నారా లోకేష్. డైరెక్ట్ ఎలక్షన్లలో ఒక్కసారి సైతం గెలవలేదు. అయితేనేమి తెలుగుదేశం పార్టీకి హోల్ సేల్ పెత్తందారు. తండ్రికి ఏకైక కుటుంబ రాజకీయ వారసుడు కావడం ఆయన చేసుకున్న అదృష్టం. అలా ఏ పోటీ లేని లోకేష్ పెద్దల సభకు వెళ్ళి మరీ అయిదు కీలక శాఖలకు మంత్రి అయిపోయారు. అదే ఊపులో ఎమ్మెల్యే అయిపోదామనుకుంటే 2019లో జనాలు మంగళగిరిలో ఓడించారు.
ఈ నాలుగేళ్ళ కాలంలో లోకేష్ రాజకీయంగా ఏ మేరకు ఇమేజ్ పెంచుకున్నారో తెలియదు కానీ తమ్ముళ్లకు మాత్రం ఆయనలో బాహుబలి కనిపిస్తున్నారు. ఇంకా ఒక్క అడుగు కూడా పడలేదు, కాలు బయటపెట్టలేదు అపుడే జయహో లోకేశా అని కీర్తనలు అందుకున్నారు. లోకేష్ పాదయాత్ర అంటే వైసీపీని వణుకు అంటున్నారు.
లోకేష్ పాదయాత్ర అపుడే విజయవంతం అయింది అని చెప్పేసుకుంటున్నారు అంటే ప్రచార కక్కూర్తి ఏ రేంజిలో ఉందో అర్ధమవుతోంది అని వైసీపీ నేతల నుంచి సెటైర్లు పడుతున్నాయి. లోకేష్ పాదయాత్ర చేస్తే వైసీపీ సర్కార్ ఇక ఇంటికే అని విశాఖ తెలుగుదేశం ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాసరావు అంటున్నారు. లోకేష్ ని ఏ జీవోలూ అడ్డుకోలేవని ఆయన ఖండితంగా చెబుతున్నారు.
లోకేష్ పాదయాత్రకు ఎంతమంది వస్తారు అని అడగడం ఏంటి, అది చాలా కష్టమైన జవాబు, ఎంత మంది రారో అడగండి సులువైన జవాబు మా దగ్గర ఉంది చెబుతామని అంటున్నారు రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత. లోకేష్ పాదయాత్ర అంటేనే భయపడుతున్న వైసీపీ నేతలు అని ఎద్దేవా చేస్తున్నారు. ఆయనకు బ్రహ్మాండమైన జనాదరణ ఉంది అని అంటున్నారు.
ఆలూ లేదూ చూలూ లేదు అన్నట్లుగా లోకేష్ పాదయాత్ర ఇంకా మొదలుకాకుండనే ఈ తరహా హైప్ క్రియేట్ చేసి పెడితే రేపటి రోజున చినబాబుకే పెద్ద ఇబ్బందిగా మారుతుందని గుర్తించాలని అంటున్నారు. లోకేష్ ఒక్కడు చాలు జగన్ సర్కార్ ని సాగనంపడానికి అంటున్న తమ్ముళ్లను చూస్తే చూస్తే ఇన్నాళ్ళూ ఆయనలో ఇంతటి నాయకత్వపు ఠీవిని చూడలేదా అని వైసీపీ నుంచి కౌంటర్లు పడుతున్నాయి. అయినా కానీ లోకేష్ వంటి నాయకుడు ఉండగా పొత్తుల కోసం ఈ వెంపర్లాట దేనికి తమ్ముళ్ళూ అంటే ఏమంటారో అని వైసీపీ నేతలు అంటున్నారు.