జ‌గ‌న్‌లో ఆగ్ర‌హం…తోక క‌ట్ చేయ‌డ‌మే త‌రువాయి!

ప్ర‌భుత్వాన్ని అప్ర‌తిష్ట‌పాలు చేసేలా ఏపీ ప్ర‌భుత్వ ఉద్యోగుల సంఘం వ్య‌వ‌హ‌రించింద‌ని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ క‌న్నెర్ర చేశారు. ఏదైనా వుంటే త‌మ‌తో చెప్పుకోవాల‌ని, ప్ర‌తిప‌క్షాల‌కు రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలు క‌ల్పించే కుట్ర‌లో భాగంగా గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్…

ప్ర‌భుత్వాన్ని అప్ర‌తిష్ట‌పాలు చేసేలా ఏపీ ప్ర‌భుత్వ ఉద్యోగుల సంఘం వ్య‌వ‌హ‌రించింద‌ని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ క‌న్నెర్ర చేశారు. ఏదైనా వుంటే త‌మ‌తో చెప్పుకోవాల‌ని, ప్ర‌తిప‌క్షాల‌కు రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలు క‌ల్పించే కుట్ర‌లో భాగంగా గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్‌ను క‌లిసి ఫిర్యాదు చేశార‌ని ప్ర‌భుత్వ పెద్ద‌లు ఆగ్ర‌హంగా ఉన్నారు. అలాగే సోద‌ర ఉద్యోగుల సంఘాలు కూడా గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసి ఏపీ ప్ర‌భుత్వ ఉద్యోగుల సంఘం నేత‌ల తీరును త‌ప్పు ప‌ట్టాయి. ఆ సంఘం గుర్తింపును ర‌ద్దు చేయాలంటూ ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేసిన సంగ‌తి తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో ఊహించిన‌ట్టుగానే ఏపీ ప్ర‌భుత్వ ఉద్యోగుల సంఘం తోక క‌ట్ చేసేందుకు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ సిద్ధ‌మయ్యారు. అస‌లే జ‌గ‌న్‌లో అనుగ్ర‌హం వ‌చ్చినా, ఆగ్ర‌హం వ‌చ్చినా భ‌రించ‌డం సాధ్యం కాద‌నే స‌ర‌దా కామెంట్స్ గురించి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో త‌న ప్ర‌భుత్వంపై గ‌వ‌ర్న‌ర్‌కు ఫిర్యాదు చేయ‌డాన్ని సీఎం జ‌గ‌న్ ఏ మాత్రం క్ష‌మించ‌డానికి సిద్ధంగా లేరు. ఇందులో భాగంగా గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసి ప్ర‌భుత్వ ఉద్యోగుల సంఘానికి నోటీసు జారీ చేసింది.

వేత‌నాలు, ఇత‌ర ఆర్థిక ప్ర‌యోజ‌నాల‌పై ప్ర‌భుత్వానికి విన్న‌వించే మార్గాలుండ‌గా, గ‌వ‌ర్న‌ర్‌ను క‌ల‌వాల్సిన అవ‌స‌రం ఏమొచ్చిందో వివ‌ర‌ణ ఇవ్వాల‌ని నోటీసులో కోరింది. అలాగే రోసా నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిశార‌ని, సంఘం గుర్తింపును ఎందుకు ర‌ద్దు చేయ‌కూడ‌దో చెప్పాల‌ని ప్ర‌భుత్వం ప్ర‌శ్నించింది.

గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసిన అనంత‌రం ఏపీ ప్ర‌భుత్వ ఉద్యోగుల సంఘం అధ్య‌క్షుడు సూర్య‌నారాయ‌ణ మాట్లాడుతూ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. త‌మ సంఘం కంటే ఇత‌ర ఉద్యోగ సంఘాల‌కు ప్ర‌భుత్వం ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంద‌నే అక్క‌సుతోనే సూర్య‌నారాయ‌ణ రాజ‌కీయంగా టార్గెట్ చేశార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ప్ర‌భుత్వ ఉద్యోగుల సంఘం బ్లాక్ మెయిల్‌కు లొంగ‌కూడ‌ద‌ని ప్ర‌భుత్వం గ‌ట్టిగా నిర్ణ‌యించుకుంది. ప‌రిధి దాటి వ్య‌వ‌హ‌రించిన ఉద్యోగ సంఘం అంతు తేల్చేందుకే ప్ర‌భుత్వం ముందడుగు వేసింద‌ని తాజా ప‌రిణామాలు తెలియ‌జేస్తున్నాయి.

మ‌రోవైపు త‌మ‌కు ఇచ్చిన నోటీసుపై వారంలోపు స‌మాధానం ఇచ్చేందుకు ఏపీ ప్ర‌భుత్వ ఉద్యోగుల సంఘం నేత‌లు త‌ర్జ‌న‌భ‌ర్జ‌న ప‌డుతున్నారు. త‌మ‌పై వేటు వేసేందుకే ప్ర‌భుత్వం సిద్ధ‌మైంద‌ని, ఎన్ని వివ‌ర‌ణ‌లు ఇచ్చినా ప్ర‌యోజనం వుండ‌ద‌ని నేత‌లు అంటున్నార‌ని తెలిసింది. అలాగ‌ని వివ‌ర‌ణ ఇవ్వ‌కుండా త‌మ వైపు త‌ప్పు ఉంచుకోవాల‌ని వారు అనుకోవ‌డం లేదు. చివ‌రికి ఏ మ‌లుపు తిరుగుతుందో చూడాలి.