రాను రాను ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా వార్ లు పెరుగుతున్నాయి. వీళ్లను వాళ్లు ట్రోల్ చేయడం, వాళ్లను వీళ్లు ట్రోల్ చేయడం ఎక్కువయింది. గతంలో పోస్టర్ లపై పేడ ముద్దలు కొట్టేవారు. ఇప్పుడు సోషల్ మీడియాలో కొట్టుకుంటున్నారు. ఫ్యాన్స్ కోసం, తమ ఇమేజ్ కోసం హీరోలు కూడా ఫేక్ పాపులారిటీ కోసం చూసుకుంటున్నారు.
చిన్న సినిమాల దగ్గర నుంచి పెద్ద సినిమాల వరకు యూ ట్యూబ్ హిట్ ల కోసం ఎగబడుతున్నారు. వాస్తవంగా వచ్చే హిట్ ల కన్నా డబ్బులు ఖర్చు చేసి హిట్ లు తెచ్చుకోవడానికి చూస్తున్నారు. దీనికి కూడా భారీగానే ఖర్చు అవుతోంది.
ఒక మిలియన్ హిట్ లకు ఒక లక్ష రూపాయల వరకు ఖర్చుచేస్తున్నట్లు బోగట్టా. ఇది ఏ ఒక్క హీరోకో, ఏ ఒక్క సినిమాకో పరిమితం కాలేదు. అలాగే చిన్న సినిమా, మీడియం సినిమా, పెద్ద సినిమా ఇలా ఎవరి శక్తి కొలది వారు ఖర్చు చేస్తున్నారు. మీడియం సినిమాలు ఓ మిలియన్ హిట్ లు వస్తే చాలు పరువు దక్కుతుంది అని ఓ లక్ష రూపాయిలు ఖర్చు చేస్తున్నారు.
కానీ ఒక లక్షతో చాలదు వ్యవహారం. టీజర్, ట్రయిలర్, నాలుగైదు పాటలు అంటే కనీసం మీడియం సినిమాకు ఆరేడు లక్షలు ఖర్చు. అదే భారీ సినిమా అయితే చెప్పనక్కర లేదు. వదిలిన ప్రతి విడియో కంటెంట్ కు కనీసం పదిలక్షలు ఖర్చుచేయాల్సి వస్తోంది. అంటే పబ్లిసిటీ బడ్జెట్ లో దీనికే కోటి రూపాయలు కేటాయించుకోవాల్సివుంటుంది.
మరోపక్క పాట టీజర్, పాట లిరికల్ విడియో, పాట ప్రమోషనల్ విడియో ఇలా యూ ట్యూబ్ కంటెంట్ పెరిగిపోతోంది. దాంతో ఖర్చు కూడా పెరిగిపోతోంది. యూ ట్యూబ్ కంటెంట్ అది కూడా విజువల్ గా వుండకపోతే, జనం చూడడం లేదు. దాంతో అదో ఖర్చు. అల వైకుంఠపురములో రెండు పాటలకు ప్రమోషనల్ విడియోలు చేయడానికి ఒక్కోదానికి పాతిక లక్షల పైనే ఖర్చు అయింది. అది చూసి ప్రతి రోజూ పండగే సినిమాకు కూడా ఓ ఆరులక్షల వరకు ఖర్చు చేసి ప్రమోషన్ విడియో చేసారు.
ఇలా చేయకపోతే యూ ట్యూబ్ లో పెద్దగా చూడడం లేదు. అలా చూడకపోతే హీరోలు ఫీలయిపోతారు. అందుకే మధ్యమార్గంగా ఈ పెయిడ్ హిట్ లను ఆశ్రయిస్తున్నారు. ఆ మధ్య ఓ మీడియం సినిమాకు ముక్కి మూలిగి మూడురోజులకు ఓ మిలియన్ వ్యూస్ వచ్చాయి. రాత్రికి రాత్రి మరో మిలియన్ యాడ్ అయిపోయాయి. అంటే అర్థం చేసుకోవచ్చు. ఏం జరిగి వుంటుందో?
కానీ ఫ్యాన్స్ కూడా ఊరుకోవడం లేదు. ఎక్కడ ఎలా వస్తున్నాయో అన్నీ దుర్భిణీ వేసి చూస్తున్నారు. తేడా వస్తే, ఏదో హ్యాష్ ట్యాగ్ పెట్టి ట్విట్టర్ లో ఉతికేస్తున్నారు. లేటెస్ట్ గా సరిలేరు నీకెవ్వరూ సినిమా టీజర్ కు లైక్స్ పెరగడానికి బదులు కాస్త తగ్గాయి. దాంతో అదిగో ఫేక్ అంటూ ఫ్యాన్స్ ట్విట్టర్ వార్ కు తెరతీసారు.
మొత్తం మీద సంక్రాంతి దాటే వరకు ఈ ట్విట్టర్ వార్ ఇలాగే వుంటుంది.