌ ఫడ్నవీస్‌కు బలనిరూపణ కోసం కావల్సినంత సమయం ఇచ్చారు. ఈ నెల 30న బలనిరూపణ చేసుకోవాలని ఆదేశించారు. అంటే వారం రోజుల సమయం ఇచ్చారన్నమాట. 'మహా' మాయ చేసిన  బీజేపీపై అనేకమంది విమర్శలు గుప్పిస్తున్నారు. దానికి విలువలు లేవని దునుమాడుతున్నారు. హిందూత్వ విలువలంటే ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు.

టోటల్‌గా బీజేపీ అనైతికతకు పాల్పడిందని తేల్చిపారేస్తున్నారు. అయితే కొందరు ఇలాంటి పరిణామాలు సహజమేనని, రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమని అంటున్నారు. గతంలో ఇలాంటివి జరిగిన దాఖలాలు ఉన్నాయి. నిజానికి రాజకీయాల్లో నైతికత, పవిత్రత మొదలైన పదాల గురించి మాట్లాడుకోవడం అనవసరం. రాజకీయం అంటేనే ఏదోవిధంగా మాయ చేసి విజయం సాధించడం. అందులోనూ మన ప్రజాస్వామ్యం పూర్తిగా లెక్కలు, గణాంకాల మీద ఆధారపడింది. ప్రభుత్వం నిలబడాలన్నా, కూలిపోవాలన్నా మెజారిటీ, మైనారిటీలే కీలకంగా నిలుస్తాయి. ఇవి అంకెలే కదా.

ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మెజారిటీ ఉందా? లేదా? అని మాత్రమే రాష్ట్రంలో గవర్నర్‌, కేంద్రంలో రాష్ట్రపతి చూస్తారు. మెజారిటీ ఒకే పార్టీకి ఉండక్కర్లేదు. మనకు ఏదైనా అవసరం పడి డబ్బు తక్కువైతే అప్పు తెచ్చుకొని అవసరం తీర్చుకుంటాం. డబ్బు లేదని అవసరమైన పనిని క్యాన్సిల్‌ చేసుకోం కదా. ఇదైనా అంతే. ఒకే పార్టీ సర్కారు ఏర్పాటు చేయలేకపోతే మరో పార్టీని లేదా రెండు మూడు  పార్టీలను కలుపుకుంటుంది. అయితే ఈ కలయిక అనేది రాజ్యాంగ బద్ధంగా జరిగిందా? లేదా? అనేదే ముఖ్యం. రాజ్యాంగబద్ధమైతే ఓకే. అలాగే గడువులోగా మెజారిటీ నిరూపించుకోవాలి. 

ఇదంతా సవ్యంగా ఉంటే నైతికత, పవిత్రతకు స్థానం ఉండదు. ప్రస్తుతం శివసేన, కాంగ్రెసు, ఎన్సీపీ సుప్రీం కోర్టు గడప తొక్కాయి. ఈ ప్రభుత్వ ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధమని, అనైతికమని ఫిర్యాదు చేస్తూ పిటిషన్‌ వేశాయి. బీజేపీ తప్పు చేసిందా? ఒప్పు చేసిందా? అనేది తేల్చాల్సింది సుప్రీం కోర్టు. బయట ఎన్ని అనుకున్నా ప్రయోజనం లేదు. కోర్టు రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టుకొని కేసు విచారిస్తుంది తప్ప ఇది పవిత్ర కలయికా? అపవిత్ర కలయికా? అనేది చూడదు. సుప్రీం కోర్టు ఏం తేలుస్తుందో మరి…!