తెలంగాణలో ప్రస్తుత రాజకీయ వాతావరణాన్ని ఉన్నదున్నట్టుగా పరిశీలిస్తే.. అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితికి ప్రత్యామ్నాయం కాగల దూకుడు, బలం కాంగ్రెస్ వద్ద మాత్రమే ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది.
‘ప్రత్యామ్నాయం’ అనే ఇదే మాటను భారతీయ జనతా పార్టీ చాలా కాలంగా వాడుతున్నది గానీ.. ఆచరణలో నిరూపించుకోవడం లేదు. అయినా సరే.. టికెట్లు- ఆశావహులు విషయానికి వచ్చేసరికి.. కాంగ్రెసు పార్టీ కంటె కమలదళంలోనే ఆశావహులు ఎక్కువ మంది కనిపిస్తున్నారు.
ఎమ్మెల్యే ఆశావహుల నుంచి ఆ పార్టీ దరఖాస్తులు స్వీకరించడం ప్రారంభించిన తొలి నాలుగు రోజుల్లోనే ఏకంగా 999 మంది దరఖాస్తులు ఇచ్చారంటే.. ఈ పరిస్థితి మనకు అర్థం అవుతుంది.
నిజానికి మరో మూడు రోజుల పాటూ భాజపా దరఖాస్తులు స్వీకరిస్తుంటుంది. శని, ఆదివారాల్లో అప్లయి చేసుకునే ఆశావహుల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంటుందని కూడా పార్టీ అంచనా వేస్తోంది. ఈ లెక్కన.. భారతీయ జనతా పార్టీ టికెట్ల కోసం దరఖాస్తు చేసుకునే మొత్తం ఆశావహుల సంఖ్య 1500 దాటిపోయినా ఆశ్చర్యం లేదు. కాంగ్రెసు టికెట్లకోసం దరఖాస్తు చేసిన వారి సంఖ్య 1100 మాత్రమే. టికెట్లు ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉన్నది గనుక.. కాంగ్రెసు కంటె భాజపాను బలమైన పార్టీగా భావించడానికి ఎంతమాత్రం అవకాశం లేదు.
ఎందుకంటే.. భారతీయ జనతాపార్టీలో బలం లేని తాలు సరుకు కూడా ఎమ్మెల్యే టికెట్ కోసం అప్లయి చేసేసుకుంటున్నారనే ప్రచారం పార్టీ వర్గాల్లో జరుగుతోంది. పార్టీ నాయకులు కూడా.. చిన్నా పెద్దా తేడా లేకుండా.. ఎవ్వరైనా సరే దరఖాస్తు చేసుకోవచ్చునని అన్నారు. దీంతో.. ఊరూ పేరూ లేని వారు కూడా.. అప్లయి చేస్తేపోయేదేముంది.. అనే ఉద్దేశంతో ఓ దరఖాస్తు పడేస్తున్నట్టు సమాచారం. దాంతో లెక్కకు మిక్కిలిగా వచ్చి పడుతున్నాయి. నిజం చెప్పాలంటే.. ఈ తాలు సరకు దరఖాస్తులను వడపోయడం, నిజంగా గట్టి అభ్యర్థులు ఎవరో నిగ్గు తేల్చడం పార్టీ వర్గాలకు కష్టం అయ్యేలా ఉంది.
పార్టీ నాయకత్వం ఎవ్వరు పడితే వారు దరఖాస్తు చేసుకోవచ్చునని పిలుపు ఇవ్వడానికి కూడా కారణముంది. సగానికిపైగా స్థానాలలో వారికి అబ్యర్థులే లేరు. దాంతో ఎవరో ఒకరు దరఖాస్తు వేస్తారని ఇలా ప్రకటించారు. ఆ దెబ్బకి.. అప్లయి చేస్తే.. తాము కూడా ఎమ్మెల్యే టికెట్ ఆశించే స్థాయినాయకుడిగా ఒక ముద్ర పడుతుందని అనుకుంటున్నవారే ఎక్కువ.
కాంగ్రెసు పార్టీలో దరఖాస్తు చేయడానికి రెండు లక్షల రూపాయల ఫీజు పెట్టారు. బిజెపిలో అలాంటి భారం లేదు కాబట్టి కూడా.. దారినపోయే వాళ్లు కూడా ఆఫీసులోకి వచ్చి ఓ దరఖాస్తు ఇచ్చేసి వెళుతున్నట్టు పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా.. 2018 ఎన్నికల నాటికి భాజపా తరఫున గెలిచిన ఏకైక నాయకుడు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మీద పార్టీ ఇంకా సస్పెన్షన్ ను మాత్రం ఎత్తేయలేదు.