సోము వీర్రాజు ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ అయ్యాక మీడియా ముందుకు వస్తే చాలు పచ్చ బ్యాచ్ కి బ్యాండ్ బాజాయేనని అర్ధమైపోతోంది. సోము ఏ విధంగా తమ అధినాయకుడు చంద్రబాబుని తగులుకుంటారోనని తమ్ముళ్ళు తెగ వణికిపోతున్నారు. దానికి తగినట్లే మీడియా కూడా సోము ముందు చంద్రబాబు పేరు ఎత్తుతోంది.
దాంతో సహజంగానే మండిపోయే సోము ఏం మమ్మల్నే అన్నీ అడుగుతారేంటి, చంద్రబాబుని ఏమీ అడగరా అంటూ ఓ రేంజిలో ఫైర్ అవుతున్నారు. బీజేపీకి బాబు టచ్ లోకి వచ్చారుట అన్న ప్రశ్నకు సోము రియాక్షన్ ఇది.
మోడీని ప్రధాని అని కూడా చూడకుండా నల్లకుండలతో స్వాగతం పలికి నల్ల చొక్కాలు వేసుకుని నిరసన చేసిన నాడు బీజేపీ పొత్తు ఏమైందని బాబును సోము నిలదీస్తున్నారు. నాడు కాంగ్రెస్ పార్టీతో కలసి చెట్టపట్టాలు వేసుకున్న చంద్రబాబు మళ్ళీ ఇపుడు బీజేపీ ఊసు ఎందుకు తలుస్తున్నారని కూడా సోము నిగ్గదీస్తున్నారు.
ఆనాడు చంద్రబాబు అధికారంలో ఉన్నారు, అందువల్ల బీజేపీ నాయకుల తాట తీస్తారా, ఇపుడు ఓడిపోయి పడిపోయారు కాబట్టి టచ్ లోకి వస్తారా అంటూ నిప్పులే చెరిగారు. అయినా ఆయన ఏవేవో ఊహించుకుంటాడు, వాటిని మేమెందుకు జవాబు చెప్పాలి అని సోము బాబు గాలి తీసేశారు.
మాతో పొత్తు వద్దు అనుకున్నపుడు బుర్ర చెడిందా ఇపుడు మళ్ళీ టచ్ లోకి వస్తున్నపుడు బుర్ర బాగుందా అన్నది మీడియా మిత్రులే బాబును అడగాలని సోము సూచించడం విశేషం.
ఒకటి మాత్రం నిజం, మాకు జనసేనతో తప్ప మరే పార్టీతోనూ ఏపీలో పొత్తు లేదు, చంద్రబాబు తాను బీజేపీకి టచ్ లో ఉన్నానని ఎంతైనా చెప్పుకోవచ్చు కానీ మా వైపు నుంచి ఇదే సమాధానం అంటూ పక్కా క్లారిటీగా సోము వీర్రాజు చెప్పేశారు. మొత్తానికి సోము వీరావేశం చూసైనా బాబు పొత్తు ఆశలు మానుకుంటారా.