మహారాష్ట్ర రాజకీయాలు చాలా నిదానంగనా మలుపులు తిరిగినప్పటికీ.. ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చాయి. మొత్తం అసెంబ్లీ సీట్లలో అయిదో వంతు కూడా సాధించడం చేతకాని మూడు పార్టీలు- ఎన్నికల తర్వాత- జట్టుకట్టి, అధికారంలోకి వస్తున్నాయి.
రాజకీయ చరిత్రలో పోటీచేసిన కూటమికి ఎన్నికల తర్వాత.. రాంరాం చెప్పేసి.. కొత్త బంధాలను సృష్టించుకుని, అధికారంలోకి రావడమే పరమావధిగా వర్తించే కొత్త పోకడలకు ఇది శ్రీకారం కావచ్చు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో బకరా అయిందెవరు? జాగ్రత్తగా పరిణామాలను గమనిస్తే.. ఆ బకరా ఆదిత్య ఠాక్రే అని అర్థమవుతుంది.
శివసేనకు చాన్సంటూ వస్తే గనుక.. ఠాక్రే కుటుంబం నుంచే సీఎం ఉంటారనేది నిస్సంశయం. కాకపోతే.. యువకుడు అయిన ఆదిత్య ఠాక్రే పేరు ఈసారి తెరమీదకు వచ్చింది. అత్యధిక సీట్లు సాధించిన భారతీయ జనతా పార్టీని.. తమకు సగం అధికారం ఇవ్వమని పట్టుబట్టిన శివసేన, ఆదిత్య ఠాక్రేను తొలి రెండున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రిని చేసి తీరాల్సిందేనని పట్టుబట్టింది. దానికి భాజపా ఒప్పుకోలేదని మనకు తెలుసు. కానీ, ఈలోగా తాను సీఎం కాగలననే ఆశ ఆదిత్య ఠాక్రేకు పుట్టింది. సీఎం కలల్లో ఊగిసలాడి ఉంటారు. భాజపాకు ఇంకో ప్రత్యామ్నాయం లేదు గనుక.. తాను చిన్న వయసులోనే సీఎం అయిపోతున్నట్లు అనుకుని ఉంటారు.
కానీ.. శివసేన చివరికి, ఎన్నికల్లో తాము ఎడాపెడా తిట్టిపోసిన కాంగ్రెస్-ఎన్సీపీ పార్టీల కాళ్లు పట్టుకోవలసి వచ్చింది. భాజపాతో పంతానికి పోయి తమ పార్టీ మూల సిద్ధాంతాలను వారు విస్మరించారు. వారికి కూడా అంతకంటె గతిలేదు గనుక.. సేనతో పొత్తు ఆత్మహత్యా సదృశం అని తెలిసినప్పటికీ ఒప్పుకున్నారు. ఈ కొత్త బంధం.. ఆదిత్య ఠాక్రే కలల్ని ఆవిరి చేసింది.
అయితే కాంగ్రెస్, ఎన్సీపీల్లో ఉద్ధండులు ఉన్నారు. చాలా సీనియర్లు ఉన్నారు. శరద్ పవార్ లాంటి మహామహులు ఆదిత్య సీఎంగా ఉండగా, ఆయన ‘కింద’ పనిచేయడం అనేది అనూహ్యమైన విషయం. అందుకే వారు గట్టిగా ఆదిత్యకు నో చెప్పారు. గతిలేక ఉద్ధవ్ ఠాక్రే పేరు సీఎంగా తెరమీదకు వచ్చింది.
ఆ ప్రతిపాదన ఉద్ధవ్ కు ఎంత ఇష్టమో తెలియదు గానీ.. కాబోయే సీఎం ఉద్ధవ్ అనే సంగతిని శరద్ పవారే స్వయంగా ప్రకటించారు. మొత్తానికి పవర్ ఆశలు పుట్టి- ఉడిగిపోవడంతో ఆదిత్య.. బకరా అయ్యారు!