తెలుగుదేశంతో జనసేన పొత్తుల అడుగులు నెమ్మది నెమ్మదిగా ముందుకు పడుతున్నాయి. చంద్రబాబునాయుడు పల్లకీ మోయడానికి పవన్ కల్యాణ్ తొలినుంచి ఉత్సాహంగా ఉన్న సంగతి తెలిసిందే. అలాగే బిజెపిని కూడా పల్లకీబోయీగా మార్చడానికి ఆయన తన వంతు కష్టం పడుతూనే ఉన్నారు.
బిజెపి నే చంద్రబాబు అంటే ఉండే వ్యతిరేకత కొద్దీ ఇంకా ఏ సంగతీ తేల్చడం లేదు. అయితే.. జనసేన మాత్రం తెదేపాతో బంధం కోసం పూర్తి స్థాయిలో సిద్ధం అవుతున్నట్టుగా కనిపిస్తోంది. ఆ పార్టీలో నెంబర్ టూ నాదెండ్ల మనోహర్ కూడా ఇప్పుడు నారా లోకేష్ భజన చేయడం గమనిస్తోంటే.. ఇలాగే అనిపిస్తోంది.
నారా లోకేష్ పాదయాత్రలు వైసీపీ మూకలు అల్లరి చేస్తున్నయని, పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్ ను, తెలుగుదేశం వాలంటీర్లను రెచ్చగొట్టడంతో పాటు వారిమీద దాడులకు తెగబడుతున్నారని నాదెండ్ల మనోహర్ ఆరోపిస్తున్నారు. నారా లోకేష్ యాత్రకు సంబంధించి పోలీసులు సహకరించడం లేదని, వైసీపీపై చర్యలు తీసుకోవడానికి వారికి ధైర్యం లేదని విమర్శిస్తున్నారు. ఈ అన్ని కారణాల వల్ల జగన్ ను ఇంకి ఓడించి పంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన అంటున్నారు.
నాదెండ్ల మనోహర్ సాధారణంగా.. తమ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ను భజన చేయడానికి తప్ప.. మరొక పని పనికి ఎగబడరు. అలాంటిది ఇప్పుడు నారా లోకేష్ భజనకు, ఆయన మద్దతుగా వైసీపీ ని నిందించడానికి ప్రయత్నించడం చూస్తోంటే.. ఆ రెండుపార్టీల పొత్తు అడుగులు పడుతున్నట్టుగా కనిపిస్తోంది. చంద్రబాబునాయుడు పల్లకీ మోయడానికి పవన్ కల్యాణ్ ఆల్రెడీ అత్యుత్సాహంగా ఉన్న నేపథ్యంలో.. చినబాబు నారా లోకేష్ పల్లకీ మోయడానికి ఆయన తన నెంబర్ టూ నాదెండ్ల మనోహర్ ను కూడా సిద్ధం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.
నాదెండ్ల వారి లోకేష్ భజన వెనుక ఒక రహస్యం ఉన్నదని కూడా ప్రజలు అంటున్నారు. తెనాలి సీటునుంచి నాదెండ్ల జనసేన తరఫున పోటీచేయాలని అనుకుంటున్నారు. అయితే అక్కడ తెలుగుదేశానికి ఆలపాటి రాజా రూపంలో బలమైన అభ్యర్థి ఉన్నారు. పొత్తుల్లో ఆ సీటును జనసేన దక్కించుకోవడం అంత ఈజీ కాదు. ఆ నియోజకవర్గం తప్ప మరొక చోటనుంచి పోటీచేయగల సీన్ నాదెండ్లకు లేదు.
ఈ నేపథ్యంలో.. ఆ సీటు దక్కాలంటే తండ్రీ కొడుకులు ఇద్దరి భజన తప్పదని, అందుకే లోకేష్ కు మద్దతుగా నాదెండ్ల రెచ్చిపోతున్నారని ప్రజలు అనుకుంటున్నారు.