కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. సభ్యులు కూర్చునే సీటింగ్ లో కూడా మార్పుచేర్పులు చేశారు. సమావేశాలకు ముందే అందర్నీ క్షణ్నుంగా పరీక్షించారు. ప్రతి 4 గంటలకు ఒకసారి శానిటైజేషన్ చేశారు. ఇన్ని జాగ్రత్తచర్యలు తీసుకున్నప్పటికీ తెలంగాణ అసెంబ్లీలో కరోనా కేసు బయటపడింది.
అవును.. తెలంగాణల అసెంబ్లీలో ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయింది. పాసులు జారీ చేసే కౌంటర్ లో అతడు విధులు నిర్వహిస్తున్నాడు. డ్యూటీలకు వచ్చే పోలీస్ సిబ్బంది, ఇతర శాఖల సిబ్బందికి ఇతడు పాసులు ఇస్తుంటాడు. అసెంబ్లీలోకి విధులకు వచ్చే ఉద్యోగుల్లో చాలామంది ఇతడి చేతుల మీదుగానే పాసులు అందుకుంటారు. దీంతో వైరస్ ప్రభావం ఏ స్థాయి వరకు వెళ్లిందనేది ఎవ్వరూ అంచనా వేయలేకపోతున్నారు.
నిజానికి అసెంబ్లీ సమావేశాలకు ముందే ప్రజాప్రతినిధులతో పాటు సిబ్బంది అందరికీ కరోనా పరీక్షలు నిర్వహించారు. చివరికి గార్డెనింగ్ చేసే వ్యక్తులకు కూడా పరీక్షలు నిర్వహించారు. నెగెటివ్ వచ్చినట్టు సర్టిఫికేట్ చూపించిన వాళ్లకు మాత్రమే లోనికి అనుమతించారు. ఇన్ని కట్టుదిట్టమైన చర్యల మధ్య పాజిటివ్ సోకిన ఓ వ్యక్తి ఎలా ప్రవేశించాడనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. దీంతో అధికారుల సమన్వయంలో డొల్లతనం బయటపడింది.
అయితే ముఖ్యమంత్రి, మంత్రులతో పాటు ఇతర ఎమ్మెల్యేలకు వైరస్ ముప్పు కాస్త తక్కువనే చెప్పాలి. ఎందుకంటే, వీళ్లకు ఇతడు పాసులు ఇవ్వడు. వీళ్లు కనీసం ఈ కౌంటర్ దగ్గర కూడా ఆగరు. కాబట్టి ప్రజాప్రతినిథులకు రిస్క్ కాస్త తక్కువే అని చెప్పాలి. అయితే అధికారులు మాత్రం సదరు వ్యక్తిగా ముందుగా నెగిటెవ్ వచ్చిందని, తర్వాత పాజిటివ్ గా తేలిందని చెబుతున్నారు. వెంటనే అతడ్ని హోమ్ ఐసోలేషన్ కు పంపించామని కూడా అంటున్నారు.
ఈ నెలాఖరు వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. మధ్యలో మరోసారి కరోనా పరీక్షలు నిర్వహించే అవకాశం లేదని స్వయంగా స్పీకర్ వెల్లడించారు. నెగెటివ్ వచ్చినప్పటికీ, ఉద్యోగులు, ప్రజాప్రతినిథుల్లో ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే అసెంబ్లీ అధికారులకు సమాచారం అందించి, హోమ్ ఐసొలేషన్ లోకి వెళ్లిపోవాలని సూచించారు.
తెలంగాణలో కరోనా కట్టడి చర్యలపై ప్రభుత్వం సరైన రీతిలో స్పందించడం లేదని, టెస్టుల విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఆరోపిస్తోంది. ఈ అంశాన్ని అసెంబ్లీలో బలంగా లేవనెత్తాలని ఇదివరకే నిర్ణయించింది. ఇప్పుడు ఏకంగా అసెంబ్లీలోనే కరోనా పాజిటివ్ కేసు బయటపడ్డంతో కాంగ్రెస్ కు ఇప్పుడు మరింత ఊతం లభించినట్టయింది.