చంద్రబాబు పర్యటన వ్యూహాత్మకంగా సాగుతోంది. చంద్రబాబు పర్యటించే నియోజకవర్గాల్లో ఇన్‌చార్జ్‌లకు టికెట్ ఖారారైనట్టే అని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతానికి అన్ని నియోజకవర్గాలకు చంద్రబాబు వెళ్లలేని పరిస్థితి. కానీ ఫలానా వాళ్లకు టికెట్ ఇవ్వాలని గట్టిగా నిర్ణయించుకున్న నియోజకవర్గాలనే ఎంచుకుని మరీ పర్యటిస్తున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్న మాట. బాబు పర్యటిస్తున్న నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లకు టికెట్ ఖరారైనట్టుగా ఆయన రాక సంకేతాలు ఇస్తోందని సమాచారం. ఈ నేపథ్యంలో ఉమ్మడి అనంతపురం జిల్లా రాయదుర్గంలో కాల్వ శ్రీనివాసుల్ని గెలిపించాలని చంద్రబాబు పిలుపునివ్వడం గమనార్హం. ఇక్కడ మరో అభ్యర్థి మాటే లేదని ఆయన స్పష్టం చేశారు.
తాజాగా డోన్‌లో ధర్మవరం సుబ్బారెడ్డిని గెలిపించాలని చంద్రబాబు మరోసారి ప్రజానీకానికి పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లా నుంచి ఉమ్మడి కర్నూలు జిల్లా ప్యాపిలిలో ఆయన గురువారం రాత్రి అడుగు పెట్టారు. ఈ సందర్భంగా తనకు స్వాగతం పలకడానికి వచ్చిన టీడీపీ శ్రేణులను ఆయన పలకరించారు. సుబ్బారెడ్డిని గెలిపించాలని అభ్యర్థించారు. అనంతరం ఆయన బనగానపల్లెకు చేరుకున్నారు. బనగానపల్లెలో బీసీ జనార్ధన్‌రెడ్డికి తిరుగే లేదు.
ఇవాళ రాత్రికి నంద్యాల బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొననున్నారు. ఇక్కడ కూడా టీడీపీ ఇన్‌చార్జ్ భూమా బ్రహ్మానందరెడ్డికి టికెట్ డోకా లేదు. బహిరంగ సభలో భూమా బ్రహ్మానందరెడ్డిని గెలిపించాలని పిలుపు ఇచ్చే అవకాశం వుంది. ఇటీవల నంద్యాల నియోజకవర్గ నాయకుల సమావేశంలో పరోక్షంగా బ్రహ్మానందరెడ్డే అభ్యర్థి అని చంద్రబాబు సంకేతాలు ఇచ్చారు. దీంతో ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడానికి పెద్ద ఇబ్బంది లేకపోవచ్చు.
ఆళ్లగడ్డపై చంద్రబాబు గుర్రుగా ఉన్నారు. అసలు అటు వైపు వెళ్లడానికి కూడా ఆయన ఇష్టపడడం లేదు. ఆ నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జ్‌పై సదభిప్రాయం లేకపోవడం వల్లే అటు వైపు కన్నెత్తి చూడడానికి చంద్రబాబు ఇష్టపడడం లేదని నంద్యాల జిల్లా టీడీపీ ముఖ్య నాయకుడొకరు అన్నారు. గతంలో కూడా టీడీపీ బస్సుయాత్ర ఆళ్లగడ్డకు వెళ్లని విషయాన్ని గుర్తు చేశారు.