తెలంగాణ మంత్రుల్లో కొత్త ఎమ్మెల్సీల భయం

తెలంగాణ మంత్రులకు పదవీ గండం పొంచి ఉంది. కొత్తగా రిక్రూట్ అవుతున్న ఎమ్మెల్సీలతో వారికి ముప్పు పొంచి ఉందనే విషయం ఈపాటికే ప్రచారంలోకి వచ్చింది.  Advertisement అందులోనూ ఒక సామాజిక వర్గంలోని ఇద్దరిలో ఒకరికి…

తెలంగాణ మంత్రులకు పదవీ గండం పొంచి ఉంది. కొత్తగా రిక్రూట్ అవుతున్న ఎమ్మెల్సీలతో వారికి ముప్పు పొంచి ఉందనే విషయం ఈపాటికే ప్రచారంలోకి వచ్చింది. 

అందులోనూ ఒక సామాజిక వర్గంలోని ఇద్దరిలో ఒకరికి పదవి ఖాయం అని తేలడంతో, అదే సామాజిక వర్గానికి చెందిన తాజా మంత్రులు హడలిపోతున్నారు. సామాజిక, స్థానిక సమీకరణాలతో కేసీఆర్ లెక్కలు వేస్తున్నారు.

బండప్రకాశ్ కు పదవి గ్యారెంటీ..!

రెండేళ్లకు పైగా రాజ్యసభ పదవీకాలం ఉన్నా కూడా బండ ప్రకాశ్ ని పనిగట్టుకుని ఎమ్మెల్సీగా చేశారు సీఎం కేసీఆర్. ముదిరాజ్ సామాజిక వర్గంలో ఈటల రాజేందర్ కు ఆల్టర్నేట్ వెదికే పనిలో భాగంగా ఈ ఈక్వేషన్ వేశారు కేసీఆర్. దీంతో ఆయనకు కేబినెట్ బెర్త్ ఖాయమని తేలిపోయింది. 

ఈటల ప్లేస్ లోకి బండ ప్రకాశ్ వస్తున్నారు కాబట్టి.. పోర్ట్ ఫోలియోలు మారతాయే కానీ, వ్యక్తులు మారరు. సో.. ఈయనతో ఎవరికీ పోటీ లేదు, ఈయన ఎవరికీ పోటీ కాదు.  

గుత్తా, వెంకట్రామిరెడ్డిలో ఒకరికి పదవి..

గుత్తా సుఖేందర్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తాననే హామీ మేరకే ఎమ్మెల్సీగా చేసినట్టు చెబుతున్నారు. గుత్తాకు పదవి ఇస్తే అదే సామాజిక వర్గానికి చెందిన మరొకరిని తొలగించాలి. లోకల్ ప్రయారిటీ ప్రకారం ఉమ్మడి నల్గొండ జిల్లానుంచి ఆ తొలగింపు ఉంటుందా, లేక సామాజిక వర్గం లెక్కలోనే ఇతర జిల్లాలనుంచి ఓ మంత్రిని పక్కనపెడతారా అనేది తేలాల్సి ఉంది. 

మాజీ కలెక్టర్ వెంకట్రామి రెడ్డిని కూడా కేసీఆర్ మంత్రి వర్గంలోకి తీసుకునే ఛాన్స్ ఉందని అంటున్నారు. అదే నిజమైతే.. గుత్తా వెనకబడిపోవచ్చు, లేదా ఇద్దర్నీ తీసుకుంటే.. మరో ఇద్దరు మంత్రులకు ఉద్వాసన తప్పకపోవచ్చు. ఇంద్రకరణ్ రెడ్డి, మల్లారెడ్డి ఈ తొలగింపు జాబితాలో ఉంటారనే ఉహాగానాలు వినిపిస్తున్నాయి.

కడియం శ్రీహరి సంగతేంటి..?

సీనియర్ నేత కడియం శ్రీహరి, కేసీఆర్ తొలి కేబినెట్ లో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. రెండోసారి అసలు కేబినెట్ లోకి తీసుకోలేదు, తీరా ఇప్పుడు ఎమ్మెల్సీని చేశారు. ఆయన కూడా మంత్రి పదవి ఆశిస్తున్నట్టు తెలుస్తోంది.

పల్లా, పట్నం ఆశలు నెరవేరుతాయా..

ఇటీవల పట్టభద్రుల స్థానం నుంచి గెలిచిన పల్లా రాజేశ్వర రెడ్డి, స్థానిక సంస్థల కోటాలో గెలిచిన పట్నం మహేందర్ రెడ్డి కూడా కేబినెట్ లో బెర్త్ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతానికి వీరిపై చర్చ జరగలేదు కానీ, సంచలన నిర్ణయాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే కేసీఆర్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో ఎవరికీ తెలియదు. 

కొత్తగా ఎవరికి పదవులిచ్చినా పెద్దగా సంచలనం కాదు కానీ, కేబినెట్ నుంచి ఎవరినైనా బయటకు పంపిస్తేనే అది సంచలనం అవుతుంది. మరి ఆ దురదృష్టవంతులెవరో చూడాలి.