ట్రోల్స్ కు ఉపాధి క‌ల్పించిన బిగ్ బాస్!

మొన్న‌టి వ‌ర‌కూ టిక్ టాక‌ర్స్ ను ట్రోల్ చేస్తూ కొంత‌మంది పొద్దు పోనిచ్చుకునే వాళ్లు. టిక్ టాక్ లో కామెడీగా అనిపించే వేషాల వీడియోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ వీళ్లు ఫాలోయింగ్ ను…

మొన్న‌టి వ‌ర‌కూ టిక్ టాక‌ర్స్ ను ట్రోల్ చేస్తూ కొంత‌మంది పొద్దు పోనిచ్చుకునే వాళ్లు. టిక్ టాక్ లో కామెడీగా అనిపించే వేషాల వీడియోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ వీళ్లు ఫాలోయింగ్ ను పెంచుకునే వాళ్లు. ఇప్పుడు టిక్ టాక్ బంద్ అయ్యింది. దీంతో ట్రోల్ పేజ్ ల‌కు కంటెంట్ కోత ప‌డుతోంది. ఆ లోటును భర్తీ చేస్తోంది బిగ్ బాస్ సీజ‌న్ ఫోర్!

ఒక్క‌ర్న‌ని కాదు.. నాగార్జున‌తో మొద‌లుపెట్టి, బిగ్ బాస్ పార్టిసిపెంట్స్ అంద‌రూ ట్రోల్ కు గుర‌వుతున్నారు. బిగ్ బాస్ ఇంట్ర‌డ‌క్ష‌న్ ఎపిసోడ్ లో నాగార్జున క‌నిపించిన వృద్ధ గెట‌ప్ ను కూడా నెటిజ‌న్లు ఆటాడేసుకుంటున్నారు. ఇక పార్టిసిపెంట్స్ ను అయితే మ‌రీ వెట‌కారం ఆడుతున్నారు.

ఏదో బిగ్ బాస్.. బిగ్ బాస్.. అంటూ హైప్ పెంచ‌డ‌మే త‌ప్ప‌.. వాస్త‌వానికి బిగ్ బాస్ హౌస్ లో స్టే చేస్తున్న వారిలో చాలా మంది చాలా మందికి తెలియ‌నే తెలియ‌దు! ప్ర‌తియేడాదీ బిగ్ బాస్ త‌న స్థాయిని త‌గ్గించేసుకుంటూ వ‌స్తోంది. ఫ‌స్ట్ సీజ‌న్లోనే ఎవ‌రో అనామ‌కుల‌ను తెచ్చార‌నుకుంటే, రెండో సీజ‌న్ మ‌రీ త‌గ్గింది. మూడో సీజ‌న్ అంత హిట్ కూడా కాలేదు. ఇప్పుడు నాలుగో సీజ‌న్ పార్టిసిపెంట్స్ ను చూస్తే.. పాత సీజ‌న్లే న‌య‌మ‌నే ప‌రిస్థితి ఏర్ప‌డుతోంది!

ట్రోల్ చేసే వాళ్లు దీన్నే ఆయుధంగా మ‌లుచుకున్నారు. అనామ‌కుల‌ను తెచ్చి సెల‌బ్రిటీలు అంటూ రుద్దుతున్నార‌ని.. వీళ్ల మీద ఎలాంటి ఆస‌క్తి లేద‌ని తేల్చి చెబుతున్నారు. తొలి ఎపిసోడ్ చూశాకా.. వీళ్లా సెలెబ్రిటీలు అంటూ నోళ్లెల్ల‌బెట్టే మీమ్స్ వైర‌ల్ గా మారాయి. సీజ‌న్ ముగిసే స‌మ‌యానికి వాళ్లే సెల‌బ్రిటీలు అవుతారంటూ పంచ్ లు ప‌డుతున్నాయి!

మిగ‌తా భాష‌ల సంగ‌తేమిటో కానీ.. తెలుగు బిగ్ బాస్ ఇప్ప‌టికీ టాప్ లీగ్ సెల‌బ్రిటీల‌కు దూరదూరంగానే ఉంది. అవ‌కాశాలు లేని వాళ్లకు, అనామ‌కుల‌కు కేరాఫ్ అవుతోంది. ఈ త‌ర‌హా ఎంట‌ర్ టైన్ మెంట్ కోసం ఆశించే జ‌నాల‌కు మాత్రం ఇదే మ‌హాప్ర‌సాదంగా మారింది! ట్రోల్ చేయ‌డ‌మే ప‌నిగా పెట్టుకునే వాళ్ల‌కు ఈ రకంగా బిగ్ బాస్ ఉపాధిని ఇస్తోంది.

అయ్యన్నకు ఇస్తున్న విలువ ఏంటి?