సుశాంత్ సింగ్ కేసులో హీరోయిన్ రియా అరెస్ట్ అయింది. ఈ కేసు డ్రగ్స్ మలుపు తీసుకున్నప్పుడే ఆమెను ఏ క్షణానైనా అరెస్ట్ చేస్తారంటూ ఊహాగానాలు వినిపించాయి. వాటిని నిజం చేస్తూ.. 3 రోజుల విచారణ అనంతరం ఈరోజు రియాను అదుపులోకి తీసుకున్నారు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు.
హీరో సుశాంత్ సింగ్ కు డ్రగ్స్ అందించడంతో పాటు.. తను కూడా మాదకద్రవ్యాలు తీసుకున్నట్టు విచారణలో భాగంగా రియా అంగీకరించినట్టు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే రియా సోదరుడు షోవిక్ ను ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు.
రియా వాట్సాప్ ఛాట్స్ లో మాదక ద్రవ్యాల ప్రస్తావన రావడంతో వెంటనే రంగంలోకి దిగిన నార్కోటిక్స్ బ్యూరో.. ఆ దిశగా రియాను, ఆమె సోదరుడ్ని ప్రశ్నించింది. ఇదే క్రమంలో ముంబయిలో ఓ భారీ డ్రగ్ రాకెట్ ను చేధించడం, పట్టుబడిన వ్యక్తుల్లో ఒకడు రియా సోదరుడు షోవిక్ ను గుర్తుపట్టడంతో కేసు మలుపు తిరిగింది. ఆ వెంటనే షోవిక్ అరెస్ట్ అయ్యాడు.
మరోవైపు గోవాకు చెందిన హోటల్స్ వ్యాపారి గౌరవ్ ఆర్యాను పోలీసులు కొన్ని రోజులుగా ప్రశ్నించారు. అతడిచ్చిన సమాచారం, ఈరోజు రియా అరెస్ట్ కు దోహదపడిందనేది బాలీవుడ్
మీడియా కథనం.
తను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని, అవసరమైతే పరీక్షల కోసం బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడానికి కూడా సిద్ధమని రియా కొన్ని రోజుల కిందట ప్రకటించింది. అయితే తాజా విచారణలో మాత్రం ఆమె మాదకద్రవ్యాలు సేవించినట్టు, సుశాంత్ కు కూడా ఇచ్చినట్టు అంగీకరించినట్టు చెబుతున్నారు.
ఇక ఈ కేసులో శామ్యూల్ మిరందా, దీపేష్ సావంత్ మాత్రం మిగిలారు. సుశాంత్ ఇంటికి సంబంధించిన మేనేజర్ శామ్యూల్ కాగా.. సుశాంత్ వ్యక్తిగత సిబ్బందిలో ఒకడు దీపేష్ సావంత్. రియా, షోవిక్ ఆదేశాల మేరకు మార్చి-జూన్ మధ్యకాలంలో 165 గ్రాముల డ్రగ్స్ ను కలెక్ట్ చేసి వాళ్లకు అందజేశాడట దీపేష్. అంతేకాదు.. 2018 సెప్టెంబర్ లో సుశాంత్ కూడా డ్రగ్స్ తీసుకుంటుండగా అతడు చూసినట్టు జాతీయ మీడియా కథనాలు ఇస్తోంది.
మొత్తమ్మీద రియా-షోపిక్ అరెస్టుతో సుశాంత్ కేసు పూర్తిగా డ్రగ్స్ మలుపు తీసుకుంది. రాబోయే రోజుల్లో ఈ కేసు ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందో చూడాలి.