అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబునాయుడు సీరియస్‌గా దృష్టి సారించారు. జనసేనతో సంబంధం లేకుండా తన వాళ్లను నిలబెట్టేందుకు చంద్రబాబునాయుడు దూకుడు ప్రదర్శిస్తున్నారు. తాజాగా ఇద్దరు ఇన్‌చార్జ్‌లను నియమిస్తూ టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఉత్తర్వులు ఇచ్చారు.
వైఎస్సార్ జిల్లా కడప ఇన్‌చార్జ్‌గా ఆర్.మాధవీరెడ్డి, అలాగే గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా రిటైర్డ్ ఐఏఎస్ బి.రామాంజనేయుల్ని నియమించడం విశేషం. చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు ఈ ఉత్తర్వులు ఇస్తున్నట్టు ఆయన వెల్లడించారు.
ముఖ్యంగా కడప ఇన్‌చార్జ్‌గా మాధవీ నియామకం చర్చనీయాంశమైంది. కడప పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి ఆర్.శ్రీనివాస్‌రెడ్డి సతీమణి మాధవీని కడప అసెంబ్లీ బరిలో నిలపాలని చంద్రబాబు నిర్ణయించుకోవడం గమనార్హం. శ్రీనివాస్‌రెడ్డి తండ్రి ఆర్.రాజగోపాల్‌రెడ్డి గతంలో మంత్రిగా పని చేశారు. వైఎస్సార్ కుటుంబానికి వ్యతిరేకంగా దివంగత రాజగోపాల్‌రెడ్డి తదితరులు కడపలో రాజకీయం నడిపారు. గతంలో కడప పార్లమెంట్ టీడీపీ అభ్యర్థిగా శ్రీనివాస్‌రెడ్డి పోటీ చేసి వైఎస్సార్ కుటుంబానికి ఎదురొడ్డారు. మరోసారి కూడా ఆయన కడప ఎంపీ అవినాష్‌రెడ్డిపై పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు.
ఈ నేపథ్యంలో తన భార్య మాధవీకి కడప అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని అధిష్టానంపై ఆయన ఒత్తిడి తెస్తున్నారు. మరోవైపు వైసీపీ మాత్రం ముస్లిం మైనార్టీకి టికెట్‌ను ఖరారు చేసింది. కడప నుంచి అంజాద్‌బాషా రెండుసార్లు గెలుపొందారు. రెండోసారి వైఎస్ జగన్ కేబినెట్‌లో డిప్యూటీ సీఎంగా చోటు దక్కించుకున్నారు. మూడోసారి కూడా ఆయనే బరిలో ఉండనున్నారు.
రానున్న ఎన్నికల్లో అంజాద్‌బాష, మాధవీరెడ్డి మధ్య గట్టి పోటీ జరిగే అవకాశం వుంది. ఇదిలా వుండగా కడప టికెట్‌ను టీడీపీ ఏకైక కార్పొరేటర్ ఉమాదేవి ఆశించారు. అయితే టీడీపీ అధిష్టానం మాత్రం మాధవీ వైపు మొగ్గు చూపడం గమనార్హం.