సనాతన ధర్మంపై అసహ్యమైన రాద్ధాంతం!

‘సనాతన ధర్మాన్ని’ నిర్మూలించాలి అని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ అన్న మాటలు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెనుదుమారాన్ని రేకెత్తించాయి. ఎప్పుడైతే తన మాటలు వివాదాన్ని రేకెత్తించాయో.. ఆ వెంటనే దానిని సద్దుమణిగేలా…

‘సనాతన ధర్మాన్ని’ నిర్మూలించాలి అని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ అన్న మాటలు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెనుదుమారాన్ని రేకెత్తించాయి. ఎప్పుడైతే తన మాటలు వివాదాన్ని రేకెత్తించాయో.. ఆ వెంటనే దానిని సద్దుమణిగేలా చేయడానికి ఉదయనిధి స్టాలిన్ తన వంతు ప్రయత్నం చేశారు. 

తన మాటల ఉద్దేశం అది కాదని చెప్పారు. తన మాటలు వక్రీకరణకు గురయ్యాయన్నారు. తాను సనాతన ధర్మాన్ని ఏమీ అనలేదని, అందులో ఉన్న కులమతాలను నిర్మూలించాలని మాత్రమే అన్నానని ఉదయనిధి చాలా స్పష్టంగా సెలవిచ్చారు. కులమతాల వ్యత్యాసాలు కేవలం హిందూత్వంలో మాత్రమే కాకుండా.. అన్ని మతాల్లోనూ ఉన్నాయని, ఆ వ్యత్యాసాలు అన్నింటినీ కూడా నిర్మూలించాలని ఉదయనిధి చాలా స్పష్టంగా చెప్పారు.

కానీ కాషాయదళాలు మాత్రం.. ఈ విషయాన్ని వీలైనంత ఎక్కువ రాద్ధాంతం చేయడానికే ఎగబడుతున్నాయి. తలతీసుకురమ్మని పురమాయించే వాడు ఒకడైతే, ఆయన పదవినుంచి బర్తరఫ్ చేయాలని అనేవాడు ఇంకొకడు. తల తీసుకురమ్మని, అందుకు అయిదు కోట్లు ఇస్తానని చెప్పిన వ్యక్తి మీద పోలీసులు కేసు నమోదు చేయకుండా ఎందుకు చోద్యం చూస్తున్నారు. 

ఈ దేశంలో ఇంత దుర్మార్గమైన రాజకీయం నడిపిస్తున్నారా? అనే సందేహాలు ప్రజలకు కలుగుతున్నాయి. అలాగే.. ఉదయనిధి స్టాలిన్ ను పదవినుంచి బర్తరఫ్ చేయాలని అడిగేవారిని చూస్తే కూడా జాలేస్తుంది. నాయకులుగా చెలామణీ అవుతున్న వారికి అసలు ప్రజాస్వామ్యం అంటే ఏంటో తెలుసా? అనే అనుమానమూ కలుగుతుంది. ‘సనాతన ధర్మం’ అనే పదం చుట్టూతా.. భారతీయ జనతా పార్టీ చాలా అసహ్యమైన రాద్ధాంతం చేస్తూఉంది.

సనాతన ధర్మం అనే పదాన్ని కాసేపు పక్కన పెడదాం. ఆ పదాన్ని మినహాయిస్తే.. ఉదయనిధి చెప్పిన కంటెంట్ ఏమైనా ఉన్నదా?లేదా? ఆయన చాలా స్పష్టంగా కులాల వ్యత్యాసాల నిర్మూలన గురించి మాత్రమే చెప్పారు. ఇప్పుడు ఉదయనిధి మాటలను వ్యతిరేకిస్తున్న వారంతా.. కులాల వ్యత్యాసాలు రాజ్యమేలాలని పరోక్షంగా పిలుపు ఇస్తున్నట్టుగా అనుకోవాలా? 21 వశతాబ్దంలో ప్రపంచం పురోగమిస్తున్నప్పుడు.. ఇంకా కులాల తేడాలు వర్ధిల్లాలని కోరుకునే ప్రబుద్ధులు ఉంటారని తెలిస్తేనే జుగుప్స కలుగుతుంది.

ఉదయనిధి మాటలను విమర్శించదలచుకున్న వారు.. సనాతన అనే పదాల గారడీని వదిలేసి.. ఆయన లేవనెత్తిన కులాల అంశం గురించి మాట్లాడాలి. ఉదయనిధి చెప్పినట్టు.. ఈ దరిద్రపు అలవాట్లు అన్ని కులాల్లోనూ ఉన్నాయి. వాటి గురించి వారు ఆలోచించాలి. ఎటూ అధికారంలో ఉన్నవారే గనుక.. కులాల నిర్మూలన కోసం ఏం చేయగలరో ఆలోచించాలి.