కంచు కోటలు అని గట్టిగా అనుకున్నా అవి మంచుకోటలే అనే తమ్ముళ్ళకు రెండున్నరేళ్ళుగా రుజువు అవుతున్న సత్యం. మునిసిపల్ ఎన్నికల్లో విశాఖ సిటీలోని కీలక స్థావరాలు కదిలిపోయాయి. ఇపుడు పరిషత్తు ఫలితాలతో రూరల్ జిల్లాల్లో కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది.
విశాఖ జిల్లా భీమిలీ నియోజకవర్గంలోని ఆనందపురం మండలం టీడీపీకి పెట్టని కోట. ఆ పార్టీ పెట్టాక పుట్టాక అక్కడ గెలిచేది ఎపుడూ టీడీపీయే. ఈ విషయంలో రెండవ మాట లేనే లేదు. అలాంటి ఆనందపురం మండలంలోని జెడ్పీటీసీకి తాజాగా ఎన్నికలు జరిగితే వైసీపీ అభ్యర్ధి బ్రహ్మాండమైన మెజారిటీతో విజయం సాధించడం విశేషం.
ఇక్కడ వైసీపీ అభ్యర్ధి కోరాడ వెంకటరావు ఏకంగా 3,576 వేల ఓట్లతో ఘన విజయం సాధించారు. ఎపుడూ టీడీపీనే గెలిపించే ఇక్కడ జనాలు తొలిసారి గా ఫ్యాన్ నీడన సేద తీరారు. అది కూడా మంచి మెజారిటీతో వైసీపీని గెలిపించడంతో టీడీపీ తమ్ముళ్ళు ఒక్కసారిగా ఖంగు తినాల్సి వచ్చింది.
భీమిలీ నియోజకవర్గంలో టీడీపీ గట్టిగా ఉంది అంటే దానికి కారణం ఆనందపురం మండలమే. అలాంటి చోట కూడా రాజకీయంగా పెను మార్పులు వస్తున్నాయా అన్న చర్చ అయితే ఉంది. మరి ఈ మార్పు రేపటి ఎన్నికల్లో మరో మారు భీమిలీ కోటలో సైకిల్ కి పంక్చర్ పెట్టేలా ఉందన్న విశ్లేషణలూ ఉన్నాయి. దాంతో టీడీపీలో కొత్త గుబులు మొదలైంది అంటున్నారు.