నచ్చిన వారి మాట వెచ్చగా వుంటుంది…నచ్చని వారి మాట గుచ్చుకున్నట్లు వుంటుంది. తెలుగునాట మీడీయా వ్యవహారం ఇలాగే వుంది. జగన్ అంటే చాలు ఒంటికాలితో లేచిపోతారు. కేసిఆర్ అంటే ఎక్కడో ఏదో అయిపోతుంది. ఒక్క కలంపోటుతో వీఆర్వో వ్యవస్థను రద్దు చేసారు కేసిఆర్. నిజానికి ఇది మంచి పనే. ఎందుకంటే ఈ వ్యవస్థలో అవినీతి వేళ్లూనుకుపోయి దారుణంగా దోచుకుంటున్నారు.
ఇది తెలంగాణలో మాత్రమే కాదు. ఆంధ్రలో కూడా. ఒక ఎకరా పొలం కావచ్చు, ఒక పాస్ బుక్ ఎంట్రీ కావచ్చు కనీసం ఆరు నుంచి పదివేలు డిమాండ్ చేస్తున్నారు. లేదూ అంటే ఎమ్మార్వో డిజిటల్ సిగ్నేచర్ కాదు. అదే ఎక్కువ ఎకరాలు అయితే ఆ మొత్తం అలా అలా పెరిగిపోతుంది. వేలు కాదు లక్షలు కూడా చేతులు మారతాయి. ఇక్కడ రికమెండేషన్లు కూడా పని చేయవు.
నిజానికి ఓ ఎకరా పొలం రిజిస్టర్ అయిన తరువాత ఆటోమెటిక్ గా పేరు బదలాయింపు పద్దతి వుండాలి. మధ్యలో ఈ వీఆర్వో వ్వవస్థ వుండడంతో అది సాధ్యం కావడం లేదు. తెలుగు నాట కూడా ఆటోమెటిక్ మ్యూటేషన్ పద్దతి అమలులోకి తీసుకురావడానికి జగన్ ప్రయత్నిస్తున్నారు.
అయితే కేసిఆర్ ఓ అడుగు ముందుకు వేసి టోటల్ గా వీఆర్వో వ్యవస్థనే క్షణాల్లో రద్దు చేసారు. అలాగే కొన్ని గంటల్లోనే మొత్తం రికార్డులు హ్యాండోవర్ చేయమని ఆదేశించారు. కొన్నాళ్ల పాటు రిజిస్ట్రార్ ఆఫీసులకు సెలవు ప్రకటించేసారు. ఇవన్నీ నిజంగా విప్లవాత్మక నిర్ణయాలు అందులో సందేహం లేదు.
కానీ చిత్రమేటంటే, ఈ వ్యవహారం మీద తెలుగు మీడియా ఏ మాత్రం స్పందచలేదు. ఇది మంచిదనీ చెప్పలేదు. కాదనీ చెప్పలేదు. జస్ట్ రిపోర్ట్ చేసి ఊరుకుంది. ఈ రోజు మరి కాస్త అడుగు ముందుకు వేసి రైతులు ఎలా సంబరాలు చేసుకుంటున్నారో వెల్లడించింది.
సరే, తెలంగాణ సంగతి పక్కన పెడదాం. ఇదే పని, ఇదే విధంగా జగన్ చేసి వుంటే ఇదే మీడియా ఎలా స్పందిస్తుంది? అర్జెంట్ గా ఇది తుగ్లక్ పని అంటూ ప్రచారం ప్రారంభించేది. మరోపక్కన అర్జెంట్ గా కోర్టులో పిటిషన్ వేయించడానికి ఏర్పాట్లు జరిగిపోయేవి. ఇంకోపక్క వాడవాడలా వీఆర్వోల నిరసనలు వగైరా మిన్ను ముట్టినట్లు వార్తలు కనిపించేవి. ఇలా జగన్ ను ఎంత యాగీ చేయాలో అంతా చేసి వుండేవారు. అందులో అనుమానం ఇసుమంతయినా లేదు.
ఎందుకంటే ఇక్కడ నిర్ణయాలు నచ్చక కాదు, జగన్ ఫేస్ ఆ మీడియాకు నచ్చదు అంతే.