వివాహేతర సంబంధాలు విచక్షణ కోల్పోయేలా చేస్తున్నాయి. అక్రమ సంబంధాలతో పచ్చటి కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయి. తాజాగా ఇలాంటిదే మరో ఘటన తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను చంపేందుకు కుట్ర పన్నింది భార్య. అయితే చిన్న కూతురు చేసిన తెలివైన పనితో కుట్ర బయటపడి, భర్త బతికిపోయాడు.
మండపేటకు చెందిన చెల్లుబోయిన కుమారికి సుధాకర్ తో పెళ్లయింది. ఇదేదో కొత్తగా జరిగిన పెళ్లి కాదు. దశాబ్దాల కిందటే పెళ్లయింది వీళ్లకి. ముగ్గురు ఆడపిల్లలు. వీళ్లలో ఇద్దరు ఆడపిల్లలకు పెళ్లిళ్లు కూడా చేశారు. ఇంత వయసొచ్చిన కుమారికి ఇప్పుడు అక్రమ సంబంధం కావాల్సి వచ్చింది. అదే ప్రాంతానికి చెందిన సతీష్ అనే వ్యక్తితో ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకుంది.
ఈ క్రమంలో భర్త నుంచి ఇబ్బందులు ఎదురుకావడంతో అతడ్ని అడ్డు తొలిగించుకోవాలని చూడసాగింది కుమారి. తల్లి ఏదో కుట్ర పన్నుతోందని చిన్న కూతురుకి అనుమానం కలిగింది. తల్లి మాట్లాడే కాల్స్ ఆటోమేటిగ్గా రికార్డ్ అయ్యేలా ఫోన్ లో సెట్టింగ్స్ మార్చింది. ఆ ఆడియో క్లిప్స్ విన్న తర్వాత నిర్ఘాంతపోవడం కూతురు వంతయింది.
ఆ ఫోన్ కాల్స్ లో అవతలి వ్యక్తితో భర్తను ఎలా చంపాలనే అంశపై సుదీర్ఘంగా మంతనాలు సాగించింది కుమారి. చివరికి స్లో పాయిజిన్ ఇచ్చి భర్తను అంతం చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఓసారి అన్నంలో తక్కువ మోతాదు విషం కలిపి ఇచ్చింది. కొన్ని రోజులు అస్వస్థతకు గురైన భర్త తిరిగి కోలుకున్నాడు. అయితే కూతురు చేసిన తెలివైన పనితో భార్య కుట్రలు భర్తకు తెలిసొచ్చాయి.
కట్టుకున్న భార్యే తనను చంపేందుకు ప్రయత్నిస్తోందని తెలుసుకొని మండపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు భర్త సుధాకర్. ఈ కేసులో సతీష్, కుమారితో పాటు హత్యాయత్నానికి సహకరించిన సతీష్ స్నేహితుడ్ని కూడా పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు.