అనగనగా రేపల్లె అనే అసెంబ్లీ నియోజకవర్గం. ఆ నియోజకవర్గానికి అనగాని సత్యప్రసాద్ అనే టీడీపీ ఎమ్మెల్యే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆయన పేరుకు సత్యప్రసాదే కానీ, వాక్కు మాత్రం అసత్యప్రసాద్. అదే ఆయన గారి ప్రత్యేకత. అందుకు తాజా నిదర్శనం ఆయన విడుదల చేసిన ప్రెస్‌నోటే. ఎద్దు ఈనిందని పచ్చ బ్యాచ్ అంటే…గాటిన కట్టేసే పచ్చ మీడియా ఉందనే ధైర్యం.
సమయం, సందర్భం లేకుండా మనసులో ఓ ఆలోచన మెదిలిందో లేక తన ఉనికిని లోకానికి సాటి చెప్పాలనే తపనో తెలియదు కానీ…ఆ ఎమ్మెల్యే గారి ప్రెస్ నోట్ అంతా వెటకారం దట్టించి ఉంది. ప్రారంభం మొదలుకుని చిట్ట చివరి అక్షరం వరకూ ప్రతి అక్షరం టీడీపీ ఓర్వలేని తనాన్ని ఎత్తి చూపింది.
“క్రికెట్లో సింగిల్ రన్ తీయడం చేతకాని వ్యక్తి సెంచరీ కొడతానని ప్రగల్భాలు పలికినట్లుగా వైకాపా ప్రభుత్వ వైఖరి ఉంది. వైసీపీ నేతలకు పాలన చేతకాకపోతే ఇంట్లో కూర్చొని వీడియో గేమ్‌లు ఆడుకోవాలే తప్ప అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రాన్ని నాశనం చెయ్యొద్దు” అని రేపల్లె ఎమ్మెల్యే ఉచిత సలహాలిచ్చారు. సింగిల్ రన్ తీయడం చేతకాకుండానే అధికారంలో ఉన్న టీడీపీని 23 సీట్లకు ఎలా పరిమితం చేశారో అనగాని చెబితే బాగుంటుంది.
ప్రగల్భాలు వైసీపీవా? తమరివా? ఎమ్మెల్యే గారూ…కాస్తా చెప్పండి సార్. ఎటూ అధికారం కోల్పోయి పనేమీ లేకపోవడంతో ప్రెస్నోట్లు రాసుకుంటున్న టీడీపీ నేతలు వీడియో గేమ్‌లు ఆడుకోవాలా? లేక పాలన సాగిస్తున్న పార్టీ నేతలు ఆడుకోవాలో కాస్తా ఆలోచించుకుంటే మంచిది
“ముఖ్యమంత్రి జగన్‌కి బెంగళూరు, హైదరాబాద్, తాడేపల్లి ఇలా మూడు చోట్ల మూడు ఇళ్లు ఉన్నాయనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారా? లేక, వైకాపా జెండాకు మూడు రంగులు ఉన్నాయి కాబట్టి మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారా?” అని జగన్ ప్రభుత్వాన్ని అనగాని ప్రశ్నించారు. జగన్ ఇళ్ల సంగతి ఎందుకు కానీ, తమ పార్టీకి భవిష్యత్‌లో నిలువ నీడ కూడా లేకుండా మూడు రాజధానులు చేస్తాయనే విషయాన్ని విస్మరించొద్దు ఎమ్మెల్యే గారూ!
“ఆడబిడ్డలు కన్నీరు పెడితే ఇంటికి, అన్నదాతలు కంటతడి పెడితే దేశానికి మంచిది కాదంటారు. వైకాపా పాలనలో వారంతా ప్రతి రోజూ ఏడుస్తూనే ఉన్నారు. ముఖ్యమంత్రి ఇప్పటికైనా మూడు రాజధానుల నిర్ణయం వెనక్కి తీసుకుని రాష్ట్రాభివృద్ధిపై దృష్టి పెట్టాలి” అని అనగాని సత్యప్రసాద్ హితవు పలికారు.
చింత చచ్చినా పులుపు చావలేదనే సామెత టీడీపీ విషయంలో సరిగ్గా సరిపోతుంది. గత సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైనా…తామే ఇంకా పాలకులమైనట్టు ఆ పార్టీ నేతల మాటల తీరు ఉంది. ఆడబిడ్డలు, రైతులు కేవలం ఆ 29 గ్రామాల్లోనేనా ఉండేది? మిగిలిన ప్రాంతాల్లోని ఆడబిడ్డలు, రైతుల కన్నీళ్ల సంగతేంటి? మిగిలిన ప్రాంతాల్లోని ఆడబిడ్డలు, రైతుల ఉసురుతోనే కదా అంత ఘోర పరాజయాన్ని మూటకట్టుకుందన్న విషయం ఇప్పటికీ తెలుసుకోకపోవడం విచారకరం.
కావున ఇప్పటికైనా రేపల్లె ఎమ్మెల్యే సత్యం పలకకపోయినా నష్టమేమీ లేదు. కనీసం అసత్యం పలకడం మానితే పార్టీకి, రాష్ట్రానికి మంచిదని గ్రహిస్తే మంచిది.