ఒకవైపేమో లోకేష్ కు చెప్పుకోవడానికి నియోజకవర్గం లేదు. మంగళగిరి నుంచి వచ్చే సారి పోటీ అంటూ ఒక మాట అన్నారు కానీ… అది ఏ మేరకు జరుగుతుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి. కట్ చేస్తే.. చంద్రబాబు సీటు కిందకూ నీళ్లు వచ్చాయి.
కుప్పం నుంచి వచ్చేసారి ధైర్యంగా నామినేషన్ వేసే పరిస్థితి ఉంటుందా? అనేది డౌట్ గా మారిందప్పుడు. కనీసం కుప్పం మున్సిపాలిటీ ఫలితం తర్వాత.. చంద్రబాబు నాయుడు వచ్చేసారి కూడా కుప్పం నుంచి పోటీ చేయబోతున్నట్టుగా ఒక ప్రకటన చేసి ఉంటే, ఈ ఓటమిని తక్కువ చేసిన ధీమా అయినా వ్యక్తం అయ్యేది!
మున్సిపల్ ఎన్నికలు కాబట్టి కుప్పంలో తాము ఓడినట్టుగా, అదే చంద్రబాబు బరిలోకి దిగితే ప్రత్యర్థులకు ఇక్కట్లే అని టీడీపీ చాటడానికి ఫలితాల వెల్లడి రోజే, ఏదేమైనా కుప్పం నుంచి వచ్చేసారి చంద్రబాబు పోటీ అంటూ చంద్రబాబో, లోకేషో ఒక ప్రకటన చేసి ఉంటే.. అదో లెక్క. అయితే టీడీపీ అధినాయకత్వానికి ఇప్పుడు అంత ధీమా లేదని స్పష్టం అవుతోంది.
మరి ఈ పరిణామాలు అటు ఇటు తిరిగి నందమూరి నటసింహం బాలకృష్ణ సీటుకు ఎర్త్ పెడతాయా? అనేది ఆసక్తిదాయకమైన ఊహాగానంగా నిలుస్తోంది. గత ఎన్నికల్లో టీడీపీ రాష్ట్రమంతా చిత్తు అయినా.. హిందూపురంలో బాలకృష్ణ ఎమ్మెల్యేగా నెగ్గారు. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని లుకలుకల వల్ల బాలకృష్ణ విజయం సులువు అయ్యిందనేది వేరే కథ. అయితే కుప్పం, మంగళగిరి పరిస్థితులతో పోలిస్తే.. ఇప్పుడు హిందూపురం టీడీపీకి ఆశలు కల్పిస్తోంది!
లోకేషో, చంద్రబాబో హిందూపురానికి వెళ్లి పోటీ చేస్తే.. అక్కడ టీడీపీ పరిస్థితి ఏమిటనేది వేరే కథ. అయితే చంద్రబాబుకు, లోకేష్ కూ ఇద్దరికీ ఇప్పుడు కాస్త భరోసాను ఇచ్చే నియోజకవర్గం కావాలి. అది హిందూపురమే అయినా పెద్ద ఆశ్చర్యం లేదు. మరి బాలకృష్ణ హిందూపురాన్ని ఖాళీ చేయనంటాడా? అనగలడా? అల్లుడి కోసమైనా, బావ కోసం అయినా.. బాలకృష్ణకు హిందూపురాన్ని త్యాగం చేయాల్సిన తప్పనిసరి పరిస్థితి తలెత్తినా పెద్ద ఆశ్చర్యం లేదు.
పార్టీ అధికారంలోకి వస్తే.. ఏ రాజ్యసభ సభ్యత్వమో అని బాలయ్యను సైడ్ చేసినా చేయగలరు చంద్రబాబు, లోకేష్ లు. అంతకు మించి బాలకృష్ణకు కూడా వేరే ఛాయిస్ లేకపోవచ్చు!