ప్రధాన ప్రతిపక్షం టీడీపీతో అధికార పక్షం వైసీపీ చెలగాటం అడుతోంది. శుభమా అని లోకేశ్‌తో పాదయాత్ర మొదలు పెట్టాలనుకుంటే … అనుమతిపై ఎటూ తేల్చకుండా ప్రభుత్వం ఆడుకుంటోంది. మరోవైపు యువగళం పేరుతో లోకేశ్ చేయాలనుకుంటున్న పాదయాత్రకు సంబంధించి ఏర్పాట్లను చురుగ్గా చేస్తున్నారు. పాదయాత్ర మొదలు పెట్టడానికి కేవలం మూడు రోజులు మాత్రమే గడువు వుండడం, పోలీసుల నుంచి గ్రీన్ సిగ్నల్ లభించకపోవడంతో టీడీపీ నేతల్లో షుగర్, బీపీలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి.
వైసీపీ ప్రభుత్వ వైఖరి చూస్తుంటే అనుమతి నిరాకరిస్తుందేమో అనే అనుమానాలు టీడీపీ నేతల్లో పెరుగుతున్నాయి. అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా పాదయాత్ర జరిగి తీరుతుందని చంద్రబాబు, అచ్చెన్నాయుడు తదితర నేతలంతా తేల్చి చెప్పారు. అనుమతి విషయమై ఎటూ తేల్చని పోలీస్ బాస్‌పై టీడీపీ, సీపీఐ నేతలు ఓ రేంజ్లో విరుచుకుపడుతున్నారు. డీజీపీ ఐపీఎస్ చదివాడా? లేక దొంగ సర్టిఫికెట్లతో వచ్చాడా? అని నిలదీసే పరిస్థితికి ప్రతిపక్ష నేతలొచ్చారు.
ప్రధానంగా ఇటీవల తీసుకొచ్చిన జీవో నంబర్-1పై హైకోర్టు విచారిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం నాన్చివేత ధోరణి ప్రదర్శిస్తున్నట్టు అర్థమవుతోంది. ఈ జీవోపై హైకోర్టు ఆదేశాలను అనుసరించి ముందుకెళ్లాలని ఏపీ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఇవాళ ఈ జీవోపై హైకోర్టు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. తీర్పు ఎలా వస్తుందనే ఉత్కంఠ అన్ని రాజకీయ పార్టీల్లోనూ వుంది. ఒకవేళ జీవో నంబర్-1ను హైకోర్టు సమర్థిస్తే మాత్రం … లోకేశ్ పాదయాత్రపై నీలి నీడలు అలుముకున్నట్టే.
లోకేశ్ పాదయాత్ర ముందుకు సాగడం అనేది ఏపీ హైకోర్టు తీర్పుపై ఆధారపడి వుందని చెప్పొచ్చు. ఈ జీవోను కొట్టేస్తే… ఇక అడ్డంకులు వుండకపోవచ్చు. మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే తప్ప, పోలీసులు జోక్యం చేసుకోరు. అలా కాకుండా హైకోర్టులోనే ప్రతిపక్షాలకు చుక్కెదురైతే భవిష్యత్ కార్యాచరణపై వారు ఎలా వ్యవహరిస్తారనేది చూడాల్సి వుంది. ప్రస్తుతానికి హైకోర్టు తీర్పు కోసం టీడీపీ ఎదురు చూడడం తప్ప, విమర్శలు ఎన్ని చేసినా ప్రయోజనం వుండదు.