జ‌న‌సేన కామెడీ…భ‌లేభ‌లే!

175 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎన్ని చోట్ల నిల‌బ‌డ‌తారో చెప్పాలంటే… స‌మాధానం చెప్ప‌లేని దుస్థితి జ‌న‌సేన‌ది. కానీ ఆ పార్టీ నాయ‌కుల కామెడీ మాత్రం భ‌లేభ‌లే. రాష్ట్రంలో ఈ ద‌ఫా 4 ల‌క్ష‌ల మంది తొలిసారి…

175 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎన్ని చోట్ల నిల‌బ‌డ‌తారో చెప్పాలంటే… స‌మాధానం చెప్ప‌లేని దుస్థితి జ‌న‌సేన‌ది. కానీ ఆ పార్టీ నాయ‌కుల కామెడీ మాత్రం భ‌లేభ‌లే. రాష్ట్రంలో ఈ ద‌ఫా 4 ల‌క్ష‌ల మంది తొలిసారి ఓటు వేయ‌బోతున్నార‌ని జ‌న‌సేన చెబుతోంది. కావున వీళ్లంతా త‌మ భ‌వితను బంగారుమ‌యం చేసుకోడానికి జ‌న‌సేనకే ఓటు వేస్తార‌ని ఆ పార్టీ పీఏసీ చైర్మ‌న్ నాదెండ్ల మ‌నోహ‌ర్ చెప్పారు.

ఈ సంద‌ర్భంగా “నా మొద‌టి ఓటు జ‌న‌సేన‌కే” అనే నినాదంతో కూడిన వాల్ పోస్ట‌ర్‌ను నాదెండ్ల ఆవిష్క‌రించారు. జ‌న‌సేనకు ఓటు వేయాలంటే, ఆ పార్టీ బ‌రిలో ఉండాలి. ఆ ప‌రిస్థితి ఉందా? అంటే లేద‌ని ఆ పార్టీ నాయ‌కులే చెబుతున్నారు. అలాంట‌ప్పుడు మొద‌టి ఓటు జ‌న‌సేన‌కే అనే క్యాంపెయిన్ ఏంటో ఎవ‌రికీ అర్థం కాదు. జ‌న‌సేన ఎన్ని సీట్ల‌లో పోటీ చేస్తుంద‌నేది ప‌వ‌న్‌క‌ల్యాణ్ చేతిలో కూడా లేదు.

చంద్ర‌బాబునాయుడు ద‌య‌త‌ల‌చి ఇచ్చే సీట్ల‌లోనే జ‌న‌సేన పోటీ చేయాల్సి వుంటుంది. ఇది ప‌వ‌న్‌కు బాగా తెలుసు. వాస్త‌వం ఇదైతే మొద‌టి ఓటు జ‌న‌సేన‌కే అని వాల్ పోస్ట‌ర్‌, దానికో ప్ర‌చారం చేసుకోవ‌డం అంటే కామెడీ కాక మ‌రేంట‌నే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మైంది. తొలి ఓటు జ‌న‌సేన‌కే అనే ప్ర‌చారం కంటే, అన్ని చోట్ల పోటీ చేస్తామ‌ని ప్ర‌క‌టిస్తే కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల్లో భ‌రోసా నింపిన‌ట్టు అవుతుంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

జ‌న‌సేన‌కే తొలిఓటు లాంటి ప్ర‌చారం త‌మ‌ను తాము వంచించుకోవ‌డ‌మే అవుతుంద‌నే విమ‌ర్శ . ముందుగా ప‌వ‌న్‌క‌ల్యాణ్ త‌న పార్టీకి ఓటు వేసే ప‌రిస్థితి ఉందా? అని ఆలోచించుకోవాలి. ఎందుకంటే పొత్తు కోపం ప‌వ‌న్ ప‌రిత‌పిస్తున్నారు. దీంతో ప‌వ‌న్‌కు ఓటు వున్న చోట జ‌న‌సేన బ‌రిలో వుంటుందా? అనేది ప్ర‌శ్న‌. జన‌సేన సినిమాను త‌ల‌పించే రాజ‌కీయాల‌కు స్వ‌స్తి చెప్పి, కాస్త భూమిపై నిలిచి వాస్త‌వాల‌కు అనుగుణంగా న‌డుచుకోవాల్సి వుంటుంది.