మన నుడి – మన నది అంటూ కొత్త పల్లవి అందుకున్నారు పవన్ కల్యాణ్. సేవ్ ఉద్థానం అయిపోయింది, సేవ్ రాయలసీమ, సేవ్ ఉత్తరాంధ్ర, సేవ్ నల్లమల కూడా పరిష్కారం లేకుండానే ముగిసిపోయాయి.
ఇక సమస్యే లేకుండా సేవ్ ఇసుక, సేవ్ భవన నిర్మాణ కార్మికులు అంటూ మొదలు పెట్టి, రెండు రోజులు ఆహార శిబిరాలు పెట్టి మమ అనిపించారు పవన్. తాజాగా తెలుగు భాషోద్యమం మొదలుపెడుతున్నారట.
మాతృభాషను కాపాడుకోడానికి ఉద్యమిస్తున్న తనతో అందరూ కలసిరావాలని కోరుతూ స్టేట్ మెంట్లిస్తున్నారు. ఖాళీగా ఉన్న రాజకీయ నాయకులు, కొంతమంది కవులు కూడా ఆయనతో జట్టు కడుతున్నారు.
ఇది చాలదన్నట్టు.. ట్విట్టర్లో భగవద్గీత శ్లోకాలు, క్రిస్టియన్ ఛానెల్ వాక్యాలు పోస్ట్ చేస్తూ తెలుగుభాషపై తనకున్న అభిమానాన్ని చాటుకుంటున్నారు పవన్. అసలింతకీ పవన్ చేసే భాషోద్యమం లక్ష్యం ఏంటి? ఏపీలో ఇంగ్లిష్ మీడియం నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే వరకూ పవన్ ఉద్యమం చేస్తారా? లేక మిగతా వాటిల్లాగే మధ్యలోనే వదిలేస్తారా? అసలు రాష్ట్రంలో ఎవరూ పూసుకోనంతగా పవన్ కల్యాణ్ ఎందుకీ సబ్జెక్ట్ ని తలకెత్తుకున్నారు. ట్విట్టర్లో ఎందుకు అంతలా గింజుకుంటున్నారు.
పుట్టి బుద్ధెరిగిన తర్వాత పవన్ తెలుగు భాషపై ఈ స్థాయిలో ఎప్పుడూ ప్రేమ కురిపించలేదని అర్థమవుతోంది. కనీసం ట్విట్టర్ అకౌంట్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా పవన్ ఎప్పుడూ తెలుగుపై ఇంత అభిమానం చూపించలేదు. కేవలం ఇప్పుడు సీఎం జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకించేందుకే శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అందులో భాగమే ఈ భాషా పరిరక్షణ ఉద్యమం.
పోనీ తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ప్రభుత్వంతో పాటు, ప్రైవేట్ స్కూల్స్ లో కూడా తెలుగు మీడియాన్ని బోధించేలా చేస్తామనే ధైర్యం పవన్ కు ఉందా. ఉంటే ఆ స్టేట్ మెంట్ ఇస్తే పోలా అని ట్రోల్ చేస్తున్నారు చాలామంది.
ఓ పక్క వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం కోసం ప్రభుత్వం జీవో జారీ చేసింది, ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు కూడా త్వరలో ప్రారంభంకాబోతున్నాయి. చంద్రబాబు కూడా జగన్ నిర్ణయాన్ని సమర్థిస్తూ.. యూ టర్న్ తీసుకున్నారు. మరి పవన్ కల్యాణ్ కి ఇంకా జ్ఞానోదయం ఎందుకు కాలేదో, ఎప్పటికి అవుతుందో తెలియడం లేదు.