Advertisement

Advertisement


Home > Movies - Reviews

Jawan Movie Review: మూవీ రివ్యూ: జవాన్

Jawan Movie Review: మూవీ రివ్యూ: జవాన్

చిత్రం: జవాన్
రేటింగ్: 2.75/5
తారాగణం:
షారుఖ్ ఖాన్, నయనతార, దీపిక పడుకోన్, ప్రియమణి, విజయ్ సేతుపతి, శాన్య మళోత్రా తదితరులు
ఎడిటింగ్: రూబెన్
కెమెరా: జికె విష్ణు
సంగీతం: అనిరుధ్ రవిచందర్ 
నిర్మాత: గౌరీ ఖాన్ 
దర్శక్వత్వం: అట్లీ 
విడుదల తేదీ: 7 సెప్టెంబర్ 2023 

గతంలో కొన్నాళ్లు వరుసగా పరాజయాలు చవిచూసిన షారుఖ్ ఖాన్ "పఠాన్" తో విజయకేతనం ఎగరేసాడు. అందులో తనకు జోడీ దీపికా పడుకోన్. ఇప్పుడు మళ్లీ అదే హీరోయిన్ తో పాటూ నయనతారను కూడా కలుపుకుని ఈ "జవాన్" తో పలకరించాడు. ఒక్క షారుఖ్ ఖాన్ తప్ప ఇద్దరు హీరోయిన్స్, ముఖ్యపాత్రలో ప్రియమణి, ప్రతినాయకుడిగా విజయ్ సేతుపతి, దర్శకుడు అట్లీ, సంగీత దర్శకుడు అనిరుధ్..ఇలా అందరూ సౌత్ ఇండియన్సే. 

విషయంలోకి వెళ్తే...కొంతమంది అమ్మాయిలతో కలిసి ఒకతను ముంబాయి మెట్రో ట్రైన్ ఎక్కుతాడు. అదే రైల్లో ప్రయాణిస్తున్న ఒకమ్మాయిని విడిచిపెట్టడానికి ఏకంగా రూ 40 వేల కోట్లు అడుగుతాడు ఆమె తండ్రి కాళీ గైక్వాడ్ (విజయ్ సేతుపతి) ని. ఆ డబ్బు అందిన వెంటనే ఆ పిల్లని వదిలేస్తాడు. పోలీసుల్ని, నర్మదా రాయ్ (నయనతార) అండ్ టీం యొక్క కంబాట్ ఫోర్స్ ని కళ్లుగప్పి తన టీం తో సహా తప్పించుకుంటాడు. అంతే కాకుండా ఆ డబ్బుని వెంటనే లక్షలాది రైతుల ఎకౌంట్లకి ట్రాన్స్ఫర్ చేసి హీరో అయిపోతాడు. ఇంతకీ అతను ఒక మహిళా కారాగారానికి జైలర్. పేరు ఆజాద్ (షారుఖ్). అతను విక్రం రాథొడ్ అనే ఆర్మీ జవాన్ కొడుకు. తండ్రి తన చిన్నప్పుడే మరణించాడని అనుకుంటాడు ఆజాద్. ఇంతకీ ఈ అజాద్ ఎవరు? తనతో పాటు ఉన్న ఆ అమ్మాయిలెవరు? విక్రం రాథోడ్ గతమేమిటి? దీపికా పడుకోన్ పాత్ర ఏమిటి? ఇవన్నీ ఆసక్తికరంగా రివీల్ అవుతూ కథ నడుస్తుంది. 

ఈ మధ్యకాలంలో కథ, కథనాలు, లాజిక్కులు, ఔచిత్యాలకంటే ఎంత గ్రాండ్ గా యాక్షన్ సీక్వెన్సులు తీసారు, ఎంత ఘనంగా హీరోకి బిల్డప్పులిచ్చారు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఏ లెవెల్లో ఉంది అన్నదానిపై ఈ తరహా సినిమాల్ని టార్గెట్ ఆడియన్స్ హిట్ చేస్తున్నారు. "పఠాన్" కూడా ఆ రకంగా హిట్టైన చిత్రమే. 

ఇంతకీ ఈ జవాన్ మొదలవడమే ఒక హై ఇంటెన్స్ యాక్షన్ ఎపిసోడ్ తో మొదలవుతుంది. ఆ యుద్ధం ముగిసిన వెంటనే షారుఖ్ ఖాన్ డైలాగ్ "నేను ఎవర్ని?"- ఇది అచ్చం "బాహుబలి"ని గుర్తు చేస్తుంది. 

ఇక కథలోకి వెళ్లే కొద్దీ కమల్ హాసన్ "భారతీయుడు" ఛాయలు కనిపిస్తాయి. 

లాజిక్కుకి అందని యాక్షన్ ఎపిసోడ్స్ వగైరాలు, కొన్ని సీన్స్ లో షారుఖ్ చుట్ట తాగే విధానం రజినీకాంత్ ని గుర్తు చేస్తాయి. 

అలాగే షారుఖ్ ఖాన్ తన పేరుని విక్రం రాథోడ్ అని చెప్పినప్పుడు రవితేజ "విక్రమారుకుడు" గుర్తొస్తుంది. 

ఒక్కోసారి చిరంజీవి "టాగోర్", శంకర్ "జెంటిల్మేన్" కూడా అలా పలకరించి వెళ్లినట్టు అనిపిస్తుంది. 

ఇలా ఆద్యంతం ఏదో ఒక సినిమా అలా డెజావూలాగ గుర్తొస్తొస్తూ ఉంటుంది. 

ఇవే కాదు, ఆఖరికి "మనీ హీస్ట్", "స్క్విడ్ గేం" లాంటి వెబ్ సిరీస్ కూడా కొన్ని కారణాల వల్ల గుర్తొస్తూ ఉంటాయి. 

అయినప్పటికీ తీసిన విధానం వల్ల, తెర మీద ఉన్న భారీతనం వల్ల, నరాల్ని మీటే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వల్ల కథలో కొత్తదనం లేదని కంప్లైంట్ చేయబుద్ధి కాదు. 

ఇవన్నీ ఒకెత్తైతే అరవసినిమాల్లో కనిపించే "అతి" కూడా కావాల్సినంత ఉంది ఇందులో. 

జైల్లో ఆడఖైదీకి సీమంతం చేయడం, ట్రైన్లో హైజాకర్ ఒక ప్రయాణీకురాల్ని షూట్ చేసి చంపిన దృశ్యాన్ని లైవ్ లో చూస్తూ రైల్వే శాఖ సిబ్బందంతా నార్త్ కొరియా ప్రజల లెవెల్లో డ్రమటిక్ గా ఏడవడం, జైల్లో ఆడ ఖైదీలతో మన హీరో స్టెప్పులేస్తూ మాస్ డ్యాన్స్ చేయడం..లాంటి "అతిసయోక్తి అలంకారాలు" దర్శనమిస్తాయి. 

సాంబారు తినేటప్పుడు కరివేపాకు అడ్డొస్తోందని కంప్లైంట్ చేయకూడదు. నచ్చకపోతే వాటిని ఏరి పక్కన పెట్టి తినడమే. ఈ సినిమా చూడ్డం కూడా అలాంటిదే మరి. మొత్తం సాంబారే. 

సౌత్ ఆడియన్స్ కి ఇవన్నీ గుర్తొచ్చినా నార్త్ ఆడియన్స్ కి షారుఖ్ ని ఇలాంటి పాత్రలో ఈ టైప్ మేకింగులో చూడడం కొత్తగా అనిపిస్తుంది. ఇది పూర్తి స్థాయి సౌత్ ఇండియన్ మాస్ మాసలా యాక్షన్ చిత్రం అంతే. 

బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నా పాటలు వీక్ గా ఉన్నాయి. అవి కూడా బాగుండి ఉంటే అప్పట్లో షారుఖ్ ఖాన్ చేసిన "చెన్నై ఎక్స్ప్రెస్", ఈ మధ్యన వచ్చిన "పఠాన్" ఆల్బంస్ స్థాయిలో నిలబడేది ఆడియో. 

సినిమా చూసాక చాల ఇంపాక్ట్ తో గుర్తుండే వాటిల్లో మెట్రో ట్రైన్ హైజాక్ సీన్ ఒకటి. చాలా ఇల్లాజికల్ గా నడుస్తోంది అనుకుంటుండగా ఒక ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్ చెప్పి లాజికల్ గా కన్విన్స్ చేసే ప్రయత్నం జరిగింది. 

రూ 40000 కోట్లు ఒక్క క్లిక్కులో అడిగిన అకౌంటులోకి ట్రాన్స్ఫర్ చేయగలిగే అపర కుబేరుడి కూతురు మెట్రో ట్రైన్లో ఎందుకు ప్రయాణం చేస్తుందని అడక్కూడదు. అలాంటి ప్రశ్నలకి ఈ చిత్రంలో తావు లేదు. 

అలాగే ఇండియన్ ఆర్మీ జవాన్లకి ఒక ప్రైవేట్ వెపన్ డీలర్ ఆయుధాలు సప్లై చేస్తాడా లాంటి డౌట్లు కూడా వస్తుంటాయి. అవన్నీ పక్కన పెట్టి పాత్రలు, వాళ్ల ఉద్దేశాలు, రివెంజులు, ఎమోషన్స్ వీటితోనే ప్రయాణం చెయ్యాలి. అలా చూస్తేనే ఈ చిత్రం మింగుడుపడుతుంది. 

షారుఖ్ ఖన్ భిన్నమైన గెటప్స్ లో కనిపించి కనువిందు చేసాడు. తన స్టార్డమ్ముకు తగ్గట్టుగా రక్తి కట్టించాడు. 

దీపికా పడుకోన్ సెకండాఫులో వస్తుంది. ఆమె ఉన్న కాసేపు ఒక మెరుపులా మెరిసింది. అందం, యాక్షన్, సెంటిమెంట్, లవ్...ఇలా పలురకాల ఎమోషన్స్ ని పండించే వీలు చిక్కింది ఆమెకి. 

నయనతార పోలీసాఫీసర్ గా పర్ఫెక్ట్ గా ఒదిగిపోయింది. ప్రియమణి ఒక మహిళా ఖైదీ. ఆమెది కూడా యాక్షన్ రోలే. 

ఒకరకంగా ఇది "మహిళాశక్తి"ని చాటుకునే సినిమాగా చెప్పుకోవచ్చు. ఇందులో ఆడపాత్రలన్నీ ఎంత సెంటిమెంట్ పండిస్తాయో అంత ఈజీగా కరాటే స్టంట్లు చేసి ప్రాణాలు కూడా తీసేస్తాయి. 

ఇక విజయ్ సేతుపతిది చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్. విజయ్ మాల్యా గెటప్ ని పోలిన మేకప్ వేసారు. డెంజరస్ గా కనిపిస్తూనే సటిల్ హ్యూమర్ తో కూడిన డైలాగ్స్ కూడా చెప్పాడు. 

చివర్లో సంజయ్ దత్ కనిపించడం మరొక ఆసక్తికరమైన విషయం. పెద్దగా ఇంపాక్ట్ ఉన్న పాత్ర కాకపోయినా చిన్న రిలీఫ్ కి ఉపయోగపడిన క్యారెక్టర్ అది. 

షారుఖ్ తన స్వీయ నిర్మాణంలో ప్రొడక్షన్ వేల్యూస్ మాత్రం చాలా నిండుగా ఉన్నాయి. జికె విష్ణు కెమెరా పనితీరు కూడా హై లెవెల్లో ఉంది. ఎక్కడా ల్యాగ్ లేకుండా స్పీడ్ గా నడిచే స్క్రీన్ ప్లే వల్ల చివరిదాకా ఎంగేజ్ చేయగలిగింది ఈ చిత్రం. 

ఇది మాస్ యాక్షన్ సినిమాలు ఇష్టపడే యువ ప్రేక్షకులకి పైసావసూల్ చిత్రం. మరీ సెన్స్, సిన్సిబిలిటీ లెక్కేసుకుంటూ చూసే ఆడియన్స్ కి మాత్రం ఈ యాక్షన్ సీన్స్ అన్నీ సర్కస్ లా అనిపించవచ్చు. ఇక్కడ అట్లీ చేసిన పనేంటంటే, ఏదో ఒక పాయింట్ పట్టుకుని పూర్తిగా యాక్షన్ ట్రాక్ మీదే నడపకుండా, ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తూ ప్రెడిక్ట్ చేయడానికి వీల్లేకుండా నడిపాడు స్క్రీన్ ప్లేని. 

బాటం లైన్: మాస్ మసాలా

వలయంలో జగన్

నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా