జనసేన తెలుగుదేశం పార్టీల పొత్తు రాయలసీమ వరకూ ప్రభావం ఎలా ఉంటుందనే అంశం గురించి పరిశీలిస్తే.. ఈ పొత్తు ఉన్నా లేకపోయినా ప్రభావం మాత్రం ఒకే రకంగా ఉండవచ్చని స్పష్టం అవుతోంది. రాయలసీమలో తెలుగుదేశం పార్టీ, జనసేన ల సంప్రదాయ ఓటు బ్యాంకు దాదాపు ఒకే రీతిలో ఉంటుంది. సీమలో తెలుగుదేశం పార్టీ ప్రధాన ఓటు బ్యాంకులో బలిజల స్థానం కూడా ముందు వరసలో ఉంటుంది. రాయలసీమ వరకూ బలిజల్లో కూడా భిన్నమైన రకాలున్నారు. కొందరు బలిజలు ఓసీలు అయితే, మరి కొందరు బీసీలు. ఒకే ఇంటి పేరుతో ఉండే వారు కూడా కొందరు ఓసీల్లో మరి కొందరు బీసీల్లో ఉంటారంటే ఇది ఎంత గందరగోళమో అర్థం చేసుకోవచ్చు. ఓసీ, బీసీ అని కాకుండా… బలిజల్లో చాలా మంది తెలుగుదేశం పార్టీ మద్దతుదార్లు.
పుట్టపర్తి, అనంతపురం, శింగనమల, తిరుపతి, రాజంపేట, వంటి నియోజకవర్గాల్లో బలిజల జనాభా గట్టిగా ఉంటుంది. వీటిల్లో 50 వేలు ఆ స్థాయికి మించి బలిజల జనాభా ఉంటుంది. తెలుగుదేశం, జనసేనల పొత్తు కేవలం కులం ఆధారంగానే జరుగుతూ ఉంది. కోస్తాంధ్రలో కాపుల ఓట్లను కొల్లగొట్టే వ్యూహంతోనే పవన్ తో పొత్తు కోసం చంద్రబాబు ఆరాటం అనేది అందరకీ తెలిసిన విషయమే.
పవన్ కల్యాణ్ హడావుడి కూడా కాపుల ఓట్లన్నీ తన వద్ద ఉన్నాయనే. అయితే మరి కాపుల ఓట్ల సంగతేమో కానీ రాయలసీమ వరకూ పవన్ ను ఓన్ చేసుకునే, పవన్ ఓన్ చేసుకునే బలిజల ఓట్లు మాత్రం జనసేన వద్ద లేవు!
ఏదో యుక్తవయసు బలిజ కుర్రాళ్లు జనసేన అనొచ్చు కానీ, ప్రజారాజ్యం ఆవిర్భావం తర్వాత కానీ, జనసేన రావడంతో కానీ బలిజల్లో మెజారిటీ మంది ఆ పార్టీ ల వైపు చూడలేదు. జనసేన తర్వాత కానీ తెలుగుదేశం వైపు ఉన్న బలిజలు అటు వైపే ఉంటూ వచ్చారు కానీ ఈ పార్టీల వైపు రాలేదు. వచ్చినా అది పరిమిత స్థాయిలో మాత్రమే.
ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కి బలిజల ఓట్లు అక్కర్లేదు అని కాదు కానీ, ఆ పార్టీకి మొదటి నుంచి ఈ వర్గంలో ఆదరణ శూన్య స్థాయిలోనే ఉంది. రాయలసీమలో బీసీలు తెలుగుదేశం పార్టీకి చాలా వరకూ దూరం అయ్యి , వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జై కొట్టారు. బోయలు, కురుబలు ఇక్కడ రాజకీయ సీన్ ను మార్చారు. వచ్చే ఎన్నికల్లో కూడా రాజకీయం బీసీల ఓట్ల మీదే ప్రధానంగా ఆధారపడి ఉంటుంది. కర్నూలు, అనంతపురం జిల్లాల్లో బీసీలు ఎటు మొగ్గితే అటే అధికారం మొగ్గుతుంది.
ఆల్రెడీ తెలుగుదేశం వైపే ఉన్న బలిజలు ఇప్పుడు జనసేన-టీడీపీ పొత్తుతో మరింతగా హత్తుకుపోయినా పొలిటికల్ సీన్ మారేది ఉండకపోవచ్చు. బలిజలు నిర్ణయాత్మాక శక్తిగా ఉన్న నియోజకవర్గాలను జనసేనకు ఇచ్చినా, అక్కడి టీడీపీ వర్గాలు ఆ పార్టీని ఓడించడంలో కూడా పెద్ద విడ్డూరమూ లేదు!