వల్లభనేని వంశీ. తెలుగుదేశం పార్టీ టికెట్ పై గెలిచి, పార్టీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే. పార్టీకి ఆయన రాజీనామా చేశారు, ఆ తర్వాత పార్టీ ఆయనకు షోకాజ్ నోటీస్ జారీ చేసింది. పార్టీకి రాజీనామా చేశాను కాబట్టి నేను స్వతంత్ర ఎమ్మెల్యేని అని వంశీ చెప్పుకోవచ్చు. సస్పెన్షన్ వేటు ఇంకా వేయలేదు కాబట్టి.. మేం విప్ జారీ చేస్తే కట్టుబడి ఉండాల్సిందే అని టీడీపీ అనుకోవచ్చు.
ఎవరి వాదనలు ఎలా ఉన్నా.. అధికారికంగా మాత్రం వంశీ ఇంకా టీడీపీ ఎమ్మెల్యేనే. అయితే వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో వంశీ పాత్ర ఏంటనేది తెలియడం లేదు. అసెంబ్లీలో వంశీ అనుసరించే విధానంపైనే ఆయన భవిష్యత్ ఆధారపడి ఉంటుందని తెలుస్తోంది. వంశీ టీడీపీ జట్టుతో కలసి లేకపోయినా పర్లేదు కానీ, వైసీపీలో చేరితే మాత్రం ఆయనపై వేటుపడటం ఖాయం.
సాక్షాత్తూ స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా పార్టీ మారిన వారిపై వేటు వేయడమే సరైన చర్య అని, సీఎం జగన్ అభిమతం కూడా అదేనంటూ పలుమార్లు ఉటంకించారు. ఈ నేపథ్యంలో వంశీ కండువా మారిస్తే ఎమ్మెల్యే పదవిని వదులుకోవాల్సిందేననమాట.
ఈ సందిగ్ధంలోనే వంశీ తన రాజకీయ భవిష్యత్ పై దిగులు పెట్టుకున్నారు. టీడీపీ షోకాజ్ నోటీసుకి సమాధానం ఇవ్వడానికి ఇంకా వారం గడువుంది. ఆ తర్వాత ఆ పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
ఇక ఇప్పటికిప్పుడు పదవికి రాజీనామా చేసి, పార్టీ మారి, తిరిగి అదే నియోజకవర్గంలో పోటీ చేయడమా, లేక ఎమ్మెల్సీ హామీతో సంతృప్తి పడటమా అనే విషయాలపై వంశీ తేల్చుకోలేకపోతున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
అందుకే టీడీపీపై విమర్శలు చేస్తూ కాలం నెట్టుకొస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలకు కూడా వంశీ గైర్హాజరయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
సమావేశాల్లో వంశీ వైసీపీ బ్యాచ్ తో కలసి కూర్చున్నా, ప్రభుత్వ నిర్ణయాలకు అనుకూలంగా మాట్లాడినా ఆయనకు ఇబ్బందే. అందుకే అసెంబ్లీకి వంశీ డుమ్మా కొడతారని అంటున్నారు. ప్రస్తుతానికి సైలెంట్ గా ఉండి, అసెంబ్లీ సమావేశాల తర్వాత తన భవిష్యత్ నిర్ణయం తీసుకుంటారట వంశీ.