ఏటీఎం నుంచి ఎలా డబ్బులు దొంగిలిస్తారు. ఇన్నాళ్లూ మనకు తెలిసినవి కొన్ని మాత్రమే. కొందరు నకిలీ డెబిట్ కార్డులతో డబ్బులు కాజేస్తే, మరికొందరు ఏకంగా ఏటీఏం మెషీన్ ను దోచుకెళ్తారు. ఇంకొందరు పిన్ నంబర్ దొంగిలించడం, మరికొందరు డబ్బులొచ్చే చోట రహస్యంగా మరో డబ్బా ఏర్పాటుచేయడం లాంటివి చేస్తుంటారు.
అయితే ఇప్పుడు వీటికి మించిన హైటెక్ ఏటీఎం దొంగతనం ఒకటి వెలుగులోకి వచ్చింది. కొందరు కేటుగాళ్లు ఏటీఎం నుంచి డబ్బు దొంగిలించే విధానం చూసి ఏకంగా పోలీసులే షాక్ అవుతున్నారు. మనసులో వాళ్ల చోరకళను మెచ్చుకుంటూ, చేతులకు బేడీలు వేస్తున్నారు.
ఇంతకీ ఏం జరిగింది..?
సాధారణ వినియోగదారుల్లానే ఈ కేటుగాళ్లు కూడా ఏటీఏంలోకి వెళ్తున్నారు. అందర్లానే డబ్బులు డ్రా చేస్తున్నారు. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. వీళ్ల చేతికి డబ్బు వస్తోంది కానీ వాళ్ల ఎకౌంట్ల నుంచి మాత్రం డబ్బులు కట్ అవ్వడం లేదు. అదే మేజిక్.
ఇలా లక్ష, 2 లక్షలు కాదు.. ఏకంగా కోట్ల రూపాయలు కొల్లగొట్టింది ఈ గ్యాంగ్. తెలంగాణ, ఏపీతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి ఇలా డబ్బు మాయమైంది. మరీ ముఖ్యంగా భద్రాద్రిలోని అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ ఏటీఏంలో భారీగా డబ్బు పోయింది. దాదాపు వంద మంది వరకు గ్యాంగ్ ఈ పని చేస్తోంది. వీళ్ల చేతుల్లో సుమారు 75 ఏటీఎం కార్డులున్నాయి.
ఇది ఎలా జరిగింది..?
ఇంతకీ వీళ్లు ఎలా ఏటీఎంలు కొల్లగొడుతున్నారనేదే మీ అనుమానం కదా. ఎవ్వరికీ అనుమానం రాకుండా, నీట్ గా ముస్తాబై ఇద్దరు ఏటీఎంలోకి వెళ్తారు. వీళ్లలో ఒకడు ఏటీఎంలో కార్డు పెడతాడు. లావాదేవీ చేస్తాడు. మరొకడు ఏటీఎంకు విద్యుత్ సరఫరా అయ్యే ప్రాంతంలో కట్టర్ తో సిద్ధంగా ఉంటాడు.
ఎప్పుడైతే ఏటీఎం మెషీన్ నుంచి డబ్బులు బయటకొస్తాయో, సరిగ్గా టైమ్ చూసి ఈ రెండో వ్యక్తి ఏటీఎంకు పవర్ కట్ చేస్తాడు. ఇలా చేయడం వల్ల మెషీన్ నుంచి డబ్బులు బయటకొస్తాయి కానీ, సదరు వ్యక్తి ఎకౌంట్ నుంచి మాత్రం ఆ డబ్బులు కట్ అవ్వవంట. ఈ విషయం తెలుసుకొని స్వయంగా పోలీసులే నిర్ఘాంతపోయారు.
ఎలా దొరికారు..?
ఈ పని చేస్తోంది రాజస్థాన్ కు చెందిన ముఠాగా గుర్తించారు. భరత్ పూర్, ఆల్వార్ ప్రాంతాలకు చెందిన వ్యక్తులు.. ఏటీఎం కార్డులు తీసుకొని, 10 రోజులకు ఒకసారి ఇలా ఒక్కో రాష్ట్రం వెళ్తున్నారు. వీళ్ల చోరీ మొత్తం విమాన ప్రయాణాలే చేస్తారు. ఎంచక్కా విమానాల్లో వెళ్లి, తిరిగి విమానాల్లోనే ఇళ్లకు చేరుకుంటారు. దొంగిలించిన సొమ్మును సమానంగా పంచుకుంటారు.
అయితే పలు రాష్ట్రాల్లో దొంగతనాలు చేసిన ఈ ముఠా చివరికి తమ రాష్ట్రంలోనే పోలీసులకు దొరికిపోయింది. వీళ్ల పనుల్ని పసిగట్టిన పోలీసులు.. హైదరాబాద్ నుంచి జైపూర్ వస్తున్నారని తెలుసుకున్నారు. విమానం దిగిన వెంటనే వీళ్లను అరెస్ట్ చేశారు. ప్రస్తుతానికైతే ఐదుగురే దొరికారు. మరో 50 మంది వరకు ఉంటారని అనుమానిస్తున్నారు.