గత మూడునాలుగు రోజులుగా టాలీవుడ్ లో ఐటి రైడ్స్ కలకలం సాగుతోంది. రకరకాల వదంతులు వినిపిస్తున్నాయి. అసలు ఏం జరుగింది అన్నది తెలుసుకునే ప్రయత్నం చేస్తే..
21న జంటనగరాల్లోని పలు చోట్ల ఐటి రైడ్స్ ప్రారంభమయ్యాయి. వాస్తవానికి సినిమా జనాలు, రాజకీయ జనాలు కాబట్టి ఎక్కువగా బయటకు తెలిసాయి కానీ, అదే రోజు వేరే మూమూలు జనాల మీద చాలా చోట్ల దాడులు జరిగాయని వినికిడి.
ఆ సంగతి అలా వుంచితే, ఉదయం ఆరు గంటలకే దగ్గుబాటి సురేష్ బాబు కంపెనీల మీద, ఆయన సంబంధీకుల మీద, హారిక హాసిని సంస్థపైన దానితో సంబంధం వున్న సితార ఎంటర్ టైన్మెంట్స్, వ్యక్తుల పైనా, హీరో నాని పైనా, నాని మేనేజర్ వెంకట్ ఇంటిపైనా దాడులు ప్రారంభమయ్యాయి. ఐటి అధికారాలు ముందుగా బాగా రెక్కీ చేసినట్లు తెలుస్తోంది. నాని మేనేజర్ ఇల్లు ఆయనకే తెలియదు కానీ, ఐటి సిబ్బంది మాత్రం నేరుగా అక్కడికి చేరుకున్నారు.
భలే భలే నుంచీ..
నాని ఇల్లు, ఆఫీసు లో సోదాలు సాగాయి. రెండు రోజుల పాటు ఈ సోదాలు సాగాయి. దాదాపు భలే భలేమగాడివోయ్ టైమ్ నుంచి లెక్కలు ఆరా తీసినట్లు తెలుస్తోంది. పారితోషికం అగ్రిమెంట్లు అన్నీ అడిగి మరీ తీసుకున్నారని బోగట్టా. అయితే నగదు రూపంలో నాని దగ్గర కానీ, ఆయనకు సంబంధించిన వారి దగ్గర కానీ ఏమీ లేదు. నాని ది ఉమ్మడి కుటుంబం. నాని వైపు వారు, నాని భార్య వైపు వారు అంతా కలిసే వుంటారని తెలుస్తోంది. అందువల్ల దగ్గర దగ్గర 800 గ్రాముల బంగారం వున్నా, పెద్దగా లెక్కలోకి రాలేదని బోగట్టా.
హారిక హాసినిలో..
హారిక హాసిని సంస్థలో పెట్టీ క్యాష్ కొంత వుందని అదేమీ సమస్య కాదని తెలుస్తోంది. అలాగే సితార ఎంటర్ టైన్ మెంట్స్ వంశీ ఇంట్లో జస్ట్ 45 వేలు మాత్రమే క్యాష్ వుందని బోగట్టా. అయితే హారిక హాసినిలో డే అండ్ నైట్ మూడు రోజుల పాటు దాడులు సాగాయి. శనివారం తెల్లవారు ఝామున ముగిసాయి. సితార లో ఒకటిన్నర రోజులో సోదాలు ముగిసినట్లు తెలుస్తోంది.
హారిక హాసినిలో పెద్దగా ఏమీ హడావుడి లేదు కానీ హారిక హాసిని వ్యవహారాలు చూసే పిడీ ప్రసాద్ కారులో ఆయన వ్యక్తిగత ఫైళ్లు కొన్ని వున్నట్లు బోగట్టా. ఇవి కేవలం ఆయనవి మాత్రమే కాదని, వేరే ఆయన సన్నిహితులకు సంబంధించినవి అని కూడా తెలుస్తోంది. అజ్ఞాతవాసి సమయంలో జరిగిన ఖర్చు, లాభ నష్టాలు, వెనక్కు ఇచ్చిన మొత్తాలు, అమ్మకాలు వాటిపైనా ఎక్కువగా ఐటి అధికారులు దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది.
సురేష్ బాబు సంస్థలు
ఇక సురేష్ బాబు సంస్థలపై దాడులు మాత్రం మరో ఒకటి రెండురోజులు కొనసాగే అవకాశం వుంది. ముఖ్యంగా సురేష్ బాబు డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్, థియేటర్ల నెట్ వర్క్ మీద ఐటి అధికారులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అక్కడ ఫైళ్లు వర్క్ చూసిన తరువాత రెండో రోజు దాదాపు ముఫై మంది అదనపు సిబ్బందిని రప్పించినట్లు తెలుస్తోంది. వెంకటేష్ ఇంట్లో సోదాలు, ఆరాలు ఒక రోజులో తేలిపోయినట్లు తెలుస్తోంది.
అన్ని సంస్థల్లో దాడులు జరుగుతున్నంత కాలం ప్రతి వ్యక్తి ఫోన్ ను ఐటి సిబ్బంది కంట్రోల్లో వుంచుకున్నారు. వారు ఎక్కడికైనా అర్జెంట్ గా వెళ్లాలన్నా, వారితో పాటు ఇద్దరు ఐటి జనాలు వెళ్లారు. కార్యాలయ సిబ్బందిని ఇళ్లకు వెళ్లనివ్వలేదు. పెద్లలు ఒకరిద్దరు ఇళ్లకు వెళ్లి రావాలన్నా, కూడా ఐటి స్టాఫ్ కూడా వెళ్లి వచ్చారు. హీరో నాని మాత్రం షూటింగ్ వుందని, నిర్మాతకు నష్టం వస్తుందని ఐటి అధికారులతో మాట్లాడి, అనుమతి తీసుకున్నట్లు బోగట్టా. దాంతో షూటింగ్ కు కూడా ఇద్దరు ఐటి సిబ్బంది నానితో వెళ్లినట్లు తెలుస్తొంది.
ఇదిలా వుంటే ఐడి సోదాలో దొరికిన అనుమానాస్పద కాగితాలు, చీటీలు, మిగిలిన విషయాలు అన్నింటి మీదా ఇక నుంచి ఐటి కార్యాలయంలో విచారణ వుంటుంది. హీరో నానిని సోమవారం రమ్మని సమన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మిగిలిన వారికి కూడా ఇదే విధంగా సమన్లు అందుతాయని తెలుస్తోంది.
హీరోలపై ఆరా
ఇదిలా వుంటే సురేష్ లో కావచ్చు, హారిక హాసినిలో కావచ్చు, నాని దగ్గర కావచ్చు, అసలు హీరో ల రెమ్యూనిరేషన్ పై కీలకంగా ఫ్రశ్నలు వినిపించినట్లు తెలుస్తోంది. తెలుగు హీరోలు భారీగా రెమ్యూనిరేషన్లు అందుకుంటున్నారని వార్తలు వున్నాయి. నాని తొమ్మిది కోట్ల వరకు తీసుకుంటున్నారని వార్తలు వున్నాయి. అలాగే అజ్ఖాతవాసికి పవన్ కు ఎంత ఇచ్చారు? అరవింద సమేతకు ఎన్టీఆర్ కు ఎంత ఇచ్చారు లాంటివి ఆరా తీసినట్లు బోగట్టా.
నానికి కలిసి వచ్చింది
సాధారణంగా సెలబ్రిటీలకు బ్లాక్ లావాదేవీలు వుంటాయి. అది కామన్. అయితే ఎవ్వరూ ఎక్కడా వుంచుకోరు. ఎప్పటికప్పుడు ఖర్చు చేసేస్తారు. ఎన్నికల సమయంలో ఓ రాజకీయ ప్రముఖుడు 26 ఎకరాలు విక్రయించినట్లు బోగట్టా. అప్పుడు నాని 13 ఎకరాలు, ఎన్టీఆర్ 13 ఎకరాలు కొనాలనుకున్నారు. ఎన్టీఆర్ ఆగిపోయారు కానీ, నాని కొనేసారు.ఎన్టీఆర్ కొనాలనుకున్న 13 ఎకరాలు నిర్మాత ప్రశాంతి తిపుర్నేని కొన్నట్లు తెలుస్తోంది.
అలాగే ఐకియా సమీపంలో కొంత వర్కింగ్ స్పేస్ పై కూడా నాని పెట్టుబడుతలు పెట్టేసినట్లు తెలుస్తోంది. అందువల్ల నాని దగ్గర అటు క్యాష్ కానీ, ఇటు బ్యాంక్ బాలన్స్ కానీ ఏమీ లేదు. పైగా ఒకటి రెండు చిన్న అప్పులు కూడా వున్నాయని తెలిసినట్లు బోగట్టా.
మొత్తం మీద ఐటి రైడ్స్ టాలీవుడ్ లో కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే ఆసియన్ సునీల్, కేఎల్ నారాయణ లాంటి పెద్ద సంస్థలపై దాడులు ముగిసాయి. ఇప్పుడు రెండో విడతగా సోదాలు జరుగుతున్నాయి. దాంతో మిగిలిన వారు ఎక్కడి లెక్కలు అక్కడ సరిచేసుకుంటున్నట్లు బోగట్టా.