కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే బాధ్యతను పూర్తిగా తన భుజాల మీదికే తీసుకున్నారు. నిజం చెప్పాలంటే ఇలాంటి నిర్ణయం జరిగి కూడా దాదాపు ఏడాది కావస్తోంది.
తెలంగాణలో పార్టీ గతంలో కంటె కాస్త బలం పుంజుకున్నట్టుగా కనిపిస్తున్న నేపథ్యంలో అమిత్ షా ఈ రాష్ట్రంపై మరింతగా దృష్టి కేంద్రీకరిస్తారని, పార్టీని గెలుపు బాటలో నడిపిస్తారని, తద్వారా దక్షిణాదిలో అదికారంలోకి రాగల స్థాయి ఉన్న రెండు రాష్ట్రంగా తెలంగాణను మార్చుకుంటారని ప్రచారం జరిగింది. కానీ ఆచరణలో ఆయన ఫోకస్ అంతగా ఉండడం లేదు. పైగా తెలంగాణ రాజకీయాల్లో ఆయన ముద్ర చూపించాలనుకుంటున్న తీరు.. అనుకున్నట్టు సాగడం లేదు.
రాష్ట్రంలో బలపడుతున్న కాంగ్రెస్ ఎదుట, పోల్చిచూసినప్పుడు అమిత్ షాకు పరాభవాలే ఎదురవుతున్నాయని ఒక విశ్లేషణ. ఈ నేపథ్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం గా నిర్వహించుకునే సెప్టెంబరు 17న అమిత్ షాకు మరో భంగపాటు, తెలంగాణ భాజపా బలహీనత బయటపడే మరో సందర్భం పొంచి ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
సెప్టెంబరు 17వ తేదీని తమ తమ పార్టీలకు అనుకూలంగా రాజకీయంగా వాడుకోవడానికి తెలంగాణలో ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తుంటారు. ఆరోజు భారత యూనియన్ లో తెలంగాణ విలీనం అయిన రోజు కావడమే కారణం. ఈసారి ఎన్నికలు కూడా ఉండడంతో.. కాంగ్రెస్, భాజపా పార్టీలు రెండూ అదే రోజున నగరంలో భారీ బహిరంగ సభలు నిర్వహించడానికి ప్లాన్ చేశాయి.
తుక్కుగూడలో కాంగ్రెస్ నిర్వహించే సభకు అధినేత్రి సోనియాగాంధీ హాజరవుతోంటే.. పెరేడ్ గ్రౌండ్స్ లో భాజపా నిర్వహించే సభకు ఏకంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా వస్తున్నారు. ఒకే రోజున ఒకే నగరంలో రెండు పార్టీల సభలు జరిగితే.. ప్రజలు ఖచ్చితంగా ఏ సభకు ఎందరు ప్రజలు హాజరయ్యారనే సంగతి గమనిస్తారు. అదే జరిగితే.. అమిత్ షా సభ తేలిపోతుందేమో అనే అభిప్రాయం పలువురికి కలుగుతోంది.
ఖమ్మంలో కూడా ఇదే అనుభవం వారికి ఎదురైంది. ఖమ్మంలో అమిత్ షా అనుకున్న బహిరంగ సభ రెండుసార్లు వాయిదా పడింది. ఈలోగా అక్కడ రాహుల్ భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఆ పిమ్మట అమిత్ షా కూడా సభ పెట్టారు గానీ.. రాహుల్ సభతో పోలిస్తే షా సభకు జనసమీకరణ తేలిపోయింది. అయితే కమలదళం చెబుతున్న మాట ఏంటంటే.. ఖమ్మంలో జిల్లాలో తమ పార్టీ బలానికి, రాజధానిలో తమ బలానికి చాలా తేడా ఉంటుందని అంటున్నారు. వారు ఎంతగా చెప్పుకున్నప్పటికీ.. సోనియా సభను తలదన్నే రీతిలో వారి సభ సాధ్యమవుతుందా? అనేది సందేహం.
కాంగ్రెసు పార్టీ తమ బహిరంగ సభకు పదిలక్షల మంది జనసమీకరణ లక్ష్యం అని చెప్పుకుంటోంది. రాజకీయ సభలకు ఇది చాలా పెద్ద టార్గెట్. భాజపా అంతటి టార్గెట్ నైనా ప్రకటించగలదా అనేదే సందేహం. అమిత్ షా సభ జనసమీకరణలే పేలవంగా తేలితే.. ఆయన ఎంతగా నిప్పులు కురిపించినా.. పెద్ద లాభముండదు.