ఒకే రోజు 10 సినిమాలు.. అందరికీ సమాన అవకాశాలు

ఈ 2 వారాలు దాటితే వచ్చే నెల నుంచి చిన్న సినిమాలకు దారి లేదు. అందుకే ఈ వారం ఏకంగా 10 సినిమాలు క్యూ కట్టాయి. అన్నీ చిన్న సినిమాలే. ఒక సినిమాకు క్రేజ్…

ఈ 2 వారాలు దాటితే వచ్చే నెల నుంచి చిన్న సినిమాలకు దారి లేదు. అందుకే ఈ వారం ఏకంగా 10 సినిమాలు క్యూ కట్టాయి. అన్నీ చిన్న సినిమాలే. ఒక సినిమాకు క్రేజ్ ఉంది, ఇంకో సినిమాకు బజ్ లేదు అనే చర్చకు తావే లేదు. అన్నీ ఒకే రేంజ్ సినిమాలు. ఇంకా చెప్పాలంటే.. ఈ సినిమాలన్నింటికీ విజయావకాశాలు సమానం. కంటెంట్ బాగుండే ఆడుద్ది, లేకపోతే పోతుంది.

ఛలో ప్రేమిద్దాం, ఊరికి ఉత్తరాన, మిస్సింగ్, సావిత్రి వైఫ్ ఆఫ్ సత్యమూర్తి, పోస్టర్, మిస్టర్ లోన్లీ, రామ్ అసుర్, రావణ లంక, గూడుపుఠానీ, స్ట్రీట్ లైట్.. ఇలా ఒకే రోజు 10 సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. ప్రతి సినిమా యూనిట్, తమ స్థాయికి తగ్గట్టు ప్రచారం చేస్తున్నాయి. అయితే వేటికీ ఓపెనింగ్స్ రావనేది కఠోర వాస్తవం.

ఇలాంటి సినిమాలు ముందుగా కంటెంట్ తో తమనుతాము నిరూపించుకోవాలి. అప్పుడే మౌత్ టాక్ మొదలవుతుంది. అలా పాజిటివ్ మౌత్ టాక్ ఉన్న సినిమా ఆటోమేటిగ్గా నిలబడుతుంది. అంతోఇంతో వసూళ్లు కళ్లజూస్తుంది. ఈ 10 సినిమాల్లో అలా నిలబడే సినిమా ఏంటనేది మరికొన్ని గంటల్లో తేలిపోతుంది.

ఈ సినిమాలన్నింటికీ మరో అంశం బాగా కలిసొచ్చింది. గతవారం రిలీజైన సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద నిలదొక్కుకోలేకపోయాయి. పుష్పకవిమానం, రాజావిక్రమార్క, కురుప్ సినిమాలన్నీ వచ్చినట్టే వచ్చి వెనక్కి వెళ్లాయి. కాబట్టి రేపు రిలీజ్ అవుతున్న 10 సినిమాలకు థియేటర్ల సమస్య లేదు. గత వారం సినిమాలతో పోటీ లేదు.

సో.. ఏది క్లిక్ అవుతుందనేది ఆ సినిమాల కంటెంట్ పైనే ఆధారపడి ఉంటుంది. చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్టయిన మూవీస్ ప్రతి ఏడాది ఉన్నాయి. ఈవారం అలాంటి సినిమా ఒకటి తెరపైకొస్తుందేమో చూడాలి.