విలక్షణ నటుడు జయప్రకాశ్‌రెడ్డి తన కోరిక తీరకుండానే దివికేగారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలవాలని జయప్రకాశ్‌రెడ్డికి బలమైన కోరికగా ఉండింది. ఈ విషయం జయప్రకాశ్‌రెడ్డి సన్నిహిత మిత్రుడు, ప్రముఖ కమెడియన్, వైసీపీ నాయకుడైన అలీ చెప్పడంతో తెలిసొచ్చింది.
చిత్ర పరిశ్రమలో జయప్రకాశ్‌రెడ్డి పాత్రలకు ఓ విలక్షణత ఉంది. ఏ పాత్రలో ఆయన సునాయాసంగా ఒదిగిపోతారు. విలన్‌గా, హాస్య నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా…అన్ని పాత్రల్లో నటించి మెప్పించిన అతికొద్ది మందిలో జయప్రకాశ్‌రెడ్డి ఒకరు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన జయప్రకాశ్‌రెడ్డి పాత్రలకు ప్రాణం పోసేవారంటే అతిశయోక్తి కాదు. తెల్లవారుజామున గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన ఆయన టాలీవుడ్‌కు తీరని దుఃఖాన్ని మిగిల్చారు.
జయప్రకాశ్‌రెడ్డి మృతికి ఆయన మిత్రుడైన అలీ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. జయప్రకాశ్‌రెడ్డి మరణం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. ఆయన గొప్ప స్టేజ్ యాక్టర్ అని, నాటక రంగాన్ని కాపాడాలనే తపన ఆయనలో ఎక్కువగా ఉండేదన్నారు. సినిమా కంటే నాటకాన్నే ఎక్కువగా ప్రేమించారన్నారు.
30 ఏళ్లుగా తామిద్దరూ చిత్రపరిశ్రమలో కలసి ప్రయాణం చేస్తున్నట్టు తెలిపారు. నాటక రంగం గురించి చర్చించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిసేందుకు సాయం చేయాలని తనను కోరారని అలీ తెలిపారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆయన కోరిక తీర్చలేక పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ లోపే ఆయన మరణించారని అలీ పేర్కొన్నారు.