త్వరలోనే ఎన్నికలు వస్తాయని, వైసీపీ ప్రభుత్వం పనైపోతుందని చంద్రబాబు తన నోటికొచ్చినట్టు ఏదో మాట్లాడేశారు. ఫ్రీగా జూమ్ దొరకడంతో బాబు మాటలకు హద్దు-అదుపు ఉండడం లేదు. ఈ క్రమంలో మరో 24 నెలల్లో జగన్ సర్కార్ పనైపోతుందంటూ బాబు చేసిన అర్థంలేని వ్యాఖ్యలపై వైసీపీ మండిపడింది. తాజాగా దీనిపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. తనదైన శైలిలో బాబుపై పంచ్ వేశారు.
“ప్రజాస్వామ్యంలో ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు అవుతాయి. కానీ మధ్యలోనే ఎన్నికలు రావాలనేది చంద్రబాబు ఆశ. అలా ఎందుకొస్తాయి. పోనీ ఒకవేళ వచ్చాయనే అనుకుందాం. ఇంకో ఐదేళ్లు చంద్రబాబు ప్రతిపక్షంలోనే ఉంటారు. అంతకుమించి పెద్ద మార్పు ఏం జరగదు. ఇది జగమెరిగిన సత్యం. బాబు ఏం ఉద్ధరించారని ఆయనకు జనం ఓట్లేస్తారని అనుకుంటున్నారో నాకైతే అర్థం కావడం లేదు.”
ఇలా బాబు గాలి తీసి పడేశారు బొత్స. మరోవైపు ఉచిత విద్యుత్ విధానంపై చంద్రబాబు చేస్తున్న ఆరోపణల్ని కూడా సక్సెస్ ఫుల్ గా తిప్పికొట్టారు బొత్స. జీవో నంబర్ 22ను ఉపసంహరించుకోవాల్సిన అవసరం లేదని.. మరో 30-35 ఏళ్ల పాటు రైతులకు ఉచిత విద్యుత్తుకు ఢోకా లేదని ప్రకటించారు.
ఇకపై రైతులకు ఉచిత విద్యుత్ అంశానికి సంబంధించి ప్రభుత్వం రైతుల పేరిట ప్రత్యేక బ్యాంక్ ఖాతాలు తెరుస్తుంది. రైతులు ఎంత విద్యుత్ వాడితే ఆ మేరకు కరెంట్ బిల్లు మొత్తాన్ని ఆ ఖాతాలో ప్రభుత్వం జమచేస్తుంది. అది అట్నుంచి అటు నేరుగా సదరు విద్యుత్ సంస్థ ఖాతాకు చేరుతుంది. కేంద్ర సంస్కరణల్లో భాగంగా తీసుకురాబోతున్న ఈ విధానం వల్ల మరింత పారదర్శకత, జవాబుదారీతనం వస్తుంది.
ఈ ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా త్వరలోనే శ్రీకాకుళం జిల్లాలో ప్రవేశపెట్టబోతున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలనేది లక్ష్యం.