కేంద్రం ప్రవేశపెట్టిన జాతీయ విద్యా విధానం.. జగన్ ప్రవేశపెట్టబోతున్న ఇంగ్లిష్ మీడియంకు అడ్డంకిగా మారిన సంగతి తెలిసిందే. ఐదో తరగతి వరకు మాతృభాషలోనే బోధన ఉండాలంటూ నూతన విద్యావిధానం తేల్చిచెప్పడంతో, ఆంధ్రప్రదేశ్ లో ఇంగ్లిష్ మీడియం అమలుపై జగన్ కూడా తన వ్యూహాలు మార్చారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఐదో తరగతి వరకు మాతృభాషలోనే బోధన జరుపుతామని స్పష్టంచేసిన ముఖ్యమంత్రి.. ఈ సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.
“తెలుగు మీడియం విద్యార్థులతో పోలిస్తే, ఇంగ్లిష్ మీడియంలో చదివిన విద్యార్థులు పబ్లిక్-ప్రైవేట్ రంగాల్లో ఎక్కువ అవకాశాలు పొందుతున్నారు. ఈ అసమానతలు తగ్గించేందుకే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టాలనుకుంటున్నాం. జాతీయ విద్యావిధానంలో చెప్పినట్టు దేశవ్యాప్తంగా ప్రైవేట్ స్కూల్స్ కూడా ఐదో తరగతి వరకు మాతృభాషలోనే విద్యాభోదన జరిపితే ఇక ఎలాంటి సమస్య ఉండదు. మాకూ అభ్యంతరం ఉండదు.”
అంటే.. నూతన విద్యావిధానం అమల్లోకి వచ్చినప్పటికీ ప్రైవేట్ స్కూల్స్ తమ వ్యవహార శైలిని మార్చుకోవనే అనుమానాన్ని వ్యక్తంచేశారు జగన్. అలాంటప్పుడు తామెందుకు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టకూడదనేది పరోక్షంగా జగన్ ప్రశ్న. అయినప్పటికీ నూతన విద్యావిధానం ప్రకారం.. మాతృభాషలోనే బోధనను కొనసాగించి.. ఇంగ్లిష్ కు ఇచ్చే ప్రాధాన్యాన్ని ఇంకాస్త పెంచుతామంటున్నారు జగన్.
“ఆరో తరగతి నుంచి నిర్బంధ మాతృభాష బోధన విధానం లేదు కాబట్టి.. ఆరో తరగతి నుంచి పూర్తిస్థాయిలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెడతాం. జాతీయ విద్యా విధానం ప్రకారం ఐదో తరగతి వరకు మాతృభాషలోనే బోధన సాగుతున్నప్పటికీ.. ఇంగ్లిష్ భాషకు సంబంధించి ఐదో తరగతి వరకు కాస్త ఎక్కువ ఇన్ పుట్స్ ఇవ్వబోతున్నాం. ఇలా చేయడం వల్ల ఆరో తరగతి నుంచి విద్యార్థులు వెంటనే ఇంగ్లిష్ మీడియంకు మారడానికి వీలవుతుంది. వాళ్లపై ఒత్తిడి పెరగదు.”
ఇలా ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టే విధానంపై ప్రభుత్వ వైఖరిని స్పష్టంచేశారు ముఖ్యమంత్రి. ఇంగ్లిష్ అంటే ఇష్టంతో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడం లేదని, అదే సమయంలో మాతృభాష తెలుగును నిర్లక్ష్యం చేసే పరిస్థితి ఉండదని జగన్ స్పష్టంచేశారు. ఆర్థిక స్థోమత లేక ఎంతోమంది పేదలు తమ పిల్లల్ని ఇంగ్లిష్ మీడియంలో చదివించలేకపోతున్నారని, ఉద్యోగ అవకాశాల్లో వెనకబడి పోతున్నారని, అలాంటి వాళ్ల కోసమే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విధానాన్ని తీసుకురాబోతున్నామని అన్నారు జగన్.