తెలుగుదేశం పార్టీలో పరిణామాలు గమనించదగినవిగానే ఉన్నాయి. ప్రత్యేకించి జూనియర్ ఎన్.టి.రామారావు అవసరం తెలుగుదేశం పార్టీకి లేదని చెప్పడం ద్వారా టిడిపి ఆయనను ఇకపై పార్టీలో పనిచేయనివ్వదన్న సంగతి స్పష్టం చేసింది. గతంలో 1995లో పార్టీ వ్యవస్థాపకుడు ఎన్.టి.రామారావును పదవీ చ్యుతుడిని చేసినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు వర్గం కొంతకాలం ఇదే తరహాలో మాట్లాడేది.
ఇప్పుడు జూనియర్ ఎన్.టి.ఆర్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఆయనను బాదించేవే. 2009లో చంద్రబాబు నాయుడు టిడిపిని ఎలాగైనా గెలిపించాలని రకరకాల వ్యూహాలు అమలు చేశారు. అప్పట్లో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం బలంగా ఉండడం, ప్రజారాజ్యం పార్టీని స్థాపించి మెగాస్టార్ చిరంజీవి సవాల్ విసరడం, అనేక మంది నేతలు ప్రజారాజ్యంలోకి వెళ్లడం తదితర కారణాలతో టిడిపి ఉక్కిరి బిక్కిరి అవుతున్న పరిస్థితి. ప్రజారాజ్యం పార్టీతో పొత్తు పెట్టుకుని కూటమి ఏర్పాటు చేయాలని వామపక్షాలు ప్రయత్నించాయి.
సిపిఐ నేత కె.నారాయణ ఇందుకు చొరవ తీసుకున్నారు. అది జరిగితే తెలుగుదేశం పార్టీ పరిస్థితి మరింత దయనీయంగా మారుతుందని భావించిన చంద్రబాబు నాయడు ఢిల్లీలో వామపక్ష అగ్ర నేతలతో మంతనాలు జరిపి, వారిని ఒప్పించి ఉమ్మడి ఎపిలో పొత్తు పెట్టుకున్నారు. మరో వైపు టిఆర్ఎఎస్ అదినేత కెసిఆర్ పెట్టిన షరతుకు లొంగి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అనుకూలంగా తెలుగుదేశంలో తీర్మానం చేశారు. 2004లో బిజెపిలో పొత్తులో ఉండి ఓటమి తర్వాత జన్మలో బిజెపితో కలవనని చెప్పి టిఆర్ఎస్, వామపక్షాలను ఒప్పించి కొత్త కూటమిని చంద్రబాబు ఏర్పాటు చేశారు.
ఆనాటి సంక్షోభ పరిస్థితిలో తాను ఒక్కడినే ప్రచారానికి సరిపోనని ఆయన అనుకున్నారు. అప్పటికి ఫామ్‌లో ఉండి సినిమాలలో మంచి ఆదరణ చూరగొంటున్న జూనియర్ ఎన్.టి.ఆర్.తో మాట్లాడి ఆయనతో ఎన్నికల ప్రచారానికి ఒప్పించారు. అంతకుముందు ఎన్.టి.ఆర్. తండ్రి హరిక ష్ణకు రాజ్యసభ కూడా ఇచ్చి ఇబ్బంది లేకుండా జాగ్రత్తపడ్డారు. ఆ దశలో జూనియర్ ఎన్.టి.ఆర్. కూడా ఉత్సాహంగా చంద్రబాబు తరపున ప్రచారం చేశారు. టీవీ ప్రోగ్రాంలలో చంద్రబాబుతో కలసి పాల్గొని మామయ్య అంటూ బాగానే పొగిడారు.
అయితే ఆ ప్రచారంలో నుంచి తిరిగివస్తూ ప్రమాదానికి గురి కావడం, అదృష్టవశాత్తు క్షేమంగా బయటపడడం జరిగింది. జూనియర్ ప్రచారం చేసినా, టిఆర్ఎస్, వామపక్షాలతో కూటమి కట్టినా, ప్రజారాజ్యం పార్టీని ఒంటరి చేసినా, చంద్రబాబు అధికారంలోకి రాలేకపోయారు. వైఎస్ రాజశేఖరరెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత కాలంలో మహానాడుకు జూనియర్ ఎన్.టి.ఆర్. పెద్ద అట్రాక్షన్‌గా మారారు. అయితే అప్పుడే చంద్రబాబు కుమారుడు లోకేష్ కూడా రాజకీయాలలో యాక్టివ్ అవడం ఆరంభించారు.
దాంతో ఆ తదుపరి ఎన్.టి.ఆర్. ప్రాధాన్యత తగ్గించడం ఆరంభం అయింది. ఆ విషయం అర్థం చేసుకున్న జూనియర్ ఎన్.టి.ఆర్. కూడా తన మానాన సినిమాలు చేసుకుంటూ జీవితం సాగిస్తున్నారు. మధ్యలో ఎక్కడా రాజకీయాలలో జోక్యం చేసుకోలేదు. 2018లో స్వయంగా సోదరి అయిన సుహాసిని కూకట్పల్లి నుంచి పోటీచేసినా కేవలం ఒక ప్రకటన చేసి మద్దతు తెలిపారు తప్ప ప్రచారానికి వెళ్లలేదు. మరో సోదరుడు కళ్యాణ్‌రామ్ కూడా అదే పనిచేశారు. ఇలా రాజకీయాలకు దూరంగా ఉన్న జూనియర్ ఎన్.టి.ఆర్‌ను ఇప్పుడు పనికట్టుకుని టిడిపి అవమానించవలసిన అవసరం ఎందుకు వచ్చిందన్నది ఆసక్తికరం.
ఒక వైపు జనసేన అదినేత పవన్ కళ్యాణ్‌ను తమ దారిలో పెట్టుకోవడానికి నానా తంటాలు పడుతున్న టిడిపి పెద్దలు సొంత మనిషిగా ఉన్న జూనియర్ ఎన్‌టిఆర్‌ను దూరంగా ఉంచడానికి కారణాలపై పార్టీ నుంచి సస్పెండ్ అయిన టిడిపి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రశ్నలు సంధించారు. వంశీ, మంత్రి కొడాలి నాని వంటివారు జూనియర్ ఎన్.టి.ఆర్.తో సినిమాల పరంగా సన్నిహితంగా ఉంటారు.
ఆ కారణంతో టిడిపి ఆయనను దూరం చేసుకోవడానికి సిద్ధపడిందా? జూనియర్ ఎన్.టి.ఆర్, టిడిపిలో యాక్టివ్ అయితే లోకేష్‌కు ఇబ్బంది అని, అతని వాగ్ధాటి ముందు లోకేష్ సరిపోడని భావించారా? లేక జూనియర్ ఎన్.టి.ఆర్ మామే కాకుండా, స్వయానా చంద్రబాబుకు సమీప బంధువు అయిన నార్నె శ్రీనివాసరావు వైఎస్ఆర్ కాంగ్రెస్‌లోకి ఎన్నికలకు ముందే రావడం, ఆయన చంద్రబాబును విమర్శిస్తూ ఇంటర్వ్యూలు ఇవ్వడం కారణమా అన్నదానిపై తర్జనభర్జనలు పడుతున్నారు.
అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్న ప్పుడు చంద్రబాబు నాయుడు ఆయా పార్టీలను, వ్యక్తులను తన రాజకీయ అవసరాలకు వాడుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంటారు. కాని అందుకు విరుద్ధంగా జూనియర్ ఎన్.టి.ఆర్ అవసరం లేదని ఆ పార్టీ నేత వర్ల రామయ్యతో చెప్పించారంటే అతనిని ఒకరకంగా అవమానించడమే అవుతుంది. జూనియర్ ఎన్.టి.ఆర్కు సంబంధించి ప్రశ్నవస్తే అంత కఠినంగా సమాధానం చెప్పనవసరం లేదు.
కాని కావాలని అలా చెప్పారంటే ఎట్టి పరిస్థితిలోను టిడిపిలోకి జూనియర్ ఎన్.టి.ఆర్ రాకూడదని, అతడు ఒక ప్రముఖ శక్తిగా ఎదగరాదని టిడిపి భావిస్తోందన్నమాట. దీనివల్ల పార్టీకి లాభమా? నష్టమా అన్నదానిని చూడదలచుకోలేదు. దానికి కారణం పార్టీ పగ్గాలు ఎట్టి పరిస్థితిలోను నారా కుటుంబంలోనే ఉండాలన్నది వారి వ్యూహం కావచ్చు. అయితే ఎన్.టిఆర్.ఈ అవమాన భారాన్ని ఎలా మోస్తారు? దీనికి ఎప్పటికైనా సమాధానం ఇస్తారా అన్నది ఆసక్తికర అంశం అవుతుంది. ఆయన సన్నిహితులు గతంలో ప్రచారం చేసిన దాని ప్రకారం 2024 ఎన్నికల వరకు కూడా జూనియర్ ఎన్.టి.ఆర్ రాజకీయాలో రంగ ప్రవేశం చేయకపోవచ్చు.
వచ్చే ఎన్నికలలో కూడా టిడిపి గెలవడం కష్టమేనని, అప్పుడు రాజకీయంగా చంద్రబాబు, లోకేష్‌లు పూర్తిగా బలహీనపడతారని, ఆ తరుణంలో జూనియర్ ఎన్.టి.ఆర్. యాక్టివ్ అయి, టిడిపి కార్యకర్తల డిమాండ్ మేరకు ఆ పార్టీకి నాయకత్వం వహించే పరిస్థితి రావచ్చని ఆయన సన్నిహితులు కొందరు భావిస్తున్నారు. అయితే రాజకీయాలలో కచ్చితంగా ఇలాగే జరుగుతుందని ఎవరూ చెప్పలేరు. ఎన్నో పరిణామాలు సంభవిస్తుంటాయి. మొత్తం మీద జూనియర్ ఎన్.టి.ఆర్.ను టిడిపి అవమానించడం వాస్తవం.
ఆ అవమాన భారాన్ని గుర్తుంచుకుని ఆయన ఎలా సమాధానం ఇస్తారన్నది భవిష్యత్తులోనే తెలుస్తుందని చెప్పాలి. కాకపోతే చంద్రబాబు నాయుడుపై ఉన్న ఒక అభిప్రాయం మరింత బలపడుతుందని అంటారు. అదేమిటంటే చంద్రబాబు ఎవరినైనా తన అవసరాలకు వాడుకుని వదలివేయగలరని ఎక్కువ మంది భావన. అది నిజమే అని నమ్మాలా?
కొమ్మినేని శ్రీనివాసరావు